Suryaa.co.in

Andhra Pradesh

సీఎం సొంత జిల్లాలో సబ్సిడీ విత్తనాలు హుష్ కాకి !

– ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం!
-ఖాజీపేట మండలంలో సచివాలయ ఉద్యోగి చేతివాటం
– 17 గ్రామ సచివాలయాల పరిధిలో రైతులకు అందని సబ్సిడీ జీలుగలు, మినుములు..
– ఆ ఒక్క సచివాలయ పరిధిలో తప్ప.. మిగతా చోట్ల అరకొరగా పంపిణీ..
– అరకొర పంపిణీ పై నోరుమెదపని మండల వ్యవసాయ అధికారి
– అందుబాటులో లేకపోయినా.. రెగ్యులర్ గా అటెండెన్స్.
– ఏఓ తీరుపై అగ్రికల్చర్ అసిస్టెంట్లు, రైతుల ఆగ్రహం
– ఆర్బీకేల్లో సబ్సిడీ విత్తనాలు ఇవ్వకపోవడంతో.. బయటి మార్కెట్లో కొంటున్న వైనం..
మండలంలోని అన్ని ఆర్బీకేల ఇండెంట్లను ఆ ఒక్క గ్రామ సచివాలయానికే కేటాయించిన అధికారులు
మండల వ్యవసాయ అధికారి లాగిన్ తో అవకతవకలకు పాల్పడ్డ గ్రామ సచివాలయ ఉద్యోగి
ఇండెంట్ మొత్తాన్ని బయటి వ్యక్తులకు అమ్మకాలు సాగించిన వైనం
వచ్చిన డబ్బుతో బయటి రాష్ట్రాల్లో జల్సాలు చేస్తున్న సచివాలయ ఉద్యోగిఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ రైతుల డిమాండ్
– సబ్సిడీ విత్తన పంపిణీ లేకపోవడంతో.. బహిరంగ మార్కెట్లో కొంటున్న రైతులు
– రైతుల సబ్సిడీ ఇండెంట్ మొత్తం బయటి వ్యక్తులకు సరఫరా

కడప : సీఎం సొంతజిల్లా కడపలోనే రైతులకు అన్యాయం జరుగుతోంది. రైతుల బాగు కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆర్బీకేల పనితీరు మసకబారుతోంది. రైతుల కోసం పెట్టిన ఆర్బీకేలు ప్రైవేటు వ్యక్తులకు లాభసాటిగా మారుతున్నాయి.

అధికారులు, సిబ్బంది అక్రమాలకు పాల్పడుతూ.. ఆర్బీకేలకు మాయని మచ్చ తీసుకొస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో కిందిస్థాయి అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. రైతుల పొట్టగొడుతున్నారు.

కడప జిల్లాలో రైతు భరోసా కేంద్రాలు రైతులకు మొండిచేయి చూపుతున్నాయి. సబ్సిడీ ద్వారా రైతులకు అందించాల్సిన ఏ ఒక్కటీ సక్రమంగా అందడం లేదు. అదేమని ప్రశ్నిస్తే.. కిందిస్థాయి సిబ్బంది తమకు తెలియదని, పై స్థాయి అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. తమ కోసం ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు ఆమడ దూరం జరుగుతుండటం పై రైతులే విస్మయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి దాపురించింది.

ఓవైపు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పలు కార్యక్రమాల పేరుతో , ప్రజల వద్దకు వెళ్లి తమదింతదని చెప్పుకుంటున్నా.. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. కింది స్థాయి సిబ్బంది పై అధికారుల పర్యవేక్షణ, అధికారులపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ, ఉన్నతాధికారులపై ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడటంతో ఎవరికి వారే యమునా తీరే అన్నచందంగా తయారైంది పరిస్థితి.

ఖాజీపేట మండలంలో మొత్తంగా 17 సచివాలయాలున్నాయి. వాటి పరిధిలో ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ప్రారంభమై పదిరోజులు గడుస్తోంది. వరినాట్లు వేసుకునేందుకు రైతులు సిద్దపడుతున్న క్రమంలో.. ప్రభుత్వం నుంచి సబ్సిడీ పై అందాల్సిన జీలుగలు, జనుములు చాలాచోట్ల అందలేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవడంతో ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు భరోసా కేంద్రాలకు విత్తనాలు సరఫరా చేసి వాటిని రైతులకు సబ్సిడీ కింద అందించాలని ఆదేశాలు కూడా జారీ చేసింది.

అయితే, ఖాజీపేట మండలం పరిధిలో.. ఒక్క సచివాలయం మినహా మిగతా 16 సచివాలయాల పరిధిలోని రైతు భరోసా కేంద్రాల్లో సబ్సిడీ కింద ఇచ్చే జీలుగలు, జనుములు అరకొరగా పంచి మమ అనిపించారు అధికారులు. దీంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. రైతు భరోసా కేంద్రాల సిబ్బంది ద్వారా జీలుగలు, జనుముల కోసం ఇది వరకే పేరు నమోదు చేసుకున్నా.. అరకొరగా విత్తనాలు పంపిణీ చేయడం పై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

అలా ఎందుకు జరిగిందంటూ.. ఆర్బీకేల్లో పనిచేస్తున్న అగ్రికల్చర్ అసిస్టెంట్లను అడిగితే.. తాము కరెక్టుగానే పేర్లు, అవసరమైన విత్తన సమాచారం ఎంట్రీ చేశామని చెబుతున్నారు. కానీ తక్కువ స్థాయిలో విత్తనాలు కేటాయించడం పై వారు మల్లగుల్లాలు పడుతున్నారు.

ఖాజీపేట మండల కేంద్ర పరిధిగా ఉన్న ఓ సచివాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి తన చేతివాటం ప్రదర్శించడంతోనే మండలంలో రైతులకు సబ్సిడీ కింద అందాల్సిన జీలుగలు, జనుములు అందలేదని తెలుస్తోంది. మండల వ్యవసాయ అధికారి లాగిన్ తో మిగతా 16 సచివాలయాల పరిధిలో నమోదైన విత్తన ఇండెంట్ లో చాలా భాగం తన ఖాతాలోకి మల్లించుకున్నట్లు తెలిసింది.

దాంతో ఇండెంట్ మొత్తం ఆ గ్రామ సచివాలయానికే వెళ్లడంతో.. మిగతా ప్రాంతాల్లో అరకొరగానే విత్తనాలు పంపిణీ చేసినట్లు సమాచారం. మొత్తానికి ఆ గ్రామ సచివాలయం పరిధిలో అయినా పూర్తి స్థాయిలో విత్తనాలు పంపిణీ చేశారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. మొత్తం సచివాలయాల పరిధిలోని విత్తన ఇండెంట్ ను తన ఖాతాలోకి మల్లించిన సచివాలయ ఉద్యోగి, దానిని బహిరంగ మార్కెట్ వ్యాపారస్తులకు అమ్ముకున్నట్లు అరోపణలు వినిపిస్తున్నాయి.

అరకొర సబ్సిడీ విత్తనాల సరఫరా పై సచివాలయాల్లో పనిచేసే అగ్రికల్చర్ అసిస్టెంట్లు మండల వ్యవసాయ అధికారిని నిలదీసినా సరైన స్పందన లేనట్లు తెలుస్తోంది. పూర్తి స్తాయిలో ఇండెంట్ పెట్టినా తక్కువ మొత్తంలోనే సబ్సిడీ విత్తనాలు సరఫరా చేయడం పై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక.. రైతులకు ఏం సమాధానం చెప్పాలో పాలుపోక దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు.

సబ్సిడీ విత్తనాల పంపిణీ విషయమై రైతులు నేరుగా ఏఓను ప్రశ్నించగా.. కనీసం నోరుకూడా మెదపడం లేదని సమాచారం. తన లాగిన్ తో ఇండెంట్ మొత్తం ఎక్కడికో వెళ్లిందని.. దానికి తాను ఎలా కారణమవుతానని ఏఓ సచివాలయాల సిబ్బంది దగ్గర అన్నట్లు సమాచారం.

మండలంలోని 17 సచివాలయాల పరిధిలోని రైతులకు సబ్సిడీ కింద పంపిణీ చేయాల్సిన జీలుగలు, జనుములను అరకొరగానే పంపిణీ చేయడంతో రైతులు చేసేదిలేక బహిరంగ మార్కెట్ ను ఆశ్రయించాల్సి వస్తోంది. సబ్సిడీ కింద కేజీ రూ.39 లకే విత్తనాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

కానీ ఎక్కడా ఆర్బీకేల్లో పూర్తి స్థాయి విత్తన పంపిణీ జరగలేదు. దీంతో రైతులు బహిరంగ మార్కెట్లో కేజీ విత్తనాలకు రూ.60 లు చెల్లించి కొంటున్నారు. సబ్సిడీ విత్తనాల కోసం ఆర్బీకేల చుట్టూ తిరిగి వేసారిన రైతులు చేసేదిలేక బయటి మార్కెట్లో విత్తనాలు కొనుగోలు చేసి ఖరీఫ్ కు సిద్దపడుతున్నారు.

ఖరీఫ్ లో మండల రైతులకు సబ్సిడీ కింద అందించాల్సిన జీలుగలు, జనుములను ఆ గ్రామ సచివాలయ ఉద్యోగి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ లాగిన్ ద్వారా ఇండెంట్ ను తన ఖాతాకు బదిలీ చేసుకుని.. ఆ వచ్చిన విత్తనాలను బయటి వ్యక్తులకు అమ్ముకున్నట్లు తెలుస్తోంది. రైతులకు అందించాల్సిన సబ్సిడీ విత్తనాలను ప్రైవేటు వ్యాపారులకు విక్రయించి లక్షలు ఆర్జించినట్లు మండలంలో ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

రైతులకు సబ్సిడీ ద్వారా అందించాల్సిన జీలుగలు, జనుములు ఇతరత్రా విత్తనాలను తన ఖాతాకు మల్లించుకుని.. వాటిని ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించి వచ్చిన డబ్బుతో ఆ గ్రామ సచివాలయ ఉద్యోగి ఒకరు బయటి రాష్ట్రాల్లో జల్సాలు చేస్తున్నాడు.

ఈ మేరకు అతను సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలపై పెడుతున్న ఫొటోలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. విత్తన విక్రయాల ద్వారా వచ్చిన సొమ్ముతో ఉత్తరాధి రాష్ట్రాల్లోని హరిద్వార్, వారణాసి, ఆగ్రా వంటి ప్రాంతాల్లో ఎంజాయ్ చేస్తున్నట్లు సమాచారం.

సబ్సిడీ విత్తనాల సొమ్ముతో ఉత్తర భారతంలో ఎంజాయ్ చేస్తున్న ఆ గ్రామ సచివాలయ ఉద్యోగి వారానికి పైగా అందుబాటులో లేకపోయినా.. అతను స్థానికంగా విధులకు హాజరవుతున్నట్లు ఆర్బీకే డ్యాష్ బోర్డులో చూపుతోంది. అదెలా సాధ్యమని కొందరు సచివాలయాల సిబ్బందిని ప్రశ్నిస్తే.. తమకు ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ ఉందని.. మొబైల్ ద్వారా ఎక్కడి నుంచైనా ఫేస్ రికార్డు చేసి దానిని స్థానికంగా ఉన్న వారి మొబైల్ కు పంపి అటెండెన్స్ వేసుకోవచ్చని చెబుతున్నారు. ఈ విధంగా సదరు ఉద్యోగి స్థానికంగా లేకపోయినా.. టెక్నికల్ ఎర్రర్ ను తనకు అనుకూలంగా మలుచుకుని అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు.

ఒక సచివాలయ ఉద్యోగికి, మండల వ్యవసాయాధికారి లాగిన్ వివరాలు ఇవ్వడం.. దొంగ చేతికి తాళాలిచ్చినట్లేనని మండలంలో చర్చ సాగుతోంది. గతంలో ఇదే సచివాలయ ఉద్యోగి ఆన్ లైన్ ద్వారా ఈఎంఐల పద్దతిలో ఒక మొబైల్ ఫోన్ కొని, కొద్దిరోజులకు దానిని ఏఓకు కట్టబెట్టి డబ్బు తీసుకున్నాడు. తర్వాత ఈఎంఐలు ఎగరగొట్టడంతో ఆ మొబైల్ ఫోన్ బ్లాక్ అయ్యింది.

తర్వాత కొత్త ఫోన్ కొనివ్వడంలాంటివన్నీ అలా జరిగిపోయాయి. ఫోన్ విషయంలోనే అతని దొంగబుద్దిని పసిగట్టిన ఏఓ.. ఏకంగా తన లాగిన్ ను అతడికి ఎందుకు ఇచ్చిందనేది ఇప్పుడు 17 సచివాలయాల పరిధిలో జరుగుతున్న చర్చ. ఇద్దరూ కలిసి సబ్సిడీ విత్తనాల వ్యవహారంలో ఏమైనా కుమ్మక్కయ్యారా..? లేకపోతే ఇండెంట్ మొత్తం ఆ ఒక్క సచివాలయానికే ఎందుకు వెళుతుందనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.

జిల్లా వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాలపై అధికారుల నిఘా కొరవడటంతో సిబ్బంది విచ్చలవిడితనానికి పాల్పడుతున్నారు అనడానికి ఆ గ్రామ సచివాలయ ఉద్యోగి వ్యవహారాన్నే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. గ్రామ సచివాలయాల్లోనే ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతుంటే మండల స్థాయి అధికారులు ఏం చేస్తున్నారనే దానిపై సర్వత్రా సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.
మండల వ్యవసాయ అధికారి కిందిస్థాయి సిబ్బందితో కుమ్మక్కయ్యారని.. అందువల్లే అతనికి రెండు వారాల అనధికారిక సెలవిచ్చిందని సచివాలయాల్లో సిబ్బంది గుసగుస లాడుకుంటున్నారు.

మండల స్థాయి అధికారుల పై జిల్లా స్థాయి అధికారుల ప్రభావం అంతగా చూపడం లేదనటానికి ఇలాంటి అనేక సంఘటనలు ఉదాహరణలుగా నిలుస్తాయని చెప్పొచ్చు. ప్రభుత్వం ప్రజల కోసం ప్రవేశపెట్టిన పథకాలను కిందిస్థాయి సిబ్బంది ఇలా లెక్కకు మిక్కిలిగా మెక్కుతూ పోతుంటే.. వారికి న్యాయం జరిగేది ఎప్పుడు?

సబ్సిడీ విత్తనాల పంపిణీలోనే ఇంత పెద్ద ఎత్తున ఒక మండల కేంద్రం పరిధిగా యవ్వారం నడుస్తోందంటే.. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఏం చేస్తున్నట్లు..? జిల్లా వ్యాప్తంగా ఇంకెన్ని పథకాల్లో ఎన్నెన్ని అక్రమాలు జరుగుతున్నాయో ఉన్నతాధికారులు గ్రహించాలి. ఆకస్మిక తనిఖీలు చేపట్టి అక్రమార్కుల తాట తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

LEAVE A RESPONSE