రాజ్యసభలో ప్రభుత్వానికి విజయసాయి రెడ్డి విజ్ఞప్తి
న్యూఢిల్లీ, డిసెంబర్ 8: వ్యవసాయ రంగం మాదిరిగానే ఆక్వా ఉత్పాదనలకు కనీస మద్ధతు ధర, ఇన్‌పుట్ సబ్సిడీ కల్పించి ఆక్వా రైతులను ఆదుకోవాలని వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆక్వా ఉత్పాదన నిల్వలు వృధా కాకుండా స్టోరేజి సౌకర్యాలను మరింతగా మెరుగపరచేందుకు చర్యలు తీసుకోవాలని రాజ్యసభలో గురువారం ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా దేశంలో ఆక్వా రైతాంగం ఎదుర్కొంటున్న సంక్షుభిత పరిస్థితులను ఆయన వివరించారు.
ప్రపంచ ఆక్వా కల్చర్ రంగంలో ఏటా 7 బిలియన్ డాలర్ల ఎగుమతులతో భారత్ రెండో స్థానంలో ఉంది. దేశంలో దాదాపు మూడు కోట్ల మంది పేదలకు జీవనాధారం కల్పిస్తున్న రంగంగా ఆక్వా కల్చర్ పరిశ్రమ ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే దురృష్టవశాత్తు ఈ రంగం ఇటీవల కాలంలో తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకుంది. విపరీతంగా పెరిగిన ఇన్‌పుట్ సరుకుల ధరలు, ఎగుమతుల్లో భారీగా క్షీణించిన ధరలు, ఆక్వా ఉత్పాదనలను పెద్దఎత్తున దిగుమతి చేసుకునే యూరప్, అమెరికాలో దిగుమతి సుంకాల పెంపు, ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా అస్తవ్యస్తంగా మారిన సరఫరా వ్యవస్థ వంటి కారణాలతో భారత ఆక్వా రంగం దాదాపు 25 వేల కోట్ల రూపాయల నష్టాలలో కూరుకుపోయిందని విజయసాయి రెడ్డి తెలిపారు.
ఈ నేపథ్యంలో అమ్ముడుపోకుండా మిగిలిన ఆక్వా ఉత్పాదనల నిల్వలు గణనీయంగా పెరిగిపోయాయి. నిల్వ చేసేందుకు తగినన్ని కోల్డ్ స్టోరేజి సౌకర్యాలు లేవు. దీంతో చేతికొచ్చిన ఆక్వా పంట స్టోరేజి సౌకర్యం లేక కుళ్ళిపోయి రైతులకు భారీ నష్టాలను కలిగించింది. దురదృష్టవశాత్తు దేశ ఆక్వా రంగంలో అత్యధిక ఉత్పాదన, ఎగుమతులతో అగ్రగామి అయిన ఆంధ్రప్రదేశ్‌పై దీని ప్రభావం తీవ్రంగా ఉందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
ఆక్వాకల్చర్ రంగం ఇలాంటి సంక్షోభాల బారిన పడకుండా పటిష్టం చేయడంపైనే భారత నీలి విప్లవం భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఎగుమతుల ద్వారా బిలియన్ల డాలర్ల విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జిస్తూ లక్షలాది కుటుంబాలకు జీవనోపాధిని కల్పిస్తున్న ఆక్వా రంగం భవిష్యత్తు ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఈ విపత్కర పరిస్థితులలో ప్రభుత్వం తక్షణమే ఆక్వా రైతాంగాన్నిఆదుకుని వారికి ఊరట కల్పించే చర్యలు చేపట్టాలి. అలాగే ఆక్వా ఉత్పాదనలను అధికంగా దిగుమతి చేసుకునే దేశాలతో సంప్రదింపులు జరిపి దిగుమతి సుంకాలను తగ్గించేలా, ఆక్వా దిగుమతులపై ఆంక్షలను సరళతరం చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.