– ఈ జోగీ.. ఆ జోగీ రాసుకుంటే మద్యం రాలిందా!?
– సీబీఐ అంటే …. వైసీపీకి ఒక భరోసా . ఒక నమ్మకం
*మద్యం మాఫియా కేసా!?సీబీఐ ఎంక్వయిరీ కావాలి…
*బందరు గోడౌన్ల లో బియ్యం మాయమయ్యాయని కేసా?! సీబీఐ ఎంక్వయిరీ కావాల్సిందే…
*కల్తీ మద్యం కేసా! ఓకే. సీబీఐ ఎంక్వయిరీ వేయండి…
*నెల్లూరు జిల్లా అంతా తవ్వేశారని కాకాణి పైనేనా కేసు! నిజాలు నిగ్గు తేలాలంటే సీబీఐ కి ఇవ్వాల్సిందే…!
*ఈ జోగీ.. ఆ జోగీ రాసుకుంటే మద్యం రాలిందా!? న్నో న్నో! సీబీఐ ఎంక్వయిరీ వేయండి…!?
*లడ్డూ లో కల్తీయా నాయనా! వెయ్ సీబీఐ ఎంక్వయిరీ…
*మద్యం తో చెవిరెడ్డికి…మర్డర్లతో పిన్నెల్లికి ఏంటి సంబంధం!?.వెయ్యండి సీబీఐ ఎంక్వయిరీ…
సీబీఐ! అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు సంక్షిప్తనామం – సీబీఐ
దేశం లోనే అత్యంత ప్రతిష్టాత్మక దర్యాప్తు సంస్థ. దర్యాప్తు లో భాగం గా… ఈ దేశం లో ఎవరినైనా అది అరెస్ట్ చేయవచ్చు. విదేశాలోని బారత పౌరులను సైతం అరెస్ట్ చేయవచ్చు. దేశం నుంచి పారిపోయిన వాళ్ళను ఇంటర్ పోల్ ద్వారా దేశం లోకి రప్పించవచ్చు. నేరాల దర్యాప్తులో దానికి పరిమితులు లేవు. దాని డైరెక్టర్ ను కూడా…ప్రధాని, లోకసభ లో ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తి తో కూడిన త్రిసభ్య సంఘం ఎంపిక చేస్తుంది. అలా ఎంపికైన అధికారి… కనీసం రెండేళ్ల పాటు ఆ పదవి లో కొనసాగుతారు; ఆయన పదవీ విరమణ వయసుతో సంబంధం లేకుండా..
నిజానికి నేరాల దర్యాప్తులు అనేవి రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉంటాయి. కనుక, ఈ దర్యాప్తులు…. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నేతృత్వం వహించే రాజకీయ వాదుల అభిమతాలకు అనుగుణంగా ప్రభావితం అవుతుంటాయనే అనుమానాలు మన ఆంధ్ర లోనే కాదు , దేశ వ్యాప్తం గా చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి.
మొన్నీమధ్య తమిళనాడులో …. అర్జెంటు గా ముఖ్యమంత్రి అయిపోదామని మహా తొందరలో ఉన్న తమిళ సినిమా నటుడు విజయ్ అనే అతను మొన్న సెప్టెంబర్ 27 న కరూర్ వచ్చినప్పుడు ; వెర్రి జనం ఎగబడడంతో జరిగిన తొక్కిసలాటలో నలభై ఒక్క మంది చనిపోయారు . ఓ వందమంది గాయపడ్డారు . తమిళ నాడు ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది . విజయ్ వెంటనే హై కోర్టు కు వెళ్ళాడు , తమకు రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు పై నమ్మకం లేదని; సీబీఐ దర్యాప్తు కావాలని కోరాడు .
కుదరదు పొమ్మని హై కోర్టు తెగేసి చెప్పింది . అసలు నీకు ఒక రాజకీయ నాయకుడి లక్షణాలు లేవు అని కూడా విజయ్ ను కోప్పడింది . ఒక్క నిముషం కూడా ఆలస్యం చేయకుండా , విజయ్ …. సుప్రీం కోర్టు లో అప్పీలు చేశాడు . “ఐతే ఓకే..” అని సుప్రీం అనడం తో విజయ్ కథ సుఖాంతమైంది .
అలాగే , బెంగాల్ లో కదిలితే సీబీఐ…., మెదిలితే సీబీఐ అంటూ ఆ రాష్ట్రం లోని బీజేపీయులు కలకత్తా హైకోర్టు లో పిటిషన్లు దాఖలు చేస్తుంటారు . అయినా , ఆ రాష్ట్ర ముఖ్యమంత్రమ్మ పరమ మొండి ఘటం కావడం తో …..బీజేపీస్ కి మింగుడు పడడం లేదు ….. సీబీఐ ఎన్ని వేషాలు వేసినా కూడా.
ఏ రాష్ట్రం లోని ప్రతి పక్షానికీ కూడా …. ఆ రాష్ట్రం లోని అధికార యంత్రాంగాన్ని ( దానికే “ప్రభుత్వం “ అని ముద్దు పేరు ) నడిపించే రాజకీయ పక్షం పై నమ్మకం లేకపోవడాన్ని బట్టే – దేశం లో రాజకీయాలు ఏ స్థాయికి దిగజారాయో అర్థం చేసుకోవచ్చు .
అధికార, ప్రతి పక్ష రాజకీయ పార్టీలలో ఒకదానిపై మరో దానికి నమ్మకం లేకపోవడం ఏమిటో అర్థం కాదు . వీరికి మల్లేనే వారూ డబ్బు , సారాయి , క్రికెట్ బ్యాట్లు, కిట్లు , చీరలు , అబద్ధాలు పంపిణీ చేసే గదా గెలిచారు!? కులాలు , మతాలు , ప్రాంతాలు , వర్గాలుగా ఓటర్లను విభజించి ….., భావోద్వేగాలు రెచ్చగొట్టేగడా గెలిచారు . వారికి మల్లే దొంగ హామీలు ఇచ్చేగదా వీరూ గెలిచారు ? అందరూ ఆ తానులో ముక్కలే అయినప్పుడు ; మరి ఒకరిని ఒకరు నమ్మకపోవడం ఏమిటి ?
వైసీపీ అధికారం లో ఉన్నంత కాలమూ …. రాష్ట్రాన్ని వైసీపీస్ నమిలి మింగేస్తున్నారు దేవుడో అంటూ టీడీపీ వారు ఊళ్ళ మీద పడి గుండెలు బాదుకున్నారు . మేం అధికారం లోకి వస్తే , వైసీపీ వాళ్లను చింపి పోగులు పెడతా మన్నారు .
అంటే …. ఏమిటి అర్థం !?
వైసీపీ వారు టోకున అందరూ అవినీతి పరులు అనేగా !
అది నమ్మి , “రాష్ట్ర ప్రభుత్వం” అనే కోశాగారపు తాళం చెవిని వైసీపీ నుంచి జనం లాగేసుకుని , టీడీపీ అండ్ కో కి జనం అప్పగించేశారు . ఇప్పుడు వైసీపీ వారు తగులుకున్నారు . అదనం గా ప్రజా సంఘాల వారు కూడా లంకించుకున్నారు , “ఆ డీల్ లో అంత నొక్కేశారు . ఈ డీల్ లో ఇంత నొక్కేశారు ….” అని .
అంటే టీడీపీ వారు కూడా అవినీతి పరులు అనేగా అర్థం !? కూటమి వారి కంటే వైసీపీ వారే బెటర్ అని కూడా వారు వాదిస్తున్నారు .
తమిళనాడు , కర్ణాటక లోనూ ఇదే కథ . సేమ్ టూ సేమ్.
ఈ విధంగా …. ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసే అదృష్టానికి ఇప్పుడు నోచుకొని వారు …. తాము అధికారం లో ఉన్నప్పుడు పాల్పడిన అరాచకాలపై …. ఇప్పుడు అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసే అదృష్టానికి నోచుకున్న వారు సీఐడీ తోనో , ఎస్ ఐ టీ తోనో దర్యాప్తు చేయిస్తామంటే …. పాత అరాచక వాదులు ఒప్పుకోవడం లేదు .
ఒకటే భయం . తమను జైళ్ల ల్లో వేసేసి…. రేపు ఎన్నికల్లో పోటీ చేయనివ్వరేమోనని భయం .తమ ప్రజాసేవకు కేసుల దర్యాప్తు అడ్డం పడుతుందేమో అని ఆందోళన .
అందుకే , సీబీఐ …. సీబీఐ ….అంటుంటారు ; అక్కడికి అదేదో స్వతంత్ర దర్యాప్తు సంస్థ అయినట్టు .
సీబీఐ దర్యాప్తు అంటే చాలు – నిందితులకు పెద్ద రిలీఫ్ దొరికినట్టే . దశాబ్దాలు గడిచినా సీబీఐ “దర్యాప్తు “ ముగింపుకు రాదు . ముద్దాయిలు ఎవరో తేలరు.
డౌట్ ఉన్న వారు , విజయవాడ లోని ఆయేషా మర్డర్ కేస్ లో సిబిఐ దర్యాప్తు తీరు చూడవచ్చు . అయేషా మీరా అనే ఫార్మసి విద్యార్థిని 2007 డిసెంబర్ లో మర్డర్ అయిపోయింది . మర్డర్ చేసిన వారు , రేప్ కూడా చేశారన్నది ఆరోపణ . ఇప్పుడు 2025 డిసెంబర్ ముంగిట ఉన్నాం. అంటే 18 ఏళ్ల తరువాత కూడా నిందితులు ….. ముద్దాయిలుగా మారలేదు . అసలు దొరకనే లేదని ఆ అభాగ్యరాలి తల్లి దండ్రుల ఆరోపణ , ఆవేదన . అదీ సీబీఐ కత. మన లోకల్ పోలీసులు అయితే ఓ నెలలో తేల్చేసేవారు .
మరీ అంత వేగంగా తేల్చేస్తే ….మన రాజకీయాలు ఏమై పోవాలి !?
అందుకే , సీబీఐ దర్యాప్తు అంటే వైసీపీ కి అంత అభిమానం ఉన్నట్టు కనిపిస్తున్నది.
వైసీపీ అధినేత పై దాదాపు డజను ఛార్జ్ షీట్లు సీబీఐ కోర్టులో దాఖలు చేసి పుష్కర కాలం అయింది . ఇంకా విచారణకు రాలేదు . జగన్ ఒక రౌండ్ ముఖ్యమంత్రి అయ్యారు . ఇంకో రౌండ్ కు రెడీ అవుతున్నారు . ఆ సీబీఐ వారి డజను కేసుల్లో A2 గా ఉన్న విజయసాయి రెడ్డి రెండు విడతలుగా ఎం పీ అయ్యి ; వైసీపీ కి పార్లమెంటరీ లీడర్ అయ్యి , మొత్తం రాజకీయ సరదాలు అన్నీ తీర్చేసుకుని , విశాఖపట్నాన్ని ఒక పట్టు పట్టేసి – ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు . ఆ కేసుల్లో ఛార్జ్ షీట్లు దాఖలు చేసిన అప్పటి సీబీఐ జాయింట్ డైరెక్టర్ వీ వీ లక్ష్మీనారాయణ కూడా పదవీ విరమణ చేసేసి , రాజకీయాల్లోకి వచ్చేసి , రెండు సార్లు ఎన్నికల్లో పోటీ చేశారు గానీ ; ఆయన దాఖలు చేసిన ఛార్జ్ షీట్లకు మోక్ష ప్రాప్తి కలగడం లేదు .
అలాగే, వై ఎస్ వివేకానంద రెడ్డి మర్డరై పోయి ఆరేళ్లు దాటిపోయింది . ఆ కేసు సీబీఅయ్యే దర్యాప్తు చేస్తున్నది . “ దర్యాప్తు చేసినంత వరకు చాలా …. ఇంకా చేయాలా !?” అని అది సుప్రీం కోర్టును అమాయకం గా , కొంటె గా అడుగుతున్నది . అదీ వైసీపీ పట్ల సీబీఐ “దర్యాప్తు “ చేసే తీరు .
తప్పు సీబీఐ ది కాదు . సముద్రం లో కాకిరెట్టంత కేసును పట్టుకుని ఢిల్లీ ముఖ్యమంత్రిని పీడించి …. పీడించి జైల్ లో పడేసి , నానా ఇబ్బందులకూ గురిచేయలేదూ!?
ఢిల్లీ ఆప్ పై అలా…., ఏపీ వైసీపీ నేతలపై ఇలా ఎందుకు సీబీఐ చేస్తున్నది అంటే – సీబీఐ స్వతంత్ర దర్యాప్తు సంస్థ కాదు .
కేంద్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసే మహద్భాగ్యా న్ని 2014 లో దక్కించుకున్న బీజేపీ చేతిలో అదో కీలుబొమ్మ అని …. ఆ మహద్భాగ్యం దక్కని బీజేపీ వ్యతిరేక పార్టీలు దుమ్మెత్తి పోస్తుంటాయి.
సీబీఐ అంటే …. వైసీపీకి ఒక భరోసా . ఒక నమ్మకం . ఓ పదిహేను , ఇరవై ఏళ్ల వరకు తమ ప్రజాసేవ కు అడ్డంకులు ఉండవనే ధైర్యం . అందుకే , జోగి రమేష్ దగ్గరి నుంచి కాకాణి గోవర్ధన రెడ్డి వరకు పలువురు వైసీపీ నేతలు “సీబీఐ ఎంక్వయిరీ వేయండి …. నిజాలు బయటకు వస్తాయి “ అంటుంటారు . ప్రతి పక్షం లో ఉండే చాలామంది రాజకీయ నేరస్తులు సీబీఐ దర్యాప్తు కావాలి అంటుంటారు గానీ ; ఆంధ్రాలో ప్రతిపక్షమైన వైసీపీ కోరినంతగా దేశం లో ఏ రాజకీయపార్టీ కూడా డిమాండ్ చేసి ఉండ దేమో । కదిలితే సీబీఐ ….మెదిలితే సీబీఐ!!
వారి రాజకీయానికి సీబీఅయ్యే శ్రీరామ రక్ష.
– భోగాది వేంకటరాయుడు