Suryaa.co.in

Andhra Pradesh

చంద్రయ్య హత్యను టీడీపీ,చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు

– ప్రశాంతంగా ఉన్న పల్నాడులో అలజడి సృష్టించాలన్నదే టీడీపీ పన్నాగం
– బాబు హయాంలోనే మాచర్ల ప్రాంతంలో 15 ఫ్యాక్షన్ హత్యలు జరిగాయి
– బ్రహ్మానందరెడ్డి మళ్ళీ మాచర్ల టీడీపీ ఇన్ చార్జి అయ్యాకే గొడవలు మొదలయ్యాయ్
– వ్యక్తిగత కక్షల నేపథ్యంలోనే పల్నాడులో చంద్రయ్య హత్య, రాజకీయాలకు సంబంధం లేదు
– చంద్రయ్య హత్యకు వైయస్ఆర్సీపీకి ఎలాంటి సంబంధం లేదు, ఫ్యాక్షన్ రాజకీయాలకు వైఎస్ఆర్సీపీ వ్యతిరేకం
– ఎటువంటి ఒత్తిళ్ళకు లొంగకుండా హంతుకులపై కఠిన చర్యల తీసుకోవాలని పోలీసుల్ని కోరుతున్నాం
– ఫ్యాక్షన్ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం
– మేం ఫ్యాక్షన్ రాజకీయాలకు దూరం కాబట్టే, మా కుటుంబాన్ని ప్రజలు 5సార్లు గెలిపించారు.
– ఎవరు ఎలాంటి వ్యక్తులో, ఎవరి హయాంలో గొడవలు జరుగుతున్నాయో పల్నాడు ప్రజలు ఆలోచన చేయాలి
-ప్రభుత్వ విప్, మాచర్ల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
1- వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామ టీడీపీ అధ్యక్షుడు తోట చంద్రయ్య హత్యకు గురవ్వడం చాలా దురదృష్టకరం. అ హత్యకు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఇది వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యే తప్ప రాజకీయ కక్షలతో జరిగింది కాదు. ఆ ప్రాంతం చాలా సున్నితమైనది. గతంలో కూడా ఆ గ్రామంలో చాలా ఫ్యాక్షన్‌ హత్యలు జరిగాయి. 2009లో తాను శాసనసభ్యుడిగా ఎంపికైన రోజు నుంచి గడిచిన 15 సంవత్సరాల నుంచి మాచర్ల నియోజకవర్గంలో ఎలాంటి ఫ్యాక్షన్‌ గొడవలు కానీ, హత్యలుగానీ జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం.

2- చంద్రయ్య హత్యకు సంబంధించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్‌ అధికారులను కోరుతున్నాం. ఈ హత్యలో ప్రమేయం ఉన్నవారిపై చర్యలు తీసుకునే విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లొంగకుండా పోలీసులు వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యుడిగా కోరుకుంటున్నాను. గడిచిన 15ఏళ్లుగా అదే కోణంలో ప్రజలకు ఒక జవాబుదారిగా పనిచేస్తున్నాను. ఇవాళ జరిగిన ఆ సంఘటనను ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ రాజకీయం చేయాలని చూస్తోంది. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, టీడీపీ నాయకులు ఈ ఘటనను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలని, రాజకీయ కోణంలో చూపేందుకు యత్నిస్తున్నారు. ఇది మంచి పద్దతి కాదు.

3- ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి సంకల్పం మేరకు ప్రభుత్వం అమలు చేసే అన్ని సంక్షేమ కార్యక్రమాలను కులం, మతం, వర్గం, ప్రాంతం, పార్టీలు చూడకుండా.. నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో, ప్రతి పేదవాడి ఇంటికి ఇస్తున్నాం. అందర్నీ కలుపుకుని ముందుకు వెళుతున్నాం. ఫ్యాక్షన్ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రతి గ్రామంలోనూ రాజకీయ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం.

4- ప్రశాంతంగా ఉన్న మాచర్ల నియోజకవర్గంలో ఏదోరకంగా అలజడులు సృష్టించాలని, పల్నాడు ప్రజలు ప్రశాంతంగా ఉండకూడదనే ఆలోచనతో కొంతమంది నాయకులు పనికట్టుకుని కక్షలు కార్పణ్యాలను ప్రోత్సహిస్తున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు 2003-2004 ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా, ప్రస్తుత టీడీపీ ఇన్ చార్జి బ్రహ్మానందరెడ్డి తల్లి మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా, ఆయన ఇన్‌ఛార్జ్‌గా ఉండేవాళ్లు. వాళ్ల సొంత గ్రామంలో తొమ్మిది హత్యలు జరిగాయి. అప్పట్లో మాచర్ల నియోజకవర్గంలో 15 హత్యలు జరిగాయి. అలాంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడు మళ్లీ మాచర్ల నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్పారు. పల్నాడు ప్రజలు ప్రశాంత జీవనం గడపకూడదనేలా మళ్లీ అలజడి సృష్టించేందుకు వీళ్ళంతా పనిచేస్తున్నారు. ఈ విషయాన్ని దయచేసి పల్నాడు ప్రజలంతా గమనించాలని మనవి. ఎవరు ఎలాంటి వాళ్లో ఒకసారి ఆలోచన చేయాలని కోరుతున్నాం.

5- బ్రహ్మానందరెడ్డికి మాచర్ల నియోజకవర్గ బాధ్యతలు అప్పగించిన సమయంలో పక్క నియోజకవర్గం నుంచి కూడా కొంతమంది వచ్చి హడావుడి సృష్టించిన విషయం తెలిసిందే. ఈ హత్యను అడ్డుపెట్టుకుని మళ్ళీ టీడీపీ హత్యా రాజకీయాలను పెంచి పోషించేందుకే చంద్రబాబు మాచర్ల ప్రాంతంలో పర్యటిస్తున్నారు. పొరుగు నియోజకవర్గాలు, ఈ నియోజకవర్గం నుంచి కొంతమందిని పోగేసి హడావుడి చేసి పోవాలని చంద్రబాబు, టీడీపీ నేతలు చూస్తున్నారు. వాళ్లు ఎంత హడావుడి చేసినా ఇక్కడ జరిగేదేమీ ఉండదు.

6- మేము ఫ్యాక్షన్‌ రాజకీయాలకు వ్యతిరేకం. ఏ ఒక్క కుటుంబానికి కూడా అన్యాయం చేయాలని అనుకోం. ఏ కుటుంబాన్నీ ఫ్యాక్షన్‌ వివాదాలకు బలి కావాలని కోరుకోం. మేము రాజకీయంగా ఎక్కడా కూడా తప్పు చేయం. మేము తప్పు చేయలేదు కాబట్టే మా కుటుంబం నుంచి మాచర్ల నియోజకవర్గ ప్రజలు అయిదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. అందులో నన్ను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించారు.

7- చంద్రబాబు నాయుడు వైఖరి ఎలా ఉందంటే… రాష్ట్రంలో ఏం జరిగినా, ఆఖరికి దున్న ఈనిందంటే… దొడ్లో కట్టేయండి.. అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఎక్కడ ఏం జరిగినా, వ్యక్తిగత కక్షలతో వివాదాలు చోటుచేసుకున్నా, దానికి ముఖ్యమంత్రిగారే కారణం అని ఆరోపణలు చేయడం, వైయస్సార్‌ సీపీ నాయకుల హస్తం ఉందంటూ విమర్శలు చేయడం పరిపాటిగా మారిపోయింది. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఇలాంటి మాటలు తెలిసి మాట్లాడుతున్నారో, తెలియక మాట్లాడుతున్నారో గానీ… ఆయన ప్రవర్తనను ప్రజలు గమనిస్తున్నారు.
– ఇప్పటికైనా చంద్రయ్య హత్య ఎందుకు జరిగింది? అందుకు గల కారణాలపై చంద్రబాబు వాస్తవాలు తెలుసుకుంటే మంచిది.
– ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు కూడా జరగడం లేదు. మరి హత్యకు దారితీసిన పరిణామాలపై పోలీసులు విచారణ చేపట్టాలి.
– ఇక బ్రహ్మానందరెడ్డి ఇన్‌ఛార్జ్‌ గా వచ్చిన తర్వాతే మళ్లీ గొడవలు జరుగుతున్నాయి. ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా మేము తీవ్రంగా ఖండిస్తాం.

8- మాచర్ల నియోజకవర్గంలో జరిగిన హత్యకు, రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేకపోయినా, కేవలం ప్రచారం కోసం, ప్రభుత్వంపై నిందలు మోపడం కోసం ఇక్కడకు వచ్చి… ఏదో జరిగిందని, చంద్రబాబు ఒకరోజు పర్యటన చేసి, హడావిడి చేసి, వైయస్ఆర్సీపీ శ్రేణులను భయపెట్టాలనుకుంటే అది కలలో కూడా జరగని పని. మేము తప్పు చేయనప్పుడు … నా చిటికెన వేలు వెంట్రుకను కూడా కదిలించలేరు. మేము తప్పు చేయం. తప్పు చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. వ్యక్తిగత కారణాలతో జరిగిన హత్యను రాజకీయ హత్యగా చిత్రీకరించాలని చూడటం సరికాదు.
– ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రిగారిపై నిత్యం అసత్యాలు ప్రచారం చేయడం చంద్రబాబుకు పరిపాటిగా మారింది. ప్రభుత్వం ఏం చేసినా వక్రీకరించి మాట్లాడటం చూస్తున్నాం. ఇప్పటికైనా చంద్రబాబు తన వైఖరి మార్చుకోకపోతే.. ఆయన్ను బ్రహ్మదేవుడు కూడా రక్షించలేరు.

LEAVE A RESPONSE