– టీడీ లాంటి నేత దొరకడం అరుదు
– అభినందనలతో ముంచెత్తిన టీడీపీ నేతలు
అమరావతి: టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, పార్టీ అధినేత చంద్రబాబు రాజకీయ కార్యదర్శి టిడి జనార్దన్ జన్మదిన వేడుకలు టీడీపీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. పార్టీకోసం నిరంతరం శ్రమించే సైనికుడయిన టీడీ సేవలు, పార్టీకి శాశ్వతంగా కొనసాగాలని ఈ సందర్భంగా పలువురు నేతలు సూచించారు. పార్టీనే ఆశ, శ్వాస, ధ్యాసగా ఉండే టీడీ జనార్దన్ సేవలను పార్టీ నాయకత్వం మరింత సమర్ధవంతంగా వినియోగించుకోవాలని కోరారు.
పార్టీ విపక్షంలో ఉన్నప్పుడల్లా క్రమశిక్షణ గల సేనానిలా జనార్దన్ చేసిన సమన్వయం, నాయకులు- కార్యకర్తలు ఎప్పటికీ మర్చిపోలేరని కొనియాడారు. నాయకత్వానికి-నాయకులకు మధ్య వారథిగా ఉంటున్న టిడి జనార్దన్ అంకితభావం, చిత్తశుద్ధిని అందరికీ ఆదర్శమన్నారు.
పదవులతో సంబంధం లేకుండా, ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా తానున్నానంటూ వారి సమస్యలు పరిష్కరించి, వారి కష్టాల్లో పాలుపంచుకునే టీడీ లాంటి నిస్వార్ధ నాయకుడు రాజకీయాల్లో బహు అరుదని, అలాంటి నాయకుడు తమ పార్టీకి లభించడం అదృష్టమని అభినందించారు.
మహానేత దివంగత ఎన్టీఆర్ సేవలను భావితరాలు మర్చిపోకుండా గుర్తు చేసేందుకు, రాష్ట్రం దాటి విదేశాల్లో ఎన్టీఆర్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్న టిడి జనార్దన్ టీడీపీ శ్రేణుల మనసుల్లో చిరస్థాయిగా నిలిపోతారన్నారు. ఈ సందర్భంగా షోలాపూర్‌కు చెందిన ఓ ఎన్టీఆర్ అభిమాని నూలుతో రూపొందించిన చిత్రపటాన్ని, ఆయనకు బహుకరించారు. అంతకుముందు టిడి జనార్దన్‌కు, గన్నవరం ఎయిర్‌పోర్టులో కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. చిగురు అనాధ ఆశ్రమంలో చిన్నారులతో కలసి ఆయన తన జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.