– రాష్ట్రస్థాయి విజేతగా ఐఐపీఈ-విశాఖపట్నం బృందం
– విజేతలకు బహుమతులు పంపిణీ
– ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ బషీర్ వెల్లడి
విజయవాడ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) స్థాపించి 90 ఏళ్లు అయిన సందర్భంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ‘ఆర్బీఐ 90 జాతీయస్థాయి క్విజ్ పోటీలు’ నిర్వహించినట్టు ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ బషీర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఇందులో భాగంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలు విజయవంతంగా ముగిసినట్టు పేర్కొన్నారు. గత సెప్టెంబర్ 19-21 వరకు ఆన్లైన్ ఆధారంగా ప్రాథమిక క్విజ్పోటీలు జరిగాయన్నారు. ఇందులో ఉత్తమ ప్రతిభకనబరిచిన అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల బృందాలకు సోమవారం విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించినట్టు తెలిపారు. ఈ పోటీల్లో 83 బృందాలకు చెందిన 166 మంది విద్యార్థులు పాల్గొన్నట్టు వివరించారు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ-విశాఖపట్నం)కి చెందిన కృతజ్ఞ శర్మ, ఉజ్వల్ నారాయణ్ బృందం విజేతగా నిలిచిందని.. అదే విధంగా స్పేసెస్ డిగ్రీ కళాశాల ద్వితీయ స్థానంలో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ (కర్నూలు) తృతీయ స్థానంలో నిలిచినట్టు ఆయన వెల్లడించారు. మొదటిస్థానంలో నిలిచిన బృందానికి రూ. 2 లక్షలు, ద్వితీయ స్థానంలో నిలిచిన బృందానికి రూ. 1.5 లక్షలు, తృతీయ స్థానంలో నిలిచిన వారు రూ. లక్ష గెలుపొందగా వారికి మెగా చెక్లు అందజేసినట్టు తెలిపారు.
విజేతగా నిలిచిన బృందం జోనల్ రౌండ్లో పోటీపడుతుందని.. జోనల్ రౌండ్ పోటీలు ఈ ఏడాది నవంబర్ 21-డిసెంబర్ 4 మధ్య జరుగుతాయని, అదే విధంగా జాతీయస్థాయిలో ఫైనల్ పోటీలు డిసెంబర్లో ముంబయిలో జరగనున్నట్టు వివరించారు. కార్యక్రమంలో ఆర్బీఐ ఎఫ్ఐడీడీ జీఎం మహాన, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, అన్ని జిల్లాల ఎల్డీఎంలు తదితరులు పాల్గొన్నారు.