అవినాష్ రెడ్డిని తాడేపల్లి ప్యాలెస్ కాపాడుతోంది

– హత్యకేసులో నైతిక బాధ్యత వహిస్తూ సీఎం జగన్ రెడ్డి రాజీనామా చేయాలి
– మాజీ మంత్రి కేఎస్ జవహర్

వైఎస్ వివేకా హత్యకేసులో నైతిక బాధ్యత వహిస్తూ సీఎం జగన్ రెడ్డి రాజీనామా చేయాలి. కేసు విచారణను పక్క రాష్ట్రానికి మార్చాలని సుప్రీంకోర్టు నిర్ణయించడం జగన్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు. కేసు విచారణ ఏపీలో జరిగితే కొలిక్కరాదన్న అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యలపై జగన్ రెడ్డికి సిగ్గుగా అనిపించడం లేదా? వైఎస్ వివేకా కుమార్తె, జగన్ రెడ్డి సోదరి వైఎస్ సునీత తన తండ్రి హత్య కేసును ఇతర రాష్ట్రానికి బదలాయించమని కోరడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు.

వివేకా హత్యకేసును ఛేదించలేకపోయిన డీజీపీ కూడా తన పదవికి రాజీనామా చేయాలి. వివేకా కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి ముమ్మాటికి నేరస్థుడు. నేరస్థుడిని కాపాడేందుకు జగన్ రెడ్డి పడుతున్న తాపత్రయాన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. వైఎస్ సునీతారెడ్డికి ఏపీ పోలీసులపై నమ్మకం లేదు. అందుకే తన తండ్రి హత్య కేసును పక్క రాష్ట్రాలకు బదలాయించమని కోరుతున్నారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తన బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు.

సొంత బాబాయి కేసునే పక్కదారి పట్టిస్తున్న జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకి ఏం మేలు చేయగలడు? కేసులో ముద్దాయిగా ఉన్న అవినాష్ రెడ్డిని జగన్ కాపాడటం దేనికి సంకేతం? తన అన్న ముఖ్యమంత్రి అయిఉండీ న్యాయం జరక్క సునీతరెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించాల్సి రావడం బాధాకరం. ప్రజలకు వైసీపీ ప్రభుత్వంపై నమ్మకం పోయింది. నేరాలను ప్రోత్సహిస్తూ నేరస్థులకు అండగా నిలుస్తున్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు. కేసు విచారణలో సీబీఐకి జగన్ రెడ్డి సహకరించడంలేదు. నేరస్థులను జగన్ రెడ్డి ఏ విధంగా కాపాడతారు?

తన అధికార దాహం కోసం జగన్మోహన్ రెడ్డి బంధుత్వాలను సైతం లెక్కచేయడంలేదు. వైఎస్ వివేకా హత్య సహా అరాచక పాలనా విధానాలపై రాష్ట్రం మొత్తం జగన్ రెడ్డివైపు వేలెత్త చూపుతోంది. నేరస్థులను ప్రోత్సహించడం కూడా నేరం చేయడం కిందకే వస్తుంది. అప్రూవర్ గా మారిన వైఎస్ వివేకా కార్ డ్రైవర్ దస్తగిరి తనకు రక్షణ లేదని, అర్ధరాత్రి బెదిరింపులు వస్తున్నాయని, రక్షణ కల్పించాలని కోరుతున్నాడు. అవినాష్ రెడ్డిని తాడేపల్లి ప్యాలెస్ కాపాడుతోంది. ఇప్పటికైనా జగన్ రెడ్డి తన బాబాయ్ హత్య కేసును ఛేదించేందుకు సహకరించాలి.

Leave a Reply