Home » బద్వేలులో టీడీపీ-బీజేపీ బంధం!

బద్వేలులో టీడీపీ-బీజేపీ బంధం!

– మునుపటిలా టీడీపీని విమర్శించని బీజేపీ అగ్రనేతలు
– గ్రామాల్లో టీడీపీ నేతలే బీజేపీ పోలింగ్ ఏజెంట్లు
– స్థానిక రాజకీయ అంశాలే కారణం
– బీజేపీ-బీజేపీ-జనసేన ఉమ్మడి వ్యూహం
– సునీల్ దియోథర్ మాటలు పట్టించుకోవద్దన్న కడప కమలదళాలు
– ఫలించిన ఆదినారాయణరెడ్డి, సీఎం రమేష్ కృషి
– సత్యకుమార్ సమన్వయంతో పోటీలో నిలిచిన బీజేపీ
( మార్తి సుబ్రహ్మణ్యం)
గత ఎన్నికల ముందు తెగిపోయిన బీజేపీ-టీడీపీ బంధం బద్వేలు ఉప ఎన్నికతో మళ్లీ పెనవేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకూ టీడీపీ నాయకత్వం నుంచి.. ఆ పార్టీ క్యాడర్‌కు, బీజేపీకి మద్దతునివ్వాలన్న సంకేతాలు అధికారికంగా రాకపోయినప్పటికీ, స్థానిక రాజకీయాల కోణంలో టీడీపీ నేతలు, బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. కడప జిల్లాకు చెందిన బీజేపీ అగ్రనేతలు సత్యకుమార్, సీఎం రమేష్, ఆదినారాయణరెడ్డికి స్థానిక టీడీపీ నేతలతో మొదటినుంచీ ఉన్న సంబంధాలు కూడా దీనికి దోహదపడింది. దానికితోడు జనసేన కూడా బీజేపీకి అనుకూలంగా పనిచేసింది. ఫలితంగా అసలు పోటీలో ఉండదనుకున్న బీజేపీ.. పోలింగుకు రెండురోజుల ముందు, అధికార వైసీపీకి గట్టి పోటీ ఇచ్చే స్థాయికి చేరటం ఆసక్తికరంగా మారింది. నిజానికి ఆరంభంలో కాంగ్రెస్ రెండవ స్ధానంలో ఉంటుందన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు బీజేపీ రెండవ స్థానంలో ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది.
బద్వేలు ఉప ఎన్నికతో టీడీపీ-బీజేపీ బంధం తిరిగి మొదలయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. నిజానికి బరిలో ఉన్న బీజేపీ నియోజకవర్గంలో బలహీనమైన పార్టీ. గతంలో 1415, అంతకుముందు 500 ఓట్లు మాత్రమే సాధించగలిగింది. ప్రధానంగా బీజేపీకి అన్ని పోలింగ్‌బూత్‌లలో పోలింగ్ బూత్ ఏజెట్లు, స్లిప్పులు పంపిణీ చేసేవారు, పోలింగ్‌బూత్‌ల వద్ద టేబుల్ వేసుకుని కూర్చునేంత సంఖ్యలో కార్యకర్తలు- యంత్రాంగం కూడా లేరన్నది బహిరంగ రహస్యం. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలో బీజేపీ రాష్ట్ర నేతలతోపాటు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన జిల్లా నేతలు ఉధృతంగా ప్రచారం చేసినా, వారిని పోలింగ్‌బూత్ ఏంజె ట్ల కొరత వెన్నాడింది.
పోలింగ్ స్లిప్పుల పంపిణీ ప్రక్రియను… బయటనుంచి వచ్చిన కార్యకర్తలు ఏదో ఒక విధంగా భర్తీ చేసినా, స్థానికంగా కావలసిన బూత్ ఏజెంట్లు దొరకడమే బీజేపీకి కష్టంగా మారింది. ఒక్కో పోలింగ్‌బూత్‌కు ఇద్దరేసి ఏజెంట్లు, 280కి పైగా ఉన్న బూత్‌లకు అవసరం. కాగా 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 58.08 శాతం ఓట్లు రాగా, టీడీపీకి 31 శాతం, బీజేపీకి 1.05 శాతం ఓట్లు లభించాయి. 2014 ఎన్నికల్లో టీడీపీకి 44.18 శాతం ఓట్లు రాగా, 2019లో టీడీపీకి 32.36 శాతం, బీజేపీకి 735 ఓట్లు, నోటాకు 2004 ఓట్లు పోలయ్యాయి. దీన్నిబట్టి బద్వేలులో టీడీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉందని స్పష్టమవుతోంది. నిజానికి బద్వేలులో తొలినుంచీ టీడీపీకి గట్టి పట్టుంది. వైఎస్ హయాంలోనే అక్కడ టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భాలున్నాయి.
ఈ నేపథ్యంలో వారికి స్థానికంగా ఉన్న టీడీపీ నేతల మద్దతు అనివార్యమయింది. బీజేపీతో పొత్తు లేకపోవడం, వైసీపీకి ఢిల్లీ స్థాయిలో బీజేపీ మద్దతుగా ఉండటం, వీటికి మించి.. బీజేపీ రాష్ట్ర కో ఇన్చార్జి సునీల్ దియోధర్, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి తొలి నుంచి తమ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తుండటంతో.. స్థానిక టీడీపీ నేతలు బీజేపీకి పనిచేయాలనుకున్నప్పటికీ, చాలారోజులు ముందుకురాలేదు. ప్రధానంగా కొద్దిరోజుల క్రితం సునీల్‌దియోధర్ టీడీపీనుద్దేశించి ఎల్లో స్నేక్స్ అని విమర్శించడం టీడీపీకి ఆగ్రహం కలిగించింది.
కానీ బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ సొంత జిల్లా కావడం, పార్టీ అభ్యర్థిని ఆయనే నిలబెట్టిన నేపథ్యంలో.. సత్యకుమార్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. అండమాన్ ఇన్చార్జిగా, యుపి ఎన్నికల్లో బిజీగా ఉన్నప్పటికీ, ఆయన బద్వేలులో ప్రచారం నిర్వహించారు. అదే జిల్లాకు చెందిన ఎంపీ సీఎం రమేష్, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిలతో సమస్వయం చేసిన సత్యకుమార్.. జిల్లాల నుంచి పార్టీ శ్రేణులను పిలిపించారు.
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో శ్రమించినట్లే ఆదినారాయణరెడ్డి ఈ ఉప ఎన్నికలో కూడా కష్టపడ్డారు. బలిజలు ఎక్కువగా ఉన్న మండలాల్లో జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రచారం నిర్వహించారు. చాలామంది జిల్లా నేతలకు సత్యతో ఉన్న వ్యక్తిగత బంధం కారణంగా, వారంతా మండలాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. టీడీపీలో పనిచేసిన అనుభవంతో ఆదినారాయణరెడ్డి, సీఎం రమేష్ స్థానిక టీడీపీ నేతలను.. బీజేపీకి అనుకూలంగా పనిచేసేలా చూడటంలో సఫలీకృతులయ్యారు. అందులో భాగంగానే ఎన్నికలో టీడీపీ నేతలు, పోలింగ్‌బూత్ ఏజెంట్లుగా వచ్చేందుకు అంగీకారం కుదిరినట్లు సమాచారం.
అటు టీడీపీ నేతలు కూడా తమ పార్టీ బరిలో లేకపోవడం, స్థానికంగా వైసీపీ నేతల దాడులు, తమ పార్టీ కార్యకర్తలకు పథకాలు వర్తింపచేయకపోవడం, ఉన్నవాటిని తొలగించడం వంటి కారణాలతో ఉప ఎన్నికలో బీజేపీకి అనుకూలంగా పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే, టీడీపీని సునీల్ దియోధర్, సోము వీర్రాజు వంటి నేతలు టార్గెట్ చేస్తున్నప్పటికీ, ఉప ఎన్నికలో వైసీపీ మెజారిటీని భారీగా తగ్గించే లక్ష్యంతో, వారి విమర్శలు పట్టించుకోకూడదని నిర్ణయించారు.
అందుకు తగినట్లుగానే.. ఎప్పుడూ టీడీపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు కురిపించే సునీల్ దియోధర్, సోమువీర్రాజు, జీవీఎల్, విష్ణువర్దన్‌రెడ్డి.. ఉప ఎన్నిక ప్రచారంలో ఎక్కడా టీడీపీని విమర్శించకపోవడం ప్రస్తావనార్హం. కొద్దిరోజుల ముందు సునీల్ దియోధర్ టీడీపీని ఎల్లో స్నేక్ అని, బీజేపీని టీడీపీ పార్కింగ్‌ప్లేస్‌గా మార్చే సమస్యలేదని చేసిన వ్యాఖ్యలు, సొంత పార్టీలోనే దుమారం సృష్టించాయి. ఒకవైపు బద్వేలు ఎన్నికలో టీడీపీ సహకారం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో, అందుకు విరుద్ధంగా సునీల్ వ్యాఖ్యలు చేయడమేమిటని పార్టీ సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘మమ్మల్ని బీజేపీ వాళ్లు పోలింగ్ బూత్‌ ఏజెంట్లుగా కూర్చోవాలని కోరారు. ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న వాళ్లంతా గతంలో మావాళ్లే. ఉప ఎన్నికలో మా సాయం అడిగారు. ఎలాగూ మా పార్టీ పోటీ చేయటం లేదు. మా లక్ష్యం వైసీపీ మెజారిటీ తగ్గించడమే. బీజేపీ అభ్యర్థి కూడా కష్టపడే మనస్తత్వంగలవాడు. బీజేపీ అగ్రనేతలు నలుగురు మా పార్టీకి యాంటీగా ఉన్నారన్నది మాకు తెలుసు. కానీ ఇప్పుడు అది పట్టించుకోకూడదు. ఈ ఎన్నిక ప్రచారంలో బీజేపీ వాళ్లు మా పార్టీని ఎక్కడా విమర్శించలేదు. వీటికిమించి లోకల్‌గా మా పార్టీ క్యాడర్‌ను కాపాడుకోవలసిన బాధ్యత మాపై ఉంది. మేం మౌనంగా ఉంటే మా వాళ్లను వైసీపీ వాళ్లు కొనేసే ప్రమాదం ఉంది. అందుకే మేం బీజేపీ వాళ్ల అభ్యర్ధన మేరకు వారితో కలసిపనిచేయాలని నిర్ణయించుకున్నాం. మేము, జనసేన కలసి వైసీపీ మెజార్టీని తగ్గించడానికే కృషి చేస్తున్నాం’’ అని పోరుమామిళ్లకు చెందిన ఓ టీడీపీ మండల నేత అసలు విషయం వెల్లడించారు. అయితే… వైసీపీకి చెందిన ఒక మాజీ మంత్రితో బంధుత్వం ఉన్న, బద్వేలు నియోజకవర్గ టీడీపీ అగ్రనేత అనుచరులు మాత్రం ఎవరికీ పనిచేయకుండా, మౌనంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Leave a Reply