Suryaa.co.in

Andhra Pradesh

ఇళ్ల దగ్గరే పెన్షన్ల పంపిణీకి చర్యలు చేపట్టాలి

-గత పొరపాట్లు పునరావృతం కాకుండా చూడండి
-తక్షణమే ప్రభుత్వానికి తగిన ఆదేశాలివ్వండి
-రెండు రోజుల్లో పంపిణీ పూర్తి చేయించాలి
-కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత లేఖ

పెన్షన్‌దారులు ఇబ్బందిపడకుండా మే నెల 1వ తేదీనే ఇంటి దగ్గరే పింఛన్ల పంపిణీకి అవసరమై చర్యలు చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం లేఖ రాశారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామస్థాయి ఉద్యోగుల ద్వారా ఇంటివద్దే పెన్షన్‌ పంపిణీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందితో ఇంటింటికీ పెన్షన్లు అందించడం సాధ్యమవుతుందని సీఎస్‌ నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు ఇదివరకే తెలిపారు. లబ్ధిదారులందరికీ ఇంటి వద్దే పెన్షన్‌ అందించా లని గతంలో మేము చేసిన విన్నపాన్ని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పక్కనబెట్టింది.

గత నెలకు సంబంధించిన పెన్షన్‌ సొమ్ము 1వ తేదీన రావాల్సి ఉన్నా…3వ తేదీ వరకు ప్రభుత్వం విడుదల చేయలేదు. పింఛన్ల కోసం మూడురోజుల పాటు సచివాలయాల చుట్టూ తిరిగి ఎండదెబ్బకు 33 మంది వృద్ధులు మృతిచెందారు. వారి మరణాలను ప్రభుత్వం రాజకీయ లబ్ధికోసం ప్రతిపక్ష పార్టీలకు ఆపాదించింది. మే నెలకు సంబంధించి పెన్షన్ల పంపిణీలో ఇటువంటి పరిణామాలు పునరావృతం కాకుండా చూడాలని, రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలివ్వాలని లేఖలో కోరారు. రాష్ట్రంలో తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రతల కారణంగా సచివాలయాల వద్ద వృద్ధులు నిరీక్షిస్తే వారి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకా శం ఉందన్నారు. మానవతా దృక్పథంతో ఆలోచించి లబ్ధిదారుల ఇంటి వద్దకే 1వ తేదీన పెన్షన్‌ పంపిణీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని, పంపిణీని రెండురోజుల్లో పూర్తిచేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇంటి వద్దనే పింఛన్లు పంపిణీ జరుగుతుందున్న సమాచారాన్ని లబ్ధిదారులకు ముందే చెప్పాలని కోరారు.

LEAVE A RESPONSE