సంగారెడ్డి అర్బన్: సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ మాధురి వద్ద సీసీ (క్యాంప్ క్లర్క్)గా పనిచేస్తున్న గడిల విష్ణువర్ధన్ (44) అనుమానాస్పద రీతిలో మృతిచెందారు.ఆదివారం ఉదయం కొండాపూర్ మండలం తెలంగాణ టౌన్‌షిప్ వద్ద పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
శనివారం మధ్యాహ్నం నుంచి విష్ణువర్ధన్ ఇంటికి వెళ్లలేదు. ఆయనకు భార్య శివ కృష్ణ కుమారి, కుమార్తె వైష్ణవి (18), కుమారుడు హర్షవర్ధన్ (16) ఉన్నారు. రాత్రి భార్య ఫోన్ చేస్తే విష్ణు మాట్లాడినట్లు సమాచారం. అనారోగ్య కారణాలతో గత నెలరోజులుగా ఆయన సెలవుపై ఉన్నట్లు కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి.
విష్ణువర్ధన్‌ది హత్యా? ఆత్మహత్యా? అనేకోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా? దాని కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డారా? అనే కోణంలో విచారణ చేపట్టారు..