Suryaa.co.in

Devotional

కాశీలో సూర్యభగవానుడు

ఈ పవిత్ర భారతదేశంలో సూర్య భగవానుడు పరమశివుని పూజించిన స్ధలాలు అనేకం వున్నవి. వాటిలో ప్రముఖమైనదిగా పురాణ ప్రసిధ్ధి పొందిన కాశీ క్షేత్రాన్ని చెప్తారు. ఇక్కడ 12 పేర్లతో 12 స్ధలాలలో సూర్యభగవానుడు దర్శనమిస్తున్నాడు. ఈ ఆలయాల ప్రశస్తిని కాశీ ఖండ కావ్యము ఎంతగానో వివరించింది.
ఇప్పుడు ఆ ద్వాదశ సూర్యాలయాల గురించిన సంక్షిప్త వివరణ :

లోలార్కర్….
ఈ ఆలయం కాశీలో ప్రసిద్ధి చెందిన లోలార్క గుండం
సమీపమున వున్నది.
ఇక్కడి పుష్కరిణిలో స్నానం చేసి
లోలార్కర్ ని పూజించిన చిత్త చాంచల్య వ్యాధులు నయమవుతాయి.

ఉత్తరార్కర్….
కాశీకి ఉత్తర దిశలో
‘ అలేమ్ పురా’ అనే స్ధలంలో వున్న
సూర్య తీర్ధం ఉత్తర అర్క గుండం.
ఇక్కడ సూర్య భగవానుడు అనుగ్రహిస్తున్నాడు. ఒక మేక ఇక్కడ భక్తితో శివుని పూజించి
ముక్తి చెందినందున దీనిని బక్రియా
గుండం అని కూడా అంటారు.

సాంబాదత్యన్….
శ్రీకృష్ణుని పుత్రుడైన సాంబుడు
పూజించిన సూర్యభగవానుడు. ఈ ఆలయం
విశ్వనాధుని ఆలయానికి పశ్చిమ దిశలో వున్నది.

ద్రౌపది ఆదిత్యుడు….
ఈ ఆలయం విశ్వనాధుని ఆలయానికి సమీపమున అక్షయ పీఠానికి క్రింద వున్నది. సూర్యభగవానుడు ఈ స్థలంలోనే ద్రౌపది కి అక్షయపాత్రను అనుగ్రహించాడని ప్రతీతి.

మయూహాదిత్యుడు… ఇక్కడ సూర్యభగవానుడు పంచగంగా ఘాట్ సమీపమున వున్న మంగళగౌరి ఆలయంలో
దర్శనమిస్తున్నాడు. సూర్యుని తపస్సుకు
మెచ్చిన పరమేశ్వరుడు. ” మయూహర్” అనే
బిరుదును సూర్యునికి అనుగ్రహించాడు.

గషోల్కా ఆదిత్యుడు….
గరుత్మంతుడు , ఆతని తల్లి వినతాదేవి పూజించిన సూర్య భగవానుని ఆలయంలో
త్రిలోచనుడు, కామేశ్వరుడు
ఆలయప్రాంగణంలో దర్శనమిస్తారు.

అరుణాదిత్యుడు…
ఈ సూర్యభగవానుడు
త్రిలోచనుని ఆలయంలో అనుగ్రహిస్తున్నాడు.
గరుత్మంతుని సోదరుడు అరుణుని అనుగ్రహించి అరుణుడిని తన సారధిగా
చేసుకున్నాడు.
అరుణోదయ సమయంలో యీ భగవానుని ధ్యానించడం ఎంతో ఉత్కృష్టమైనది

వృధ్ధాదిత్యుడు…
మీర్ ఘాట్ అనే చోట
దర్శనమిస్తున్నాడు. వేదాలలో, సకల శాస్త్రాలలో పాండిత్యం గల ఒక వృధ్ధుడు భక్తితో ఇక్కడి సూర్యదేవుని
ఆరాధించి తిరిగి పరిపూర్ణ యవ్వనాన్ని పొందాడు.

కేశవాదిత్యుడు….
ఈ సూర్యుడు వరుణ సంగమంలో వున్న కేశవుని ఆలయంలో ప్రతిష్టించబడియున్నాడు. కేశవుడైన మహావిష్ణువు అనుగ్రహంతో ఇక్కడి
లింగాన్ని ప్రతిష్టించి పూజించినందున
యీ పేరు కలిగింది.

విమలాదిత్యుడు…. గదోలియా కి సమీపమున వున్న జంగంబడిలో యీ సూర్యుని దర్శిస్తాము . విమలుడనే
భక్తునికి సోకిన కుష్టు వ్యాధినుండి విముక్తిని
కలిగించి ఆరోగ్యం ప్రసాదించాడు.
ఈ సూర్య దర్శనం వలన సకల పీడలు తొలగిపోతాయని అంటారు.

గంగాదిత్యుడు… భగీరధుడు ఆకాశగంగ ని భూమి మీదకి తీసుకుని వచ్చినప్పుడు
కాశీకి వచ్చి గంగా తీరాన నివసించిన
సూర్యభగవానుడు
‘ లలితా ఘాట్’ అనే
చోట దర్శనమిస్తున్నాడు.

యమాదిత్యుడు…. సూర్యదేవుని కుమారుడైన
యమధర్మరాజు కాశీలో తండ్రి అనుగ్రహం పొందిన స్ధలం సంగడా ఘాట్.
ఆయుర్దాయాన్ని వృధ్ధిచేసే ఆదిత్యుడు.

కాశీకి వెళ్ళిన భక్తులు ఆదివారమునాడు
యీ ద్వాదశ సూర్యులను దర్శించి పూజించడం అత్యంత శుభప్రదం.

LEAVE A RESPONSE