Suryaa.co.in

Andhra Pradesh

గుడివాడ నియోజకవర్గంలో 10 వేల ఇళ్ళ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాం

– మరో 8 వేల 912 టిడ్కో గృహాలను నిర్మిస్తున్నాం
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
గుడివాడ, సెప్టెంబర్ 18: గుడివాడ నియోజకవర్గంలో 10 వేల ఇళ్ళ నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. శనివారం కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలో లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఇళ్ళపట్టాలు, ఇళ్ళ నిర్మాణం తదితరాలపై మంత్రి కొడాలి నాని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ గుడివాడ నియోజకవర్గ పరిధిలోని గుడివాడ పట్టణంలోని 5 వేల 280 మందికి, గుడివాడ రూరల్ మండలంలో 1,121 మందికి, నందివాడ మండలంలో 1,461 మందికి, గుడ్లవల్లేరు మండలంలో 703 మందికి ఇళ్ళపట్టాలను పంపిణీ చేశామన్నారు. పట్టాలు ఇచ్చిన స్థలాల్లో ఇళ్ళ నిర్మాణ పనులను చేపడతామన్నారు. దీంతో పాటు నియోజకవర్గంలో మరో 958 మందికి సొంత స్థలాల్లో ఇళ్ళను నిర్మించుకునేందుకు అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. మొత్తం 9 వేల 808 ఇళ్ళ నిర్మాణం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు గుడివాడ పట్టణంలో 45, రూరల్ మండలంలో 56, నందివాడ మండలంలో 167, గుడ్లవల్లేరు మండలంలో 66 ఇళ్ళ గ్రౌండింగ్ పనులు పూర్తయ్యాయన్నారు. ఇళ్ళ నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి అవసరమయ్యే 23 రకాల సామాగ్రి అవసరమని ప్రభుత్వం గుర్తించిందన్నారు.
రాష్ట్ర, జిల్లాస్థాయిల్లో టెండర్లను నిర్వహించి, కనిష్ఠ ధరను ప్రాతిపదికగా తీసుకుని సామాగ్రి ధరలను ప్రభుత్వం ఖరారు చేసిందన్నారు. ఒక ఇంటి నిర్మాణానికి 90 బస్తాల సిమెంట్, 480 కిలోల ఇనుము ఇస్తారన్నారు. గృహ నిర్మాణ సంస్థ ద్వారా అందించే సామాగ్రి, వాటి ధరలను లబ్ధిదారులకు తెలియజేసేందుకు వీలుగా ప్రత్యేకంగా మొబైల్ యాప్ను కూడా ప్రభుత్వం రూపొందించిందన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే స్థానికంగానే తక్కువ ధరకు సామాగ్రి అందుబాటులో ఉంటే లబ్ధిదారులు వాటినే కొనుగోలు చేసుకోవచ్చన్నారు. గృహ నిర్మాణ సంస్థ నుండి తీసుకున్న సామాగ్రికి నిర్దేశిత ధరను రాయితీ నుండి మినహాయిస్తారని చెప్పారు. లేఅవుట్ లో నిర్మాణాలు చేపట్టే వారితో పాటు వ్యక్తిగత స్థలాల్లో గృహాలను నిర్మించుకునే వారికి కూడా ప్రభుత్వం సామాగ్రిని అందిస్తుందన్నారు. భారీగా నిర్మాణాలను చేపడుతున్న నేపథ్యంలో డిమాండ్ పెరిగి కంకర ధర ఎక్కువ కాకుండా నియంత్రించేందుకు గనుల శాఖ అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారన్నారు. డిమాండక్కు తగ్గట్టుగా సిమెంట్, ఇటుకలు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. జగనన్న కాలనీల్లో లబ్ధిదారులకు అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించనుందని తెలిపారు. ఇళ్ళపట్టాల కోసం కొత్తగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హత ఉన్నవారికి పట్టాలు ఇవ్వాలని సీఎం జగన్మోహనరెడ్డి ఆదేశించారని చెప్పారు. అలాగే టిడ్కో ఇళ్ళ నిర్మాణంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. గుడివాడ రూరల్ మండలం మల్లాయిపాలెం పరిధిలో 77 ఎకరాల్లో 8 వేల 912 టిడ్కో గృహాలను నిర్మిస్తున్నామని చెప్పారు. వచ్చే డిసెంబర్ నాటికి 3 వేలకు పైగా టిడ్కో గృహాల నిర్మాణం పూర్తవుతుందని, వీటిని లబ్ధిదారులకు కేటాయిస్తామని మంత్రి కొడాలి నాని తెలిపారు.

LEAVE A RESPONSE