– సీఎం చంద్రబాబు నాయుడు
వెలగపూడి : కలెక్టర్ల సమావేశంలో పియం సూర్య ఘర్ పధకంపై సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10 వేల రూఫ్ టాప్ యూనిట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టామని అన్నారు.
*ఆ ప్రకారం ఈ ఏడాది రాష్ట్రంలో 20 లక్షల రూఫ్ టాఫ్ సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈవిషయంలో ఎంఎల్ఏలు, కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
2 కిలోవాట్ రూఫ్ టాప్ యూనిట్లు ఏర్పాటు చేసుకునే ఎస్సి,ఎస్టి లబ్దిదారులకు కేంద్ర ప్రభుత్వం 60వేల రూ.లు, రాష్ట్ర ప్రభుత్వం 55 వేల రూ.లను సబ్సిడీగా అందించి నూరు శాతం ఉచితంగా అందిస్తుందని తెలిపారు.వారి అవసరాలకు వినియోగించు కోగా మిగిలిన విద్యుత్ ను గ్రిడ్ కు అందిస్తే యూనిట్ కు 2రూ.ల 90 పైసలు వంతున చెల్లించడం జరుగుతుందని సీఎం పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎస్టి, ఎస్సిలకు 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, ఈపధకం అమలుతో వారికి మరింత ప్రయోజనం కలుగుతుందన్నారు.
అదే బిసి వర్గాలకు అయితే 2కిలో వాట్ కు కేంద్రం 60 వేల రూ.లు, రాష్ట్ర ప్రభుత్వం 20 వేలు అందించనుండగా మరో 35 వేల రూ.లను లబ్దిదారులు బ్యాంకు ద్వారా రుణం పొంది 5ఏళ్ళ కాలపరిమితితో తిరిగి చెల్లించ వచ్చని అన్నారు.
ఈ యూనిట్లు ఏర్పాటు చేసుకున్నవారు వారి అవసరాలకు వినియోగించగా మిగిలిన విద్యుత్ ను గ్రిడ్ కు ఇస్తే యూనిట్ 2రూ.ల 90 పైసలకు కోనుగోలు చేయడం జరుగుతుందన్నారు. అన్ని రాష్ట్రాలు ఈపధకం అమలు ప్రారంభించక ముందే మనం వీలైనన్ని యూనిట్లు ఏర్పాటుకు కృషి చేయాలని సియం స్పష్టం చేశారు.
అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ పియం సూర్య ఘర్ ను కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించడం జరిగిందని వివరించారు. రాష్ట్రంలో 200 యూనిట్లు వరకూ ఉచిత విద్యుత్ పొందుతున్న ఎస్సి,ఎస్టి లబ్ధిదారులను గుర్తించడం జరిగిందని అన్నారు. వారందరూ ఈపధకాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునేలా చూడాలని చెప్పారు.
పియం సూర్య ఘర్ కార్యక్రమం డిమాండ్ డ్రైవెన్ ప్రోగ్రామ్ కావున ఎంత ఎక్కువ వినియోగించుకో గలిగితే అంత మేలు జరుగుతుందని సిఎస్ చెప్పారు.