జగన్ రెడ్డిని ఓడించడానికి ప్రజలు సిద్ధం

-ఓడిపోవడానికి జగన్ మోహన్ రెడ్డి సిద్ధమైతే… ఓడించడానికి ప్రజలు కూడా సిద్ధమే…
-సాక్షి దినపత్రికలో మళ్లీ అదే గోల…
-కలయిక అవసరం… నెగ్గడం చారిత్రాత్మక అవసరం…
-ప్రజాస్వామ్య వాదులంతా ప్రతిపక్షాల సభను సక్సెస్ చేయాలి…
-మనుషుల జీవితాలతో ఆడుకుంటున్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎలా మన్నించగలం?
-ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోన్న జగన్ మోహన్ రెడ్డి సర్కార్…
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు

ఓడిపోవడానికి వైకాపా అధ్యక్షులు, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సిద్ధమైతే, ఓడించడానికి ప్రజలు కూడా సిద్ధంగానే ఉన్నారని జ్ఞానోదయమైన ప్రజల తరఫున తెలియజేస్తున్నానని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు అన్నారు. కులం, మతం, ఇతరత్రా ప్రలోభాల కారణంగా ఇంకా జ్ఞానోదయం కాని వారు ఉంటే వారందరికీ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను తెలుసుకుంటే జ్ఞానోదయం అవుతుందని తెలిపారు.

సోమవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణ రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… నాసి రకమైన మద్యం సేవించి రాష్ట్రంలో ఇప్పటికే ఎంతో మంది చనిపోయారని, ప్రతి కుటుంబాన్ని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆర్థికంగా దోచుకుందని, ఉద్యోగులకు 21 వేల కోట్ల రూపాయల బకాయిలను చెల్లించాల్సి ఉందని, విశ్రాంత ఉద్యోగులకు గత ప్రభుత్వ హయాంలో ఒకటవ తేదీన పెన్షన్లు అందజేసేవారని, కానీ ఇప్పుడు 15వ తేదీ నుంచి 20వ తేదీ వస్తే కానీ పెన్షన్లను చెల్లించని దుస్థితి నెలకొందని తెలిపారు. విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లను చెల్లించడం అన్నది ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని, కానీ ఈ ప్రభుత్వం అటువంటి ప్రాధాన్యతలను పెద్దగా పట్టించుకోవడం లేదని అన్నారు. అన్ని వర్గాల వారిని ధనిక, పేద అన్న తేడా లేకుండా అతి దారుణంగా మోసగించి ఇప్పుడు సిద్ధం… సిద్ధం అంటూ ఎన్నికలకు జగన్ మోహన్ రెడ్డి సిద్ధమయ్యారని, ఇటువంటి అబద్ధాల సిద్ధహస్తున్ని ఎన్నికల బరిలో లేకుండా, ఓటు అనే ఆయుధం ద్వారా చాచి లెంప కాయ కొట్టి ఇంటికి పంపిద్దాం అన్నారు.

సాక్షి దినపత్రికలో మళ్లీ అదే గోల…
జనసేనకు అతి తక్కువగా 24 స్థానాలు మాత్రమే కేటాయిస్తారా? అని సాక్షి దినపత్రిక మళ్లీ గోల చేయడం ప్రారంభించిందని రఘురామకృష్ణ రాజు అన్నారు. ఒక స్థానంలో జనసేన అభ్యర్థికి గత ఎన్నికల్లో 30 వేల ఓట్లు వచ్చినప్పటికీ, ఆ స్థానాన్ని జనసేనకు కేటాయించరా? అని సాక్షి దినపత్రిక ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని, అదే స్థానంలో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వ్యక్తికి 60 వేల ఓట్లు వచ్చాయని, ఈ విషయాన్ని మాత్రం సాక్షి దినపత్రిక తన కథనంలో ఎక్కడా ప్రస్తావించలేదని అన్నారు. సాక్షి దినపత్రిక ఇటువంటి ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించకుండా, రెండు పార్టీల క్యాడర్ మధ్య గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నాన్ని చేస్తోందని పేర్కొన్నారు. అన్ని గొడవలు సద్దుమణిగి చక్కటి అవగాహనతో ఉన్న టీడీపీ, జనసేన నాయకుల మధ్య చిచ్చుపెట్టాలన్నదే సాక్షి దినపత్రిక లక్ష్యం అన్న ఆయన, ఇప్పటికీ సాక్షి దినపత్రిక తన ఆఖరి ప్రయత్నాలను చేస్తోందని అన్నారు.

జనసేన పార్టీ నాయకత్వం అత్యద్భుతంగా సీట్లను ఎంపిక చేసుకుందని, గతంలో ప్రజారాజ్యం పార్టీ నెగ్గిన స్థానాలను, వారికి పట్టున్న జిల్లాలలోని స్థానాలనే పొత్తులో భాగంగా ఎంపిక చేసుకున్నారని, సీట్ల సర్దుబాటు చక్కగా జరిగిన తరుణంలో, ఏదో ఒక ఊరు పేరు రాసి, ఆ స్థానాన్ని పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించరా? అని ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. దుర్గేష్ కి ప్రత్యామ్నాయన్ని చూపెట్టారన్న రఘురామకృష్ణ రాజు , గత ఎన్నికల్లో టీడీపీకి 23 స్థానాలు వచ్చినప్పుడు, బుచ్చయ్య చౌదరి 12 వేల మెజార్టీతో విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారన్నారు.

పాత తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు అయిన దుర్గేష్ కి పక్కనే ఉన్న స్థానాన్ని కేటాయించారని తెలిపారు. అయినా దుర్గేష్ కి అన్యాయం జరిగిందని సాక్షి దినపత్రిక పేర్కొనడం పరిశీలిస్తే, ఇతర పార్టీల వ్యవహారాలు నీకెందుకు రా సాక్షి… అక్కు పక్షి అని అనాలనిపిస్తోందని అన్నారు. వైకాపా 60 మంది అభ్యర్థులను మార్చితే సాక్షి దినపత్రికలో రాయవు.. నేను వైకాపాకు రాజీనామా చేస్తే, రాజీనామా చేశానని రాయవంటూ మండిపడ్డారు. నరసాపురం, భీమవరం అసెంబ్లీ స్థానాలలో గత ఎన్నికల్లో జనసేన రెండవ స్థానంలో ఉందని, అందుకే ఆ రెండు స్థానాలను జనసేన పార్టీకి కేటాయించారని తెలిపారు. సరైన ప్రాతిపదికనే సీట్ల పంపిణీ జరిగిందని, సీట్ల పంపిణీపై మాలో మేము సంతోషంగానే ఉంటే, ఎవరితో కలిసి ఎవరినో రెచ్చగొట్టాలని సాక్షి దినపత్రిక చెత్త రాతలను రాస్తొందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కలయిక అవసరం… నెగ్గడం చారిత్రాత్మక అవసరం…
ఎన్నికల్లో పొత్తుల కోసం టీడీపీ, జనసేన కలయిక అవసరమన్న రఘురామకృష్ణ రాజు ఈ రెండు పార్టీలు నెగ్గడం అనేది చారిత్రాత్మక అవసరమని పేర్కొన్నారు. లేకపోతే రాష్ట్ర ప్రజలు సర్వనాశనం అయిపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. కులం గురించి మాట్లాడకుండా, సమాజ శ్రేయస్సు గురించే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడారని గుర్తు చేశారు. జనసేన అన్నది ఒక కులానికి సంబంధించిన పార్టీ కాదని అది ప్రజల పార్టీ అని పేర్కొన్నారు. ఈ మూల సిద్ధాంతం తెలియని కొంత మంది సంకుచిత స్వభావంతో కుహనా నాయకులు తరచూ మాట్లాడే మాటలను జనసైనికులు పట్టించుకోవలసిన అవసరం లేదని, ప్రతి కులం, తమ కులానికి చెందిన నాయకుడికి మద్దతు ఇవ్వడం అనేది సర్వసాధారణం అని, అయినా ఒక్క కులం వారు మాత్రమే ఓట్లు వేస్తే ఎవరు ఎన్నికల్లో గెలవరని అన్నారు.

జగన్ మోహన్ రెడ్డి కి కేవలం రెడ్లు ఓట్లు వేస్తే మాత్రమే ఆయన గెలిచారా?, కమ్మవారు ఓట్లు వేసినంతమాత్రానే చంద్రబాబు నాయుడు  అన్ని సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారా? అంటూ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కేవలం ఒక కులానికి చెందిన నాయకుడు కాదని, పరిణితి చెందిన ప్రజా నాయకుడని పేర్కొన్నారు. ఆయన్ని ఒక కుల నాయకుడిగా మార్చవద్దని, ఒక గొప్ప నాయకుడిగా గౌరవించాలని కోరారు. పవన్ కళ్యాణ్ కూడా ఎన్నోసార్లు మాట్లాడుతూ ఇదే విషయాన్ని చెప్పారని గుర్తు చేశారు. కులం అవసరమే కానీ సంకుచిత స్వభావంతో మాట్లాడి పవన్ కళ్యాణ్ ని అభిమానించి, ప్రేమించి, దేవుడిగా గౌరవించే ఇతర కులాల వారి మనోభావాలను దెబ్బతీయవొద్దని రఘురామకృష్ణ రాజు కోరారు.

నేను కాపును కాను క్షత్రియుడిని… అయినా పవన్ కళ్యాణ్ అభిమానిని… నాలాగే 125 బిసి కులాలలో, 45 దళిత కులాలలో, ఏడు నుంచి 8 ఇతర కులాలకు చెందిన వారిలోనూ పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారన్నారు. పవన్ కళ్యాణ్ అందరివాడు… ఆయన్ని కొందరివాడిగా మార్చవద్దని కోరారు. అభిమానుల మనసు గాయపడే విధంగా కొంత మంది నాయకులు తింగరి స్టేట్మెంట్లను ఇస్తున్నారని, అటువంటి స్టేట్మెంట్లను ఇవ్వొద్దని అన్నారు. అటువంటి స్టేట్మెంట్ ల వల్ల పవన్ కళ్యాణ్ కి ఆయన అభిమానులు దూరం అవుతారనే ఉద్దేశంతోనే ఈ విధంగా మాట్లాడినట్లుగా పేర్కొన్న రఘురామకృష్ణ రాజు తన వ్యాఖ్యల వల్ల ఎవరికైనా మనసు నొచ్చుకుంటే క్షమించాలని కోరారు.

రాష్ట్రంలో ఒక్క శాతం జనాభా కలిగిన క్షత్రియ కులానికి చెందిన వ్యక్తిని తనని, తాను ఏ కులానికి వ్యతిరేకిని కానని, రాష్ట్రంలో ఇటువంటి చిన్న, చిన్న కులాలు ఎన్నో ఉన్నాయని, అవన్నీ కలిస్తేనే ఒక మహా సముద్రం అవుతుందని, అన్ని కులాలు ఒక్కటేనని భావించే వ్యక్తిని తాను అని, కులము లేని కుల రహిత సమాజం కోసం తాను కలలు కంటున్నానని, అది తాను బ్రతికి ఉండగా చూస్తానని భావించడం లేదని అన్నారు. కులం పేరు లేని జనన ధ్రువీకరణ పత్రం ఎప్పటికీ వస్తుందో చూడాలని ఉందని, ఆ రోజులు త్వరగా రావాలని కోరుకుంటున్నానని తెలిపారు. కులాల మధ్య తారతమ్యం ఉండకూడదని కోరుకుంటున్న తాను, ప్రస్తుతం ఉన్న కుల వ్యవస్థలో తన మాటలు సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్న ఏ కులం వారికైనా బాధ కలిగిస్తే, వారి హృదయాలను గాయపరిస్తే మన్నించాలని కోరారు. పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానంతోనే తాను ఈ మాటలు మాట్లాడవలసి వచ్చిందని వివరించారు.

ప్రజాస్వామ్య వాదులంతా ప్రతిపక్షాల సభను సక్సెస్ చేయాలి…
తాడేపల్లిగూడెం సమీపంలోని ప్రతిపాడులో ఈనెల 28వ తేదీన తెలుగుదేశం, జనసేన పార్టీలు నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభను టీడీపీ, జనసేన కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులతో పాటు ప్రజాస్వామ్యవాదులంతా సక్సెస్ చేయాలని రఘురామకృష్ణ రాజు కోరారు. టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ కూడా జతకట్టనుందనేది తన ఉద్దేశమని, ఈ సభకు ఉభయ గోదావరి జిల్లాల ప్రజలతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. టీడీపీ, జనసేన పార్టీలలో తాను ఏ పార్టీ సభ్యుడిని కాదని, ఈ అరాచక ప్రభుత్వాన్ని ఓడించడానికి కంకణం కట్టుకున్న ప్రజాస్వామ్యవాదినని, తనలాగే ఈ ప్రభుత్వాన్ని ఓడించాలని కంకణ బద్ధులైన ప్రజాస్వామ్యవాదులందరూ, కూటమికి సంపూర్ణ మద్దతునిచ్చి… ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకుందామని అన్నారు.

మనుషుల జీవితాలతో ఆడుకుంటున్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎలా మన్నించగలం?
మనుషుల జీవితాలతో ఆడుకుంటున్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎలా మన్నించగలమని రఘురామకృష్ణ రాజు ప్రశ్నించారు. ఒక కుటుంబానికి అమ్మ ఒడి పేరిట 13వేల రూపాయలు, ఆసరా పేరిట 15 వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఒక క్వార్టర్ మద్యం సీసా సేవించే అలవాటు ఉన్న ప్రతి కుటుంబం వద్ద నుంచి 60 వేల రూపాయలను లాగేస్తోందన్నారు. ప్రజలకు ఇచ్చేది 28 వేల రూపాయలైతే, వారి వద్ద నుంచి అదనంగా 32 వేల రూపాయలను ఈ ప్రభుత్వం దోచుకుంటుందన్నారు.

కేవలం మద్యం విభాగంలో మాత్రమే ఒక్కొక్క కుటుంబం నుంచి 60 వేల రూపాయలను దోచుకుంటున్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఇప్పటికే ఆరుసార్లు విద్యుత్ చార్జీలను పెంచారన్నారు. ఇదే కాకుండా రకరకాల పన్నులు వేసి ప్రజల నడ్డిని ఈ ప్రభుత్వం విరిచిందని, నాసిరకమైన మద్యం ద్వారా ఒళ్ళు, ఇల్లు గుల్ల చేస్తున్నారని రఘురామకృష్ణ రాజు మండిపడ్డారు. మద్యం ప్రియులకు దిక్కుమాలిన మద్యం ఇస్తున్నారని, ఎందుకు దిక్కుమాలిన మద్యం ఇస్తున్నారంటే, ఒక్క లీటర్ మద్యం శుద్ధి కోసం అదనంగా పది రూపాయలు ఖర్చు చేయడం ఇష్టం లేకనే ఇదంతా చేస్తున్నారని, ఒక్క బాటిల్ కు వచ్చేసరికి అర్ధ రూపాయి మాత్రమే అదనంగా భారం పడుతుందని, ఒక బాటిల్లో 40 శాతం ప్యూర్ ఆల్కహాల్ ఉంటే మిగిలినదంతా వాటరేనని అన్నారు. అయితే నాసిరకమైన మద్యాన్ని సమర్ధించుకోవడానికి ఈ ప్రభుత్వ పెద్దలు మంచి నీటిలో బ్యాక్టీరియా ఉంటుందని, బ్యాక్టీరియా ఉన్నదని తెలిసి మంచి నీటిని తాగడం మానేస్తామా అంటూ దరిద్రంగా తమని తాము సమర్ధించుకున్నారని అన్నారు.

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోన్న జగన్ మోహన్ రెడ్డి సర్కార్…
రాష్ట్రంలోని మద్యం దుకాణాల ద్వారా మద్యపాన ప్రియులకు విక్రయిస్తున్న నాసిరకమైన మద్యం ద్వారా ప్రజల ప్రాణాలతో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చెలగాటమాడుతోందని రఘురామకృష్ణ రాజు మండిపడ్డారు. గత రెండేళ్లుగా ఈ నాసిరకమైన మద్యంపై ఫిర్యాదులు చేస్తూనే ఉన్నామని చెప్పారు. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆసుపత్రులలో తిరిగి రోగుల వద్ద నుంచి వివరాలను సేకరించి కేంద్రానికి నివేదికను అందజేశారని, నాసిరకమైన మద్యం సేవించడం వల్లే తమ శరీరంలోని అవయవాలు దెబ్బతిన్నాయని రోగులు చెప్పినట్లుగా పురంధేశ్వరి తన నివేదికలో పేర్కొన్నారని తెలిపారు.

రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న నాసిరకం మద్యంపై ఈనాడు దినపత్రిక ప్రతినిధి బృందం సమగ్రంగా పరిశోధించి వార్తా కథనాన్ని ప్రచురించారని, సర్కారు వారి విషపు చుక్క శీర్షికతో ప్రచురించిన వార్తా కథనంలో గతంలో తాను ప్రధానమంత్రికి రాసిన లేఖ గురించి ప్రస్తావించడమే కాకుండా, ల్యాబ్ పరీక్షలను సైతం వెల్లడించానని అన్నారు. రెండేళ్ల క్రితం మద్యం నమూనాలను సేకరించి సీల్ వేసి ఎస్ జి ఎస్ ల్యాబ్ కు అందజేయడం జరిగిందని, ఎస్ జి ఎస్ ల్యాబ్ క్లియర్ గా రిపోర్టును ఇచ్చిందని, ఎస్ జి ఎస్ ల్యాబ్ యాజమాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం బెదిరించడం వల్ల మరొకసారి పరీక్షలు చేయడానికి వారు వెనుకంజ వేశారని తెలిపారు. తమకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ల్యాబ్ యాజమాన్యం స్వయంగా తనకు ఫోన్ చేసి చెప్పారని అన్నారు.

మద్యంలో హానికారక పదార్థాలు ఎక్కువగా ఉన్నాయని ఎస్ జి ఎస్ ల్యాబ్ తన నివేదికలో తేల్చిందని, మద్యాన్ని కనీసం రెండు సార్లు శుద్ధి చేయాలన్న ఆలోచన కూడా లేకపోవడం దారుణమని, అన్ని ప్రమాణాలను పాటిస్తే లీటర్ కు అదనంగా మూడు నుంచి నాలుగు రూపాయలు ఖర్చు అవుతుందని భావించి చస్తే జనాలే కదా చచ్చేదని అనే ఒక దరిద్రమైన ఉద్దేశంతోనే ఈ చర్యలకు ఒడి కట్టడం అనేది సిగ్గుచేటని అన్నారు. ప్రజల ప్రాణాలను అంత ఈజీగా తీసుకున్న ప్రభుత్వం… ఒక్క జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో దొరికే లిక్కర్ బ్రాండ్లు దేశంలో ఎక్కడా కూడా దొరకవని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో దొరికే లిక్కర్ బ్రాండ్ల పేర్లను ఈ సందర్భంగా రఘురామకృష్ణ రాజు మీడియా ప్రతినిధుల ముందు ప్రదర్శించారు. 9 సి హ ర్సెస్, ఆంధ్ర గోల్డ్, సెలబ్రిటీ క్లాసిక్, ఎపిక్ రిజర్వ్, బ్రిటిష్ ఎంపైర్ గ్రాండ్ బీర్, గోల్డెన్ పెరల్, మలబార్ హౌస్ అంటూ రకరకాల పేర్లతో నాసిరకం మద్యాన్ని మద్యపాన ప్రియుల చేత తాగిస్తున్నారని, రోజువారి కూలీ చేసుకునే వారే ఎక్కువగా ఈ మధ్య సేవించి స్మశానానికి దారేది అని వెతుక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాళ్లకు వేసుకోవడానికి చెప్పులు లేకపోయినా 225 రూపాయలు చెల్లించి క్వార్టర్ మద్యం సీసాను కొనుగోలు చేస్తున్నారని చెప్పారు.

గతంలో ఇదే క్వార్టర్ సీసా నాణ్యమైన మద్యం కేవలం 60 రూపాయలకే లభించేదని పేర్కొన్నారు. రోజంతా కష్టపడి పనిచేసి, ఒళ్ళు నొప్పులు తగ్గడానికి మద్యం సేవించేవారికి, ఈ నాసిరకమైన మద్యం సేవించడం వల్ల మరుసటి రోజు లేచి పనికి వెళ్లలేక పోతున్నారని, ఒకవేళ వారు చావకుండా బ్రతికి ఉంటే వారి లివర్లు, కిడ్నీలు కొట్టేస్తున్నాయని అన్నారు. ఈ విషయాన్ని ఈనాడు దినపత్రిక వెలుగులోకి తెచ్చినందుకు రేపు సాక్షి దినపత్రికలో ఎంతో నాణ్యమైన మద్యాన్ని ఇస్తుంటే, రామోజీరావు అడ్డగోలు రాతలు రాస్తున్నారని విమర్శిస్తారన్నారు.

మద్యంలో హానికారక పదార్థాలు ఉన్నాయన్న ఎస్ జి ఎస్ ల్యాబ్ నివేదికను పార్లమెంటరీ హెల్త్ కమిటీ సభ్యుడిగా ఉన్న తాను లేవనెత్తానని, ప్రధానమంత్రికి లేఖ రాశానని, ప్రధానమంత్రి స్పందించి విచారణకు ఆదేశించగా కొంత మంది అధికారులు విచారణ చేపట్టి, ప్రాథమిక స్థాయిలో ప్రభుత్వం సరఫరా చేస్తున్న మద్యంలో హానికారక పదార్థాలు ఉన్న మాట నిజమేనని అంగీకరిస్తూనే రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఒత్తిడికి తలోగ్గి విచారణను నిలిపివేశారన్నారు.

Leave a Reply