– పరామర్శించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
గుంటూరు : పెదనందిపాడు మండలం అనుపర్రు బీసీ బాలుర వసతి గృహంలో అస్వస్థతకు గురి అయిన విద్యార్థుల ఆరోగ్యం పూర్తిగా నిలకడగా ఉందని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు.
పెదనందిపాడు మండలం అనుపర్రు బీసీ సంక్షేమ బాలుర వసతి గృహంలో అస్వస్థతకు గురై గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను శుక్రవారం రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత శాఖ మంత్రి ఎస్ సవిత, ప్రత్తిపాడు శాసన సభ్యుడు బూర్ల రామాంజనేయులతో కలిసి పరామర్శించారు.
జీజీహెచ్ లోని పిల్లల వార్డులో చికిత్స పొందుతున్న విద్యార్థులతో మంత్రి సవిత మాట్లాడి ఆరోగ్య వివరాలు, అస్వస్థతకు కారణాలను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని చెప్పారని, త్వరలోనే డిస్చార్జి చేస్తారని విద్యార్దులకు మంత్రి ధైర్యం చేప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత శాఖ మంత్రి విలేకరులతో మాట్లాడారు. పెదనందిపాడు మండలం అనుపర్రు బీసీ బాలుర వసతి గృహంలో 108 మంది విద్యార్ధులు ఉండగా శుక్రవారం 56 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి అయ్యారన్నారు.
అధికారులు వెంటనే స్పందించి స్థానికంగా విద్యార్ధులకు ప్రాధమిక చికిత్స అందించారని, జ్వరం ఉన్న 16 మందిని మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించటం జరిగిందన్నారు. ప్రస్తుతం విద్యార్దులందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగ ఉందని, కొంతమందిని డిస్చార్జ్ చేశామన్నారు.
బీసీ సంక్షేమ హాస్టల్స్ విధ్యార్థులు అస్వస్థతకు గురైన సమాచారం తెలిసిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్యాబినేట్ సమావేశంలో ఉన్న బీసీ వెల్ఫేర్ డైరక్టర్ ను వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించామని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యపరిస్థితిపై ప్రత్యేకంగా మాట్లాడామని, బీసీ సంక్షేమ హాస్టల్ లో విద్యార్థులు అస్వస్థతకు గురి అవటం బాధకరమని ఇటువంటి సంఘటనలు తిరిగి పునరావృత్తం కాకుండా అవసరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
గత అయిదేళ్ళ సంక్షేమ హాస్టల్స్ నిర్వహణను గాలికి వదిలివేసిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సంక్షేమ హాస్టల్స్ లో అవసరమైన మౌలికసౌకర్యాలు కల్పించటానికి నాణ్యమైన భోజనంతో పాటు, విద్యను అందించేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ పెదనందిపాడు మండలం అనుపర్రు గ్రామంలోని బీసీ బాలుర సంక్షేమ వసతి గృహంలో విద్యార్ధులు అస్వస్థతకు గురి అయ్యరన్న సమాచారం తెలిసిన వెంటనే జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయటంతో పాటు స్థానిక నాయకుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టామని తెలిపారు.
కార్యక్రమంలో రాష్ట్ర రజక కార్పొరేషన్ ఛైర్మన్ మల్లెల ఈశ్వర రావు, బీసీ వెల్ఫేర్ ఎక్స్ అఫిషియో సెక్రెటరీ ఎస్.సత్యనారాయణ , జీజీహెచ్ సూపరెంటెండెంట్ ఎస్ ఎస్ వి రమణ, బీసీ సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు