Suryaa.co.in

Editorial

జూబ్లీహిల్స్ బరిలో టీడీపీ?

– దీనిపై సోషల్‌మీడియాలో జోరుగా ప్రచారం
– నందమూరి సుహాసినితో పోటీ చేయించాలంటున్న తమ్ముళ్లు
– కమ్మ, సెటిలర్లు ఉన్నందున గెలుస్తామంటున్న క్యాడర్
– బీఆర్‌ఎస్ విమర్శలను సమాధానం ఇచ్చే సరైన సమయమంటున్న సీనియర్లు
– బాబు ఈసారైనా ధైర్యం చేయాలంటున్న టీడీపీ కార్యకర్తలు
– మాగంటి గోపీ విజయం వెనుక టీడీ పీ కార్యకర్తలే ఉన్నారంటున్న టీడీపీ నేతలు

( మార్తి సుబ్రహ్మణ్యం)

గ్రేటర్ హైదరాబాద్ పరిథిలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపి మృతితో జరగనున్న ఉప ఎన్నికలో టీడీపీ బరిలో దిగనుందా? తాజాగా సోషల్‌మీడియాలో జోరుగా జరుగుతున్న ప్రచారంతోపాటు.. టీడీపీ కార్యకర్తల వాదన చూస్తుంటే.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో టీడీపీ పోటీ చేస్తుందన్న భావన బలపడుతోంది.

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ ఆకస్మిక మృతితో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమయింది. ఆ మేరకు త్వరలో జరిగే ఉప ఎన్నికకు, కాంగ్రెస్ అభ్యర్ధిగా అజారుద్దీన్ పేరు దాదాపు ఖరాయిందన్న ప్రచారం జరుగుతోంది. టీఆర్‌ఎస్ అభ్యర్ధిగా ఆయన భార్యను నిలబెడతారా? లేక మరెవరినయినా నిలబెడతారా అన్నది ఇంకా ఖరారు కాలేదు. బీజేపీ నుంచి గతంలో పోటీ చేసి ఓడిన లంకెల దీపక్‌రెడ్డి మరోసారి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలో టీడీపీ ఎన్నిక బరిలో దిగాలన్న డిమాండ్, హైదరాబాద్ కార్యకర్తల నుంచి పెరుగుతోంది. ఈ డిమాండ్‌కు తగినట్లుగానే ఉప ఎన్నిక బరిలో, టీడీపీ పోటీ చేస్తుందంటూ సోషల్‌మీడియాలో ప్రచారం హోరెత్తుతోంది. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నందున, ఈసారి కచ్చితంగా పార్టీ పోటీ చేయాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.

‘గత ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తే ఓట్లు చీలి టీఆర్‌ఎస్‌కు లాభిస్తుందన్న ఆలోచనతో దూరంగా ఉన్నందుకే కాంగ్రెస్ గెలిచింది. కానీ ఇప్పుడు అధికారం ఉన్నప్పటికీ సిటీలో కాంగ్రెస్‌కు పెద్ద బలం లేదు. జూబ్లీహిల్స్‌లో మాగంటి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా గెలిచింది కూడా, టీడీపీ కార్యకర్తల సహకారంతోనే అన్నది అందరికీ తెలుసు. పైగా అక్కడ కమ్మ సామాజికవర్గం, సెటిలర్ల ఓట్లు ఎక్కువ. ఈ నేపథ్యంలో పార్టీ పోటీచేస్తే గెలుపు ఖాయం. కాంగ్రెస్-బీఆర్‌ఎస్ పోటీతో ఓట్లు చీలి మనకే లాభిస్తుంది. ఆరకంగా తెలంగాణ అసెంబ్లీలో ఖాతా ప్రారంభిసే,్త అది వచ్చే ఎన్నికలకు టానిక్‌లా పనిచేస్తుంద’’ని ఓ సీనియర్ నాయకుడు విశ్లేషించారు.

గ్రేటర్ హైదరాబాద్‌లో టీడీపీ తప్పుకున్నందుకే బీఆర్‌ఎస్ బలపడిందని, ఆ పార్టీలో ఉన్నవాళ్లంతా తమ పార్టీవారేనని టీడీపీ సీనియర్లు గుర్తు చేస్తున్నారు. ‘‘టీడీపీ లేకపోవడం, బీఆర్‌ఎస్‌లో ఉన్నవాళ్లంతా టీడీపీ వాళ్లే కావడంతో ప్రజలు బీఆర్‌ఎస్ అభ్యర్ధులను గెలిపించారు. ఇప్పుడు మేం సిటీలో కార్యకలాపాలు మొదలుపెడితే మేం నెంబర్‌వన్ లో కాకపోయినా, మళ్లీ పార్టీ పతాకం రెపరెపలాడుతుంది. అందుకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేదిక అయితే బాగుంటుంద’ని ఓ రాష్ట్ర నేతల వ్యాఖ్యానించారు.

ఆ మేరకు నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసినిని బరిలో దింపితే, సత్ఫలితాలు ఉంటాయని సూచిస్తున్నారు. గతంలో ఆమె కూకట్‌పల్లిలో బీఆర్‌ఎస్‌కు బలమైన పోటీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఆమె అభ్యర్ధి అయితే, ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో ఉన్న టీడీపీ పాత కార్యకర్తలు కూడా ఆమెకే ఓటువేస్తారంటున్నారు. అదే సమయంలో పార్టీ గెలుపు కోసం, నగరంలోని నాయకులంతా పట్టుదలతో పనిచేస్తారని చెబుతున్నారు.

గత ఎన్నికల ముందు పార్టీ అధినేత చంద్రబాబున అరెస్టు చేసినప్పుడు ఏపీలో కంటే హైదరాబాద్‌లోనే ఎక్కువ ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. పార్టీ నేతలు ముందుండి నడిపించకపోయినప్పటి కీ…హైదరాబాద్‌లో ఐటి ఉద్యోగులు రోడ్డెక్కి ధర్నాలు చేశారు. కమ్మ, సెటిలర్లు ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ రోజూ క్యాండిల్ ర్యాలీలు చేశారు. పార్టీని వదిలేసి వెళ్లిపోయినప్పటికీ, ప్రజల్లో పార్టీపై ఎంత అభిమానం ఉందో చెప్పడానికి అదో ఉదాహరణ అని ఓ మహిళా నేత గుర్తు చేశారు.

మాజీ ఐఎఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఇంటిపై ఏపీ పోలీసులు దాడి చేసినప్పుడు ఆ అర్ధరాత్రి వారిని అడ్డుకున్నది కూడా హైదరాబాద్ టీడీపీ నాయకులేనని గుర్తు చేస్తున్నారు. హైదరాబాద్, తెలంగాణలో నాయకత్వం పార్టీని పట్టించుకోకపొయినా, కార్యకర్తలు మాత్రం ఇంకా ఇప్పటికీ పార్టీనే అంటిపెట్టుకోవడాన్ని నాయకత్వం పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.

కాగా గత రెండునెల రోజుల నుంచి బీఆర్‌ఎస్ నాయకులు.. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబును లక్ష్యం చేసుకుని చేస్తున్న విమర్శలకు సరైన సమాధానం చెప్పాలంటే, ఈ ఉప ఎన్నికలో పార్టీ పోటీ చేసి గెలవడమే సరైనదంటున్నారు.

LEAVE A RESPONSE