-అయోధ్యలో అద్భుతం
-‘సూర్య తిలకం’ కోసం ప్రత్యేక టెక్నాలజీ
అయోధ్యలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి.. అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత తొలి శ్రీరామ నవమి కావడంతో వేడుకలను ఆలయ అధికారులు ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా ఉదయం 3.30 గంటలకు బ్రహ్మ ముహూర్తంలో స్వామి వారిని మేల్కొలిపారు. మంగళ హారతి, దివ్యాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ఇవాళ నవమి సందర్భంగా రాత్రి 11 గంటల వరకూ రామ్‌లల్లా దర్శనాలు కొనసాగనున్నాయి.
మరోవైపు, ఈ రోజు మధ్యాహ్నం 12.16 గంటలకు సూర్య కిరణాలు బాలరాముడి నుదుటన తిలకంగా నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు కనిపించనున్నాయి. ఇవాళ ఉదయం పూజకు సంబంధించిన ఫొటోలను ఆలయ ట్రస్ట్ ఎక్స్ వేదికగా దేశ ప్రజలతో పంచుకుంది.
శ్రీరామ నవమి పర్వదినాన అయోధ్యలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. రామాలయం గర్భగుడిలో ఉన్న బాల రాముడి నుదుటిని సూర్య కిరణాలు ముద్దాడాయి. సూర్యాభిషేకం, సూర్య తిలకంగా వ్యవహరిస్తున్న ఈ అద్భుత దృశ్యాన్ని రామ భక్తులు కనులారా వీక్షించారు. రామ మందిరం మూడో అంతస్తు నుంచి ఏర్పాటు చేసిన కటకాలు, అద్దాలు, గేర్ బాక్సులు, గొట్టాల ద్వారా సూర్య కిరణాలు బాలక్ రామ్ నుదుటిని తాకాయి.