పల్నాడు, ప్రకాశం ఎస్పీలపై వేటు తప్పదా?

-ఆ ఎస్పీల వైఫల్యంపై ఈసీ సీరియస్?
-ప్రధాని సభ ఏర్పాట్లలో పోలీసుల వైఫల్యం
-రెండు జిల్లాల ఎస్పీలను పిలిపించిన ఈసీ మీనా
-వివరణ ఇవ్వాలని ఆదేశం
-వారి వివరణ బట్టి చర్యలు
(అన్వేష్)

అమరావతి: ప్రధాని మోదీ సభ ఏర్పాట్లకు సంబంధించి జనాలను నియంత్రించడంలో విఫలమైన పోలీసులపై ఎట్టకేలకూ సీఈసీ చర్యలకు ఉపక్రమించింది. ప్రధాని సభకు వచ్చిన వారిని నియంత్రించడం, ఎక్కువసేపు బారికేడ్లు ఉంచడం, పాసులున్నా ప్రధాని వద్దకు సకాలంలో పంపని వైనం, ట్రాఫిక్‌ను కంటల్ చేయకపోవడం, సరిగా మైకు పనిచేయని సమయంలో స్వయంగా ప్రధాని మోదీనే మైకందుకుని వారిని వెనక్కివెళ్లాలని సూచించిన వైనం మీడియాలో ప్రముఖంగా వచ్చింది.

అయితే గుంటూరు రేంజీ ఐజి, నర్సరావుపేట-ప్రకాశం-నెల్లూరు ఎస్పీలు కావాలనే జనాలను నియంత్రంచలేదని టీడీపీ-జనసేన-బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వీరంతా వైసీపీ నాయకత్వ ఆదేశాలతో, ప్రధాని సభను అప్రతిష్ఠపాలు చేసేందుకు కుట్ర పన్నారని, వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధాని సభను దగ్గరుండి సమీక్షించాల్సిన డీజీపీ రాజేంద్రనాధ్‌రెడ్డి కూడా నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు.

అయితే ఎన్టీఏ నేతలు ఫిర్యాదు చేసి ఇన్నిరోజులయినా, సీఈసీ ఇప్పటిదాకా చర్యలు తీసుకోని వైనం విమర్శలకు దారితీసింది. ఈసీ చర్యలకు వెనుకంజ వేస్తున్నారన్న చర్చకు అది దారి తీసింది. దానితో హటాత్తుగా సీఈసీ స్పందించి.. పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డి, ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డిని పిలిపించింది. దానితో వారు క మిషనర్ ఎదుట హాజరయ్యారు. ఆ సందర్భంగా ప్రధాని సభ రోజు ఏర్పాట్లలో ఎందుకు విఫలమయ్యారని ముఖేష్‌కుమార్ మీనా ప్రశ్నించారు. దానికి సంబంధించి వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

అటు ఆళ్లగడ్డ, గిద్దలూరులో రెండు హత్యలు జరిగాయి. మాచర్లలో ఒక పార్టీకి చెందిన నేత కారును తలబెట్టడం ఉద్రిక్తతకు దారితీసింది. దానికి స్పందించిన ఈసీ, నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డిని కూడా పిలిపించి వివరణ అడిగింది. హింసను ఎందుకు ఆపలేక పోయారని ప్రశ్నించింది. దీనితో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఈసీ, తీవ్ర చర్యలకు ఉపక్రమిచేందుకు సిద్ధమవుతోందని స్పష్టమవుతోంది. ముగ్గురు ఎస్పీల నుంచి సంతృప్తికర వివరణ రాకపోతే ముగ్గురిపైనా వేటు తప్పదని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Leave a Reply