Suryaa.co.in

Devotional

ఆధ్యాత్మిక జీవనము

మన అజ్ఞానాన్ని జయించి ఆధ్యాత్మిక అనుభూతిని పొందడం ఎలా అన్నది మన సందేహం. అజ్ఞానాన్ని అంత తేలికగా తెలుసుకోలేము. అది విభిన్నరూపాలలో దర్శనమిస్తుంది. దాని మొదటి రూపం అహంకారం. ఇది ఆత్మను కప్పివేస్తుంది. ఆ తర్వాత వచ్చేవి కోరికలు లేదా మమతానురాగాలు. వీటికి ఏదన్నా అడ్డు తగిలినప్పుడు కోపం, భయం తయారవుతాయి.

అజ్ఞానం, అహంకారం, మానవ సహజమైన పశు ప్రవృత్తులు, మనిషిని ప్రపంచంతో బంధించి ఉంచుతున్నాయి. ఆధునిక మానసిక శాస్త్ర నిపుణులు భావ గ్రంథుల గురించి చెపుతుంటారు. వీటిలో మూడు రకాలున్నాయి. కామ సంబంధమైనవి, అహంకార సంబంధమైనవి, సంఘజీవన సంబంధమైనవి.

వీటి బంధాల నుంచి పూర్తిగా బయట పడితే తప్ప ఆధ్యాత్మిక జీవనం ప్రారంభం కాదు. ఆధ్యాత్మిక సాధనలో మనం చేసేది ఇదే. మానవ సహజమైన ప్రవృత్తుల నుంచి విడివడడం ఒక్క రోజులో సాధ్యమయ్యే పని కాదు. మనకు ఎదురొచ్చే అడ్డంకులు ఎక్కడో బయట నుంది కాక మన నుండే వస్తాయి.మనకు మనమే అతి పెద్ద ప్రతిబంధకం. నిజానికి బాహ్యమైన ప్రతిబంధకాలు, మనలోనే తయారయ్యే వాటితో పోలిస్తే, చాలా చిన్నవి. మన వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా పునర్నిర్మించాలి. ఇది ఎలా సాధ్యం? ప్రపంచంలోని వివిధ వర్గాలకు చెందిన ఆధ్యాత్మిక పురుషులు, యోగులు అనేక మార్గాలను మన కోసం కనిపెట్టారు.

సేకరణ : హైందవ పరిషత్ చారిటబుల్ ట్రస్ట్

LEAVE A RESPONSE