Suryaa.co.in

Editorial

గోదారిలో తమ్ముళ్ల ‘జన’ గోస!

– జన సేన ఎమ్మెల్యేలున్న చోట అనాధలు మారిన టీడీపీ నేతలు
– తిరుపతి లెటర్లకూ దిక్కులేదన్న ఆవేదన
– ఇన్చార్జిలకు టిటీడీ లెటర్లు ఇచ్చే సౌకర్యం కల్పిస్తామని గతంలో నాయకత్వం హామీ
– ఇప్పటిదాకా దానిని అమలుచేయని వైనంపై అసంతృప్తి
– అభివృద్ధి కార్యక్రమాల్లో తమకు ఆహ్వానం లేదని గోల
– పార్టీ ఫ్లెక్సీలు కట్టడానికి ఒప్పుకోని వైనంపై ఆగ్రహం
– ఒంగోలులో బాలినేని-దామచర్ల మధ్య వివాదం
– బాలినేనిపై దామచర్ల వ్యాఖ్యలతో రగిలిపోతున్న బాలినేని
– బాలినేని వర్గాన్ని దూరం పెట్టాల్సిందేనంటున్న దామచర్ల
-ఒంగోలులో టీడీపీ-జనసేన ఎవరి దారి వారిదే
– ఒకటి, రెండు నియోజకవర్గాల్లోనే గౌరవం దక్కుతోందంటున్న తమ్ముళ్లు
-జనసేనకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఒకటి ఇచ్చి మిగిలిన డైరక్టర్ పదవులన్నీ మాకే ఇవ్వాలని వాదన
– సత్ఫలితాలివ్వని సమన్వయకమిటీ సమావేశాలు
– పట్టించుకోని జోనల్ ఇన్చార్జులు

(మార్తి సుబ్రహ్మణ్యం)

మాకు ఇచ్చిన 5 శాతం వాటా కోటా సరిపోదు. ఇంకా పెంచాలంటూ కమలదళాలు అసంతృప్తి స్వరం వినిపిస్తున్న నేపథ్యంలో.. జనసేన ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో మాకు ఏ కోటా లేదంటూ తెలుగుతమ్ముళ్లు వాపోతున్న వైనమిది. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో.. తాము అధికారంలో ఉండీ అనాధలుగా మారుతున్నామన్న ఆవేదనతో తమ్ముళ్ల అంతరంగం అసంతృప్తితో రగిలిపోతున్న పరిస్థితి.

గత ఎన్నికల్లో కూటమి కట్టిన జనసేనకు కేటాయించిన అన్ని నియోజకవర్గాల్లోనూ, ఆ పార్టీ అద్భుత విజయం సాధించింది. అంతకుముందు రెండు నియోజకవర్గాల్లోనూ ఓడిన, జనసేన దళపతి పవన్ కల్యాణ్ ఈసారి పిఠాపురంలో అద్భుత విజయం సొంతం చేసుకున్నారు. పోటీచేసిన అన్ని స్ధానాల్లోనూ జనసేన గెలిచేందుకు టీడీపీ కారకర్తల కష్టమేనని సీనయర్లు కుండబద్దలు కొడుతున్నారు.

నిజానికి గత ఎన్నికల్లో జనసేనకు క్యాడర్, పార్టీ నిర్మాణం ఏమీ లేకపోయినా, టీడీపీ-బీజేపీ శ్రేణుల సహకారంతో జనసేన ఎమ్మెల్యేలంతా గెలిచారు. అదేవిధంగా జనసేన-బీజేపీ శ్రేణుల సహకారంతో టీడీపీ అభ్యర్ధులు కూడా భారీ మెజారిటీతో విజయం సాధించారు. అంతవరకూ బాగానే ఉంది.
అయితే జనసేన ఎక్కువగా గెలిచిన గోదావరి జిల్లాల్లోనే, టీడీపీ-జనసేన మధ్య సమన్వయం లోపించింది. అంతకుముందు ఆ నియోజకవర్గాల్లో హవా చెలాయించిన టీడీపీ నేతలు.. జనసేనకు ఆ సీట్లు ఇవ్వడంతో కొంత అసంతృప్తి చెందినప్పటికీ, జనసేన అభ్యర్ధుల విజయానికి మనస్ఫూర్తిగా పనిచేసి గెలిపించారు.

కానీ జనసేన ఎమ్మెల్యేలు మాత్రం.. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిలు సహా, స్థానిక టీడీపీ సీనియర్లను దూరం పెట్టడం తమ్ముళ్ల అసంతృప్తి, ఆగ్రహానికి కారణమవుతోంది. చివరకు జనసేన ఎమ్మెల్యేల నుంచి తిరుపతి లెటర్లు కూడా తీసుకునే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనసేన ఎమ్మెల్యేలు ఈ ఏడాదిలో తమను పిలిచి మాట్లాడిన సందర్భాలు లేవంటున్నారు.

‘‘ వైసీపీ మళ్లీ రాకూడదన్న లక్ష్యంతో మేం జనసేనను గెలిపించాం. కానీ వాళ్లకు ఆ కృతజ్ఞత వారిలో కనిపించడం లేదు. నేను నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నా. ఇప్పటివరకూ ఒక్క తిరుపతి లెటర్ తీసుకోలేదంటే పరిస్థితిని ఊహించుకోండి. మా నాయకులు మాకు తిరుపతి లెటర్లు ఇప్పించమంటే తెల్లముఖం వేయాల్సిన పరిస్థితి. జనసేన-బీజేపీ ఎమ్మెల్యేలున్న చోట టీడీపీ ఇన్చార్జిలకు తిరుపతి లెటర్లు ఇచ్చే వెసులుబాటు కల్పిస్తామని చంద్రబాబు చెప్పారు. దానిని ఇప్పటివరకూ అమలుచేయని పరిస్థితి ఇది’’ అది గోదావరి జిల్లాలోని ఓ నియోజకవర్గ ఇన్చార్జి వాపోయారు.

కనీసం ఆ వె సులుబాటు ల్పిస్తే, తమ అవమానాలు కొద్దిగానయినా తగ్గుతాయంటున్నారు. అదేవిధంగా జనసేనకు మార్కెట్ కమిటీ చైర్మన్ము ఇచ్చిన చోట తమకే ఎక్కువ డైరక్టర్ పదవులివ్వాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

నియోజకవర్గాల్లో మున్సిపల్ కమిషనర్, ఆర్డీఓ, ఎమ్మార్వో, సీఐ, ఎస్‌ఐలు కూడా తమ మాట వినని పరిస్థితి ఉందని, ఎమ్మెల్యే గారితో చెప్పించమంటున్నారని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే పార్టీ ఫ్లెక్సీలు కట్టే పరిస్థితి లేదంటున్నారు. గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు తమ నియోజకవర్గాల్లో.. తమకు అనుకూలమైన అధికారులను నియమించుకోవాలని ప్రయత్నించినా, జనసేన ఎమ్మెల్యేలు సూచించిన వారికే ఇస్తున్నారన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

స్థానికంగా జరిగే పనులకు కాంట్రాక్టులను కూడా జనసేన ఎమ్మెల్యే చెప్పిన వారికే ఇస్తుంటే, ఇక మా త్యాగాలకు అర్ధం ఏముందంటున్నారు. నిజానికి జనసేన ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో టీడీపీ టికెట్లు ఆశించిన సీనియర్లు, పార్టీ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. చంద్రబాబు-లోకేష్ యాత్రలకు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. అయితే ఎన్నికల సమయంలో ఆ సీట్లు జనసేనకు వెళ్లడంతో నిరాశ పడ్డారు.

అయితే గెలిచిన తర్వాత మీకు ప్రాధాన్యం ఉంటుందని నాయకత్వం ఇచ్చిన హామీతో, వారంతా జనసేన గెలుపు కోసం పనిచేశారు. జనసేన ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత తమను పట్టించుకోకపోగా, అవమానాలకు గురిచేస్తున్న ఆవేదనను జిల్లా ఇన్చార్జి మంత్రులు గానీ, జోనల్ ఇన్చార్జిలు గానీ పట్టించుకోకపోతే ఇక ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నిస్తున్నారు.

‘మా బాధలు నాయకత్వానికి చెప్పినా ఫలితం లేదని తెలుసు. పొత్తులో ఉన్నందున మమ్మల్నే సర్దుకుపొమ్మంటారు. కానీ స్థానికంగా మాకు ఎదురయ్యే అవమానాలు అమరావతిలో ఉండే వాళ్లకు అర్ధం కాదు. పోనీ సమన్వయ కమిటీ అయినా ఈ సమస్యలు పరిష్కరిస్తుందా అంటే అదీ లేదు. ఇక మాకు దారేది’’ అని నియోజకవర్గ ఇన్చార్జిలు ప్రశ్నిస్తున్నారు.

ఇక పవన్‌కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో అయితే, నియోజకవర్గ ఇన్చార్జి వర్మ పరిస్థితి దారుణం. పవన్ వచ్చినప్పుడు మాత్రం ఆయనకు ఆహ్వానాలు అందుతున్నాయి. ఆ తర్వాత జరిగే ఎలాంటి కార్యక్రమాల్లోనూ ఆయనకు, పార్టీ నేతలకూ ఎలాంటి పిలుపులేదంటున్నారు.పైగా తరచూ వర్మను అవమానిస్తున్నారన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది. పవన్ కల్యాణ్ సైతం తన గెలుపునకు వర్మే కారణమని నిండు సభలో చెప్పినప్పటికీ.. ఆయనకు ఇప్పటిదాకా ఎలాంటి నామినేటెడ్ పదవి ఇవ్వకపోవడంపై తమ్ముళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

‘‘పవన్ డిప్యూటీ సీఎంగా ఉన్నందున, వర్మకు మరో నాలుగేళ్లు ఎలాంటి పదవి వచ్చే అవకాశం లేదు. ఆయనకు పదవి ఇవ్వడం ద్వారా పవన్‌కు ఆగ్రహం కలిగించే పని మా పార్టీ కూడా చేయదు. ఎందుకంటే వర్మకు పదవి ఇస్తే అక్కడ మరో పవర్‌సెంటర్ తయారయి, కొత్త తలనొప్పి ఎదురవుతుందని మా నాయకత్వానికి బాగా తె లుసు. కాబట్టి వర్మ ఇలా నాలుగేళ్లు ఓర్పుతో సర్దుకుపోవాల్సిందే’’నని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

కాగా మంత్రి నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్యేగా ఉన్న తెనాలిలో, మొన్నటివరకూ టీడీపీ నేతలకు ఎలాంటి గౌరవం లేదు. టీడీపీ కార్యకర్తలకు తిరుపతి లెటర్లు ఇచ్చే దిక్కులేదు. పోలీసులు కూడా మాట వినే పరిస్థితి లేదు. కానీ ఆలపాటి రాజా ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాతనే, తమకు మళ్లీ గౌరవం-గుర్తింపు లభించిందని కార్యకర్తలు చెబుతున్నారు.

ఇక మండలి బుద్దప్రసాద్, కామినేని శ్రీనివాసరావు నియోజకవర్గంలో మాత్రం టీడీపీ-జనసేన సమన్వయం బాగానే ఉందంటున్నారు. తిరుపతి, తాడేపల్లిగూడెం, పిఠాపురం, వైజాగ్ సౌత్, అనకాపల్లి, యలమంచిలి, కాకినాడ రూరల్, పెందుర్తి వంటి నియోజకవర్గాల్లో మాత్రం.. తమకు కించిత్తు గౌరవం దక్కలేదని తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒంగోలులో మాస్ లీడర్ అయిన మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరిన తర్వాత, అక్కడ పార్టీ కార్యకలాపాలు పెరిగాయి. వైసీపీ కార్పొరేటర్లు, నేతలు జనసేనలో చేరుతున్నారు. అయితే బాలినేని దూకుడును, టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సహించలేకపోతున్నారు.
ఓ దశలో ఆయన బాలినేనిపై బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు జనసేన-టీడీపీ మధ్య వివాదం రాజేశాయి.బలిజ సామాజికవర్గం ఏకతాటిపైకి వచ్చి జనార్దన్ వ్యాఖ్యలను ఖండించింది. అయినా ఇప్పటివరకూ అక్కడ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయకపోవడమే ఆశ్చర్యం.

మునిసిపాలిటీ, మండల స్థాయిలో పనులకు సంబంధించిన కాంట్రాక్టులు ఇవ్వకపోవడం.. స్థానిక అధికారులకు టీడీపీ నేతలు చెప్పే పనులు చేయవద్దని జనసేన ఎమ్మెల్యేలు ఆదేశించడం.. ప్రభుత్వ కార్యక్రమాలకు తమను ఆహ్వానించడం వంటి వ్యవహారాలే తమ్ముళ్ల ఆగ్రహానికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. దీన్నిబట్టి జోనల్ ఇన్చార్జిల వ్యవస్థ ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదని స్పష్టమవుతోందని పార్టీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

LEAVE A RESPONSE