– టీడీపీ నుంచి నలుగురు
– వైపీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
– సంచలన నిర్ణయం తీసుకున్న స్పీకర్ తమ్మినేని
– అందరికీ సమన్యాయం
– జగన్ సూచన మేరకే ఆ నలుగురిపై వేటు?
అమరావతి: అనుకున్నదే అయింది. పార్టీలు ఫిరాయించిన వైసీపీ-టీడీపీ ఎమ్మెల్యేలపై ఎట్టకేలకూ అనర్హత వేటు పడింది. ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఎమ్మెల్యేలతోపాటు, వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేస్తూ సంచలన నిర్ణయం ప్రకటించారు. దీనితో అందరికీ సమన్యాయం చేసినట్టయింది. నిజానికి చీఫ్ విప్ ప్రసాదరాజు చేసిన ఫిర్యాదుపై, చాలాకాలం నుంచి స్పీకర్ వద్ద అనర్హత కేసు నడుస్తోంది.
ఒకసారి విచారణకు హాజరైన టీడీపీ ఎమ్మెల్యేలు తర్వాత, సాంకేతిక కారణాలు చూపిస్తూ లేఖలు రాశారు. స్పీకర్ కార్యాలయం నుంచి తమ ప్రశ్నలకు సమాధానం రాలేదని టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలు చెప్పారు. దానితో స్పీకర్ వారికి మళ్లీ లేఖలు రాశారు. అయితే తగిన స్పందన లేకపోవడంతో, పార్టీ ఫిరాయించిన వైసీపీ-టీడీపీ ఎమ్మెల్యేలపై మూకుమ్మడిగా అనర్హత వేటు వేశారు.
అయితే టీడీపీ నుంచి తన పార్టీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలపైనా అనర్హత వేటు వేయాలని సీఎం-వైసీపీ అధినేత జగన్ స్పీకర్‌కు సూచించారన్న ప్రచారం, గత రెండువారాల నుంచే శాసనసభ వర్గాల్లో జరుగుతోంది. దీనిపై అనవసర వివాదం తలెత్తకూడదన్న ముందుజాగ్రత్తతోనే, జగన్ ఈ నిర్ణయం తీసుకునట్లు కనిపిస్తోంది.
కాగా.. తాజాగా స్పీకర్ నిర్ణయంపై టీడీపీ నుంచి వైసీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలు, తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఎలాగూ నోటిపికేషన్ వస్తున్నందున ఈ నిర్ణయం వల్ల తమకు వచ్ని నష్టమేమీ లేదంటున్నారు. అయితే జగన్‌ను నమ్ముకుని పార్టీలో చేరిన తమపై, అనర్హత వేటు వేయడమే అవమానంగా ఉందని రగిలిపోతున్నారట.
ప్రధానంగా సుదీర్ఘకాలం నుంచి చట్టసభల్లో ఉన్న ఓ సీనియర్ ఎమ్మెల్యే.. ‘పోతే పోయింది. ఇప్పుడు ఉండి మేమేం చేస్తున్నాం? ఆయనను నమ్మి పార్టీలో చేరాం. మమ్మల్ని కాపాడుకోవడం నాయకుడిగా ఆయన బాధ్యత. ఎన్నికల ముందు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పెద్దగా నష్టమేమీ లేదు. అయితే ఇలా అనర్హత వేటు వేయడమే అవమానంగా ఉంద’ని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.