Suryaa.co.in

Telangana

పునరుత్పాద‌క విద్యుత్తు ఉత్ప‌త్తిపై ప్ర‌త్యేక దృష్టి

-ఐదు ఏండ్లుగా పాల‌సీ లేక‌పోవ‌డంతో రాష్ట్రానికి న‌ష్టం
-ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, బ‌హిరంగ ప్ర‌దేశాల్లో సౌర విద్యుత్తు ఉత్ప‌తికి ఏర్పాట్లు
-సాగునీటి జ‌లాశాయాల‌పై ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్తు ఉత్ప‌త్తికి చ‌ర్య‌లు
-ప్ర‌జాభ‌వ‌న్‌లో టిఎస్ రెడ్కో అధికారుల‌తో డిప్యూటి సీఎం భ‌ట్టి విక్ర‌మార్క స‌మీక్ష‌

మారుతున్న కాల‌మాన ప‌రిస్థితులు, కేంద్రం ఇత‌ర సంస్థ‌ల నుంచి అందుతున్న ఆర్ధిక స‌హ‌యం త‌దిత‌ర అంశాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్ర‌యోజ‌నాల దృష్ట్యా పునరుత్పాద‌క విద్యుత్తు ఉత్ప‌త్తిపై ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని డిప్యూటి సీఎం భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు. శుక్ర‌వారం ప్ర‌జాభ‌వ‌న్ లో పునరుత్పాద‌క విద్యుత్తు ఉత్ప‌త్తిపై టి.ఎస్ రెడ్కో అధికారుల‌తో డిప్యూటి సీఎం స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ రాష్ట్రంలో కాలుష్య ర‌హిత విద్యుత్తు ను ఉత్ప‌త్తి చేయ‌డానికి పుణ‌రుత్పాద‌క విద్యుత్తు వ‌న‌రుల‌పై దృష్టి కేంద్రీక‌రించాల‌ని అధికారుల‌ను అదేశించారు. పుణ‌రుత్పాద‌క విద్యుత్తు పెంచుకునేందుకు బ‌హిరంగ స్థ‌లాలు, ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, జ‌లాశాయాలను గుర్తించి అవ‌స‌ర‌మైన ప్ర‌తిపాద‌న‌లు వెను వెంట‌నే సిద్దం చేయాల‌ని చెప్పారు. గ్రీన్ ప‌వ‌ర్ ఉత్ప‌త్తికి అవ‌స‌ర‌మైన అన్ని శాఖ‌ల‌ను భాగ‌స్వాములుగా చేసి త్వ‌ర‌లో స‌మీక్ష చేస్తామ‌న్నారు.

ప్ర‌త్యేక‌ పాల‌సీ లేక‌పోవ‌డం మూలంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వినియోగించుకోలేక‌పోయామ‌ని, కాల‌మాన ప‌రిస్థితుల్లో పెరుగుతున్న కాలుష్యాన్ని త‌గ్గించుకోలేక‌పోయామ‌న్నారు. త్వ‌ర‌లో సాగునీటి శాఖ అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకొని ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్తు ఉత్పత్తిని అందుబాటులోకి తెచ్చే ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని ఆదేశించారు.

ఈ స‌మావేశంలో టి.ఎస్ రెడ్కో వైస్ అండ్ చైర్మెన్ జాన‌య్య‌, సింగ‌రేణి సంస్థ‌ల చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ ఎన్‌. బ‌ల‌రాం, టి.ఎస్ రెడ్కో జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ జిఎస్‌వి ప్ర‌సాద్‌, ప్రాజెక్టు డైరెక్ట‌ర్లు రామ‌కృష్ణ‌, కిర‌ణ్ కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE