-రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు
న్యూఢిల్లీ, మార్చి 20: కృష్ణా నదీ జలాల పంపిణీపై కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రైబ్యునల్-1 (కేడబ్ల్యూడిటి-1) జారీ చేసిన అవార్డుకు లోబడే కర్నాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించినట్లు జల శక్తి మంత్రి బిశ్వేశ్వర్ తుడు వెల్లడించారు. అప్పర్ భద్ర ప్రాజెక్ట్ కారణంగా నదీ పరివాహక ప్రాంతమైన దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో నీటి లభ్యతపై ఏ విధమైన ప్రభావం పడుతుందో అంచనా వేశారా అని రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు.
రాయలసీమతోపాటు కృష్ణా బేసినల్లో వివిధ ప్రాంతాల్లో నీటి లభ్యతను పరిశీలించిన మీదటే కృష్ణా వాటర్ ట్రైబ్యునల్ -1 అవార్డును ప్రకటించింది. ఈ అవార్డును 1976లో కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. అప్పర్ భద్ర ప్రాజెక్ట్‌లో ప్రతిపాదించిన కృష్ణా జలాల వినియోగం కర్నాటక రాష్ట్రానికి ట్రైబ్యునల్ -1 జరిపిన కేటాయింపుల పరిధిలోనే ఉంది. అందుకే సాగునీరు, వరద నియంత్రణ, బహుళార్ధసాధక ప్రాజెక్ట్‌లపై ఏర్పాటైన అడ్వైజరీ కమిటీ అప్పర్ భద్ర ప్రాజెక్ట్‌ను ఆమోదించిందని మంత్రి వివరించారు.
కేంద్ర జల సంఘం (సిడబ్య్లుసి) మార్గదర్శకాల ప్రకారం ట్రైబ్యునల్ అవార్డు ప్రకటించి ఉండి, దానికి అనుగుణంగా కేటాయించిన నదీ జలాల వినియోగం కోసం ప్రణాళికాబద్దమైన ప్రాజెక్ట్ చేపట్టినపుడు ఆ నదీ పరివాహక ప్రాంతంలోని ఇతర రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్ర జల సంఘం కోరబోదని మంత్రి పేర్కొన్నారు. అయితే అప్పర్ భద్ర ప్రాజెక్ట్‌పై 2021 డిసెంబర్లో జరిగిన హై పవర్డ్ స్టీరింగ్ కమిటీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలపై కేంద్ర జల సంఘం ఆంధ్రప్రదేశ్, కర్నాటక అధికారులతో పునఃవిచారణ జరిపింది. అనంతరం 2022 ఫిబ్రవరిలో జరిగిన పవర్డ్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో కృష్ణా ట్రైబ్యునల్-1 అవార్డులో కర్నాటకకు చేసిన నదీ జలాల కేటాయింపులకు లోబడే అప్పర్ భద్ర ప్రాజెక్ట్ నిర్మిస్తున్నట్లు కేంద్ర జల సంఘం పునరుద్ఘాటించిందని జల శక్తి శాఖ సహాయ మంత్రి వివరించారు.
వచ్చే ఏడాది జూన్ నాటికి కాకినాడ-శ్రీకాకుళం గ్యాస్ పైప్‌లైన్
కాకినాడ-వైజాగ్-శ్రీకాకుళం సహజవాయువు పైప్‌లైన్ నిర్మాణం వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తవుతుందని పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలీ తెలిపారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ పైప్‌లైన్ నిర్మాణం 2022 జూన్ 30 నాటికి పూర్తి కావలసి ఉంది. అయితే దీని నిర్మాణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ విజ్ఞప్తి మేరకు పెట్రోలియం, నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు నిర్మాణం గడువును 2024 జూన్ 30 వరకు పొడిగించినట్లు వెల్లడించారు.
కాకినాడ-విశాఖపట్నం-శ్రీకాకుళం సహజవాయువు పైప్‌లైన్ నిర్మాణం, పర్యవేక్షణ కోసం 2014 జూలైలో పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు ఆంధ్రప్రదేశ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్‌ను అధీకృత సంస్థగా నియమించిందని మంత్రి తెలిపారు. 2021 జూన్ 30 నాటికి కాకినాడ నుంచి విశాఖపట్నం వరకు 2022 జూన్ 30 నాటికి విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు గ్యాస్ పైప్‌లైన్ నిర్మాణం పూర్తి చేయాలని గడువు విధించిందని మంత్రి తెలిపారు.
కోవిడ్ మహమ్మారి ప్రభావం, వర్షాకాలం కారణంగా పైప్‌లైన్ నిర్మాణ పనుల్లో ఎదురైన ఇబ్బందులు, నిధుల విడుదలలో జరిగిన జాప్యం కారణంగా నిర్మాణ గడువును పొడిగించాలని ఏపీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ చేసిన విజ్ఞప్తి మేరకు పెట్రోలియం బోర్డు గడువును 2024 జూన్ 30 వరకు పొడిగించినట్లు మంత్రి తెలిపారు.