– పరిశీలించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి. చిన్నారెడ్డి
కుమ్మర: ఒక్క రోజు కురిసిన కుంభ వృష్టి వర్షంతో పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల వట్టెం పంప్ హౌస్ నీట మునిగిన విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి మంగళవారం పరిశీలించారు.నాగర్ కర్నూలు జిల్లా కేంద్రం కుమ్మర గ్రామ శివారులో ఉన్న వట్టెం పంప్ హౌస్ ప్రాంతాన్ని చిన్నారెడ్డి పరిశీలించి ఇంజనీర్లకు దిశా నిర్దేశం చేశారు.
మూడు రోజుల క్రితం ఒక్క రోజులో 14 సెంటి మీటర్ల వర్షం కురవడంతో వట్టెం పంప్ హౌస్ లో నీరు చేరి 5 పంప్ లు నీట మునిగిపోయాయి.నాగర్ కర్నూలు శివారులోని నాగనోల్ చెరువులోకి దాదాపు 50 చెరువుల నీళ్ళు అలుగు పారడంతో ఆ నీరు అంతా వట్టెం పంప్ హౌస్ లోకి చేరి భారీ పంప్ లను ముంచెత్తాయి.
ఈ విషయం తెలుసుకున్న చిన్నారెడ్డి హుటాహుటిన వట్టెం పంప్ హౌస్ ప్రాంతానికి చేరుకుని ఇంజనీర్లు ఎస్. ఈ. సత్యనారాయణ రెడ్డి, ఈ ఈ పార్థ సారథి, డీ ఈ లు సత్యనారాయణ గౌడ్, బాగయ్య లతో సమావేశమై పరిస్థితిని సమీక్షించిన అనంతరం సంఘటన స్థలాన్ని చిన్నారెడ్డి సందర్శించారు.
ఈ ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మాణ సంస్థ ఇంకా ప్రభుత్వానికి అప్పగించనందున పంప్ హౌస్ లోని నీటిని ఎత్తి పోసి పంప్ లను పూర్వ స్థితికి తీసుకొచ్చే బాధ్యత నిర్మాణ సంస్థదే అని, ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక భారం పడదని చిన్నారెడ్డి తెలిపారు.
ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో జాగ్రత్తలు తీసుకోవాలని చిన్నారెడ్డి ఇంజనీర్లకు సూచించారు. వట్టెం పంప్ హౌస్ వద్ద ఉన్న ఒక్కో పంప్ 2,400 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేసే సామర్థ్యం ఉన్న 10 పంప్ లు ఈ ప్రాంతంలో బిగిస్తున్నారు. వట్టెం రిజర్వాయర్ 16 టీ ఎం సీ కెపాసిటీ సామర్థ్యంతో ఉంది.