-డగ్స్ రహిత రాష్ట్రంగా ఏపీ
– త్వరలో రాష్ట్రవ్యాప్తంగా డెకాయ్ ఆపరేషన్
– ఐజీ ఆకే రవికృష్ణ
అమరావతి: డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశయాలకు అనుగుణంగా, రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మార్గనిర్దేశకత్వంలో “ఈగల్” పనిచేస్తుందని ఐజీ ఆకే రవికృష్ణ అన్నారు.
ఈగల్ మరియు డ్రగ్స్ కంట్రోల్ అసోసియేషన్ ఆధర్యంలో రాష్ట్ర సీమాంధ్ర డ్రగ్స్ డీలర్స్ అసోసియేషన్ వారితో నేడు మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన డ్రగ్స్ నియంత్రణపై జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఐజీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ ఈగల్, డ్రగ్స్ కంట్రోల్ శాఖ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మరియు పోలీసు శాఖలు సంయుక్తంగా ‘ఆపరేషన్ గరుడ’ను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ దాడుల్లో 158 మందుల షాపులు నిబంధనలు అతిక్రమించినట్లు తెలిపారు. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొని, కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డ్రగ్స్ కంట్రోల్ అసోసియేషన్ వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఎన్.ఆర్.ఎక్స్ మరియు ఎక్స్ఆర్.ఎక్స్ డ్రగ్స్ ఎటువంటి ప్రిస్కిస్సన్స్ లేకుండా మెడికల్ షాపుల్లో విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. మందుల అమ్మకం మరియు కొనుగోలుకు సంబంధించిన బిల్ బుక్ను సరైన పద్ధతిలో నిర్వహించడం లేదన్నారు. అంతేకాకుండా కాలం చెల్లిన మందులను నిరక్షరాస్యులు, పిల్లలు మరియు వృద్ధులకు డిస్కౌంట్స్ పేరుతో అమ్ముతన్నట్లు “ఈగల్” గుర్తించిందన్నారు.
అటువంటి మందుల షాపులపై ఎన్జీపిఎస్ అండ్ డ్రగ్ కాస్మోటిక్ యాక్ట్ ప్రకారం సీజ్, వార్షింగ్ మెమో, లైసెన్సులను రద్దుచేయడంతో పాటు సంబంధిత వ్యక్తులపై కేసులను నమోదు చేయడం జరుగుతుందన్నారు.
ఎన్.ఆర్.ఎక్స్ డ్రగ్స్ను విచ్చలవిడిగా వాడటం వల్ల పలు అనారోగ్య సమస్యలు తలెత్తున్నాయని వివరించారు. మందుల చీటీ లేకుండా సైకోట్రిక్స్ మందుల ఇవ్వము అన్నది విస్త్రతంగా ప్రజల్లోకి బలంగా వెళ్లాలని, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో డ్రగ్స్ కంట్రోల్ అసోసియేషన్ వారు క్రియాశీలంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్ది. రాబోవు తరాలు డ్రగ్స్ బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు.
దీనికి డ్రగ్ డీలర్స్ అసోసియేషన్స్ వారు ముందుకు వచ్చి ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఎన్.ఆర్. ఎక్స్ డ్రగ్స్ ను అరికట్టడానికి త్వరలో రాష్ట్రవ్యాప్తంగా డెకాయ్ ఆపరేషన్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఎవరైనా నిషేధిత మందులను విక్రయిస్తున్నట్లు దృష్టికి వస్తే 1972 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఈగల్ ఎస్పీ నగేష్ బాబు, డి.జి. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ప్రసాదు, సీమాంధ్ర డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర మరియు జిల్లాస్థాయి కార్యవర్గసభ్యులు, ఈగల్ కు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.