అక్షరం గర్జిస్తే..
మాట తూటాలా పేలితే..
పలుకు ములుకులా దిగితే..
అది శ్రీశ్రీ కవిత..!
చదువుతుండగానే
నీలో ఆవేశం పెల్లుబుకితే..
నీకే తెలియని రౌద్రం
నిన్ను ఆవహిస్తే..
నీ రక్తం సలసలా మరగడం
మొదలైతే..
అది శ్రీశ్రీ కవిత..!
పదాలు కత్తుల్లా విచ్చుకుంటే
అవి సూటిగా
నీ గుండెలకు గుచ్చుకుంటే..
నీలో నిద్రాణమై ఉండే శక్తిని మేల్కొలిపితే..
అది శ్రీశ్రీ కవిత..!
నీకు తెలిసిన పదాలే..
నువ్వు మాటాడే భాషే..
నీ గుండె ఘోషే..
కాని వాటి పేర్పు..కూర్పు..
ఆ నేర్పు..అందులో ఓదార్పు..
నీలో వచ్చే మార్పు..
నీలో మొదలయ్యే రణం..
అందుకు కారణం..
అది శ్రీశ్రీ కవిత..!
ప్రతి పలుకు నిప్పు కణిక..
ప్రతి పదం ఓ శపథం..
భావం సరికొత్త పథం..
అదంతా అక్షరాల
అణ్వాయుధం అనిపిస్తే..
మళ్లీ మళ్లీ చదవాలనిపిస్తే
అది శ్రీశ్రీ కవిత..!
రోజులు మారుతున్నా
తరాలు తరలుతున్నా…
అంతరాలు పెరుగుతున్నా..
అవినీతి పేరుకుపోతున్నా
కవులెందరున్నా..
కొత్త కొత్త కావ్యాలే రచిస్తున్నా..
అభిమానుల గుండెల్లో అదే స్ధానం..
తిరుగులేని మహాప్రస్థానం..
అది శ్రీశ్రీ కవిత..!
అవినీతి..అక్రమాలు..
స్కాములు..స్కీములు..
ఉచితాలు..అనుచితాలు..
చిత్తాలు..ప్రాయశ్చితాలు..
పాపాల చిట్టాలు..
అక్రమార్కులకు పట్టాలు..
నీ చుట్టూ
అంతా గందరగోళం..
అందులో మండే అగ్నిగోళం..
అది శ్రీశ్రీ కవిత..!
నిజ దర్శనం..
పాలకుల నిజరూప దర్శనం..
అక్షర విశ్వరూప దర్శనం..
వెరసి నీకు మార్గదర్శనం..
శ్రీశ్రీ కవిత..
ఆవేదనే..ఆవేశమే…
దాని భావుకత..!
శ్రీశ్రీకి మరణం లేదు…
నిలువెల్లా నిప్పును నింపుకున్నోన్ని
అగ్ని ఏం కాలుస్తుంది
మహాకవి మనల్ని
విడిచి వెళ్ళిన రోజు
15.06.1983
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286