Suryaa.co.in

Editorial

టీడీపీ… ఒం‘గోలు’ కొడుతుందా?

– జనసంద్రంతో భవిష్యత్ సంకేతాలు స్పష్టం
– తప్పులు దిద్దుకుంటేనే అధికారం
– కులముద్రకు చెక్ పెడితే భవిష్యత్తు
– లోకేష్‌పై చెరుగుతున్న ‘ముద్ర’
– ఆత్మవిమర్శ బదులు మితిమీరిన ఆత్మవిశ్వాసం
– పోరాటతత్వం పెరిగితేనే మనుగడ
– జగన్‌పై వ్యతిరేకతను సొమ్ము చేసుకుంటేనే ‘ఫలితం’
( మార్తి సుబ్రహ్మణ్యం)

జనసంద్రమైన ఒంగోలును చూసిన తర్వాత.. తెలుగు తమ్ముళ్లలో పెరిగిన పట్టుదల , కసితో కూడిన ఆత్మస్థైర్యం చూసిన తర్వాత.. అధికార పార్టీ ఎన్ని అవాంతరాలు కల్పించినా ఆగని జనప్రవాహం చూసిన తర్వాత.. ఎడ్లబండ్లు, స్కూటీలు, పాదయాత్రలే వాహనాలై కదలి వేదిక వద్దకు చేరిన తర్వాత..  వేదికమీద ఉన్న నేతలన్నకే,  తమ్ముళ్లు మేమున్నామంటూ బోలెడు భరోసా ఇచ్చిన తర్వాత.. రాష్ట్రంలో ఏదో
ntr3 మార్పునకు అది సంకేతమని స్పష్టమయిన తర్వాత…కమ్మపార్టీగా పేరున్న పార్టీ మహానాడుకు, అన్ని కులాలు క్యూలు కట్టిన తర్వాత..  ఇప్పుడు మహా ‘నాయుడు’ ఏం చేయబోతున్నారు? ఏం చేసి ఆ సమరోత్సాహాన్ని కొనసాగించబోతున్నారు? ఆ జనసంద్రం సంకేతాన్ని మహానాయుడు ఏం అర్ధం

చేసుకున్నారు? అక్కడికి వచ్చిన వారి పట్టుదలను ఆయన ఏ కోణంలో చూస్తున్నారు? వారి ఆలోచనల ప్రకారం అడుగులేస్తారా? లేక యధావిధిగా తన పాత అలవాటు ప్రకారం,  తన అడుగులోనే వారిని అడుగులేయమని చెబుతారా?..
– ఇదీ.. ఒంగోలు మహానాడు విజయవంతం తర్వాత తెలుగు తమ్ముళ్ల మదిలో మెదులుతున్న ప్రశ్నలు.

రెండున్నరేళ్లు ఆక్సిజన్‌తో బతికిన తెలుగుదేశం పార్టీని వైకాపా అధినేత, ఏపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు, జనరల్ వార్డుకు తీసుకువచ్చిందనేది నిష్ఠుర నిజం. పార్టీ ఆఫీసుపై అనాగరిక దాడితో టీడీపీకి జవసత్వాలు అందించిన అదే వైసీపీ.. ఇప్పుడు ఒంగోలు మహానాడుతో మళ్లీ తనతో పూర్తి స్థాయిలో పోటీపడేంత స్థాయికి తీసుకురావడంలో,  వైసీపీ వ్యూహబృందం విజయవంతం అయింది.

నిజానికి ఈ ‘మహా’నందం టీడీపీది కాదు. అది అందించిన వైసీపీది. అందుకే టీడీపీ,  అధికార వైసీపీ సర్కారుకు కృతజ్ఞతలు చెప్పి తీరాల్సిందే. ఒక స్టేడియంలో నిర్వహించుకుని, మమ అనిపించుకోవలసిన మహానాడును… 150 ఎకరాల విశాల మైదానంలో నిర్వహించుకుని, లక్షలమందిని వచ్చేలా చేసిన ఘనత నిస్సందేహంగా వైసీపీ వ్యూహకర్తలదేనన్నది మనం మనుషులం అన్నంత నిజం.

సరే..ఒంగోలు మహానాడు సూపర్ డూపర్ హిట్టయింది. రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు చెప్పినట్లు.. ఆ ఒం‘గోలు’ను టీడీపీ కొడుతుందా? ఆమేరకు ఆ పార్టీ దగ్గర సరిపడా ముడిసరుకు సిద్ధంగా

ఉందా? ప్రజల్లో జగన్ ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకతను ఓటుగా మార్చుకునే నేర్పు ఉందా? లేక జగన్ సర్కారుపై ఉన్న వ్యతిరేకతే తనకు ఓట్లు కురిపిస్తాయన్న పిచ్చిభ్రమలో ఉందా? లేక  మునుపటి మాదిరిగానే..  ఇంకా ఎన్నికలు రాకముందే అధికారంలోకి వచ్చినట్లుగా, మంత్రుల శాఖలు కూడా పంచేసుకునేంత భ్రమల ప్రపంచంలోనే జీవిస్తోందా?

అసలు పార్టీ నాయకత్వం తిన్న ఎదురుదెబ్బల ఫలితంగా..  కాళ్లు భూమ్మీద పెట్టి, వాస్తవంలో  జీవిస్తోందా? లేక మునుపటి మాదిరిగానే తాను భ్రమల ప్రపంచంలో జీవిస్తూ, క్యాడర్‌ను కూడా తన వేలు

పట్టుకుని వారినీ తనతోపాటు భ్రమలో విహరింపచేస్తోందా? ప్రధానంగా.. ఎన్టీఆర్ నాటి ఆత్మీయ వాతావరణం పునరుద్ధరింపచేసి, కార్పొరేట్ కల్చర్‌కు పాతరేసే ప్రయత్నాలేమైనా చేస్తోందా అన్న అంశాలపైనే,  టీడీపీకి మళ్లీ అధికారం ఆధారపడి ఉందనేది పార్టీ శ్రేణుల ఉవాచ.

నిజానికి మూడేళ్ల క్రితం పార్టీ ఘోర ఓటమి తర్వాత ఇప్పటికీ పార్టీని కాసింది కార్యకర్తలే తప్ప.. పదవులు అనుభవించిన మంత్రులు, ఎమ్మెల్యేలు కాదన్నది నిష్ఠుర నిజం. వ్యాపార ప్రయోజనాలు, వైసీపీ సర్కారుతో భయం లాంటి స్వార్థంతో వారంతా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై పారిపోతే, వీధుల్లో నిలబడి పోరాడింది కార్యకర్తలే. స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోలేక పెద్ద నేతలంతా అస్త్రసన్యాసం చేస్తే, సత్తా ఉన్న చోట పోటీ పడింది కార్యకర్తలే. టీడీపీ ఉనికికి వారే కారణం. నిజానికి పార్టీ ఆఫీసుపై వైసీపేయుల దాడికి ముందు కూడా,  ప్రజల్లో సర్కారుపై వ్యతిరేకత ఉంది. అయినా ముందుండి పోరాడే నేతలే కరువు.

ఆఫీసుపై దాడి తర్వాత   కలుగులో దాక్కున్న పార్టీని, రోడ్డుమీదకు తెచ్చిన ఘనత కూడా వైసీపీ పాలకులదే. బహుశా ఆ దాడి జరగకపోయి ఉంటే, ఇప్పటికీ టీడీపీది అయోమయ-అగమ్యగోచర  ప్రస్థానమే అయి ఉండేది. అందుకే టీడీపీ,  అధికార  పార్టీకి రుణపడి ఉండాలి. ఇప్పుడు మహానాడుకు ఆటంకాలు సృష్టించి, చివరకు కార్లలో గాలి కూడా తీసేంత చిల్లరపనులకు పాల్పడి. తద్వారా లక్షలాది మందితో అది  ‘మహదానందనాడు’ అయ్యేలా టీడీపీని ‘ప్రోత్సహించిన’ వైసీపీ పాలకుల మెడలో,   తెదేపా నాయకత్వం నిలువెత్తు దండ వేయాల్సిందే.

అసలు ఇంతకూ మహానాడు మహా సక్సెస్ తర్వాత,  టీడీపీ నాయకత్వం ఏం నేర్చుకుంది అన్నది పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. ఇప్పటిక వరకూ అయితే కమ్మ సామాజికవర్గంలో కసి కన్పిస్తోంది. విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వచ్చిన వారి ముచ్చటను అంతా చూశారు. గత ఎన్నికల్లో కొన్ని
maha-babu నియోజకవర్గాల్లో కమ్మ వర్గం,  స్థానిక వర్గ రాజకీయాల వల్ల వైసీపీకి జై కొట్టింది. ఇప్పుడు వారిలో మళ్లీ టీడీపీని అధికారంలోకి తీసుకురావాలన్న కసి స్పష్టంగా కనిపిస్తోంది. ఇక బీసీలు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మాదిగలు కూడా భారీ సంఖ్యలోనే వచ్చినట్లు కనిపించింది. అయితే విచిత్రంగా నెల్లూరు, సీమతోపాటు గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా మెట్ట ప్రాంతం నుంచి రెడ్లు కూడా భారీ సంఖ్యలో తరలిరావడమే విశేషం. వచ్చిన వారి హాజరులో అనంతపురం జిల్లావాసులే ఎక్కువట.  అందుకే మహానాడు జనసంద్రంలో నేతల కంటే కార్యకర్తల పాత్రనే ఎక్కువ. అంచనాలకు మించి వచ్చిన జనం,  చంద్రబాబు అండ్ కోకు ఫుల్ ఆక్సిజన్ ఇచ్చినట్లు వారి మహదానందం చూస్తేనే అర్ధమవుతోంది.

అయితే అన్నగారితో అంతమయిన ఆత్మీయ వాతావరణ పునరుద్ధరణ ఇప్పుడు పార్టీలో  పెద్ద సమస్య. పార్టీ కార్యాలయంతోపాటు, పార్టీలో అలాంటి వాతావరణం లేకపోవడ ం వల్ల,  అంతా కృతకంగా మారిందన్నది నిజం. కార్యకర్తకు భరోసా ఇచ్చే వాతావరణం లేదు. చంద్రబాబు, లోకేష్ ఇప్పటికీ ‘అపాయింట్‌మెంట్ కల్చర్’ కొనసాగిస్తున్నారు. పార్టీకి-కార్యకర్తకు మధ్య ఈ అపాయింట్‌మెంట్ అడ్డుగోడలేమిటో ఎవరికీ తెలియదు.

ఇక పార్టీ ఆఫీసులో..  ఎలాంటి రాజకీయానుభవం లేని వారి చేతికి,  పెత్తనం ఇచ్చారన్నది మరో విమర్శ. గతంలో లోకేష్ వద్ద అంతా తానయి వ్యవహారం నడిపించి, ఎన్నికల ఫలితాల తర్వాత పత్తా లేకుండా పోయిన పెద్దిరామారావు అనే పూర్వ మార్క్సిస్టు మేధావి విడిచిన బాణం ‘గోదావరి జిల్లా గోపాలపురం రాజు’..  పార్టీ వ్యవస్థను వీలయినంత మేరకు విజయవంతంగా భ్రష్ఠుపట్టిస్తున్నారన్నది తెలుగుతమ్ముళ్ల ఆవేదన. నిజానికి ఆయన వేసిన మహానాడు కమిటీలన్నీ విఫలమయినా, జనం పోటెత్తడంవల్ల ఆ వైఫల్యం కనిపించకుండా చెరిగిపోయింది. లేకపోతే నాయకత్వం నగుబాటుపాలయ్యేది. పెద్దాయన- చిన్నాయన పేరు చెప్పి పార్టీ ఆఫీసులో సమాంతర ఆధిపత్యం చెలాయిస్తున్నారన్నది వారి ప్రధాన విమర్శ. పైగా ఆయన పెద్దాయనను ఖాతరు చేయకుండా, చిన్నాయన ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారన్న అపవాదు మరొకటి.

పార్టీలో జీతాలతో పనిచేసేవారికి పెత్తనం ఇస్తున్న సంస్కృతికి,  ఇంకా తెరపడకపోవడమే అందరి సమస్య. కార్యకర్తలకు శిక్షణ వ్యవహారాలు చూసే వారి చేతికి పార్టీ ఆఫీసు పెత్తనం ఇవ్వడం ఏమిటో ఎవరికీ అర్ధం కావడం లేదట. ఇలాంటి వీళ్లంతా సీనియర్లకు ఫోన్లుచేసి,  మీరు ఫలానా విషయం మాట్లాడమని చెప్పడంతో సీనియర్లు నారాజవుతున్నారట. రాజకీయాల్లో ఉన్న వారికే ఆఫీసు బాధ్యతలు అప్పగించాలే తప్ప, జీతాలకు పనిచేసే వారికి అప్పగిస్తే ఫలితాలు ఇంతకుమించి ఎలా భిన్నంగా ఉంటాయి?

ఇక యువనేత లోకేష్ పనితీరుపై గతంలో పెదవి విరిచిన వారే, ఇప్పుడు ఆయనను మెచ్చుకోవడం పార్టీ వ్యవస్థలో వచ్చిన పెద్ద మార్పు. నిజానికి లోకేష్‌పై చాలాకాలం వరకూ ఎవరికీ భరోసా లేదు. బాబు తర్వాత చినబాబుకు పగ్గాలందుకునే స్థాయి లేదన్నది మొన్నటి వరకూ చాలామంది అభిప్రాయం.  సీనియర్ల
Nara-Lokesh ఫోన్లు కూడా తీయరని, అపాయింట్‌మెంట్లు ఇవ్వరన్నది ఆయనపై అప్పట్లో ఉన్న ప్రధాన విమర్శ. కొద్దికాలం నుంచీ ఆయన జనంలోకి వెళుతున్నందున, జనమే అన్నీ నేర్పుతున్నారు. ప్రధానంగా వివిధ ఘటనలపై వేగంగా స్పందించడంతోపాటు, అక్కడికి వెళ్లి కార్యకర్తలకు భరోసా ఇస్తున్న లోకేష్ తీరును,  పార్టీ క్యాడర్ మెచ్చుకుంటోంది. ఆయన స్పీడును చూసి గతంలో పెదవి విరిచిన వారే,  ఇప్పుడు బాగా పనిచేస్తున్నారని అభినందిస్తున్నారు.

కాకపోతే సీనియర్లను క్రమంగా పక్కకుతప్పించి, యువతను తీసుకువచ్చేందుకు లోకేష్ చేస్తున్న ప్రయత్నాలే కొంత విమర్శలకు దారితీస్తున్నాయి. నిస్సందేహంగా పార్టీకి యువత ప్రధానమే
ntr4 అయినప్పటికీ, సీనియర్లను విస్మరిస్తే ఏ పార్టీకయినా సమస్యలు తప్పవు. ఒకప్పుడు తప్పులతడక, హేళనగా మారి సోషల్‌మీడియాలో కామెడీకి పనిముట్టయిన లోకేష్ ప్రసంగాలు,  ఇప్పుడు తప్పుల్లేకుండా సూటిగా పదునుగా ఉంటున్నాయి. సర్కారును సవాల్ చేసేలా ఉంటున్నాయి. తండ్రిలా కాకుండా వెంటనే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది సహజంగా ఆ పార్టీ క్యాడర్ సంతోషించే అంశమే.   ప్రధానంగా వైసీపీ విపక్షంగా ఉన్నప్పుడు టీడీపీ సర్కారును అప్రతిష్ఠపాలు చేసేందుకు  ఎలాంటి వ్యూహం అనుసరించిందో, ఇప్పుడు లోకేష్ వేస్తున్న అడుగులు కూడా అలాగే కనిపిస్తున్నాయి. ఆయన అందివచ్చిన  ఏ అవకాశాన్నీ విడిచిపెట్టడం లేదు. సహజంగా ఇది అధికార పార్టీకి ఇబ్బంది కలిగిస్తోంది.

ఇక ఎటొచ్చీ బాబు వ్యవహారశైలి మార్పుపైనే పార్టీలో చర్చ. ఆయన ప్రసంగం తీరు మారినా, పాత వ్యవహారశైలి మారుతుందా అన్న చర్చ జరుగుతోంది. మూడేళ్ల వరకూ పత్తా లేకుండా పోయిన మాజీ
ntr7 మంత్రులు, మాజీ ఎమ్మల్యేలు తిరిగి నియోజకవర్గాలకు చేరుతున్నారు. చాలామంది నియోజకవర్గ ఇన్చార్జి పదవికి పోటీ పడుతున్నారు. అలాంటి అవకాశవాదుల స్థానంలో, మూడేళ్లు పార్టీని మోసిన కొత్త వారిని ప్రోత్సహించాలన్నది కార్యకర్తల వాదన. ఇక కొన్ని సందర్భాల్లో  అభ్యర్ధులను ఇప్పుడే ప్రకటిస్తున్న వైనం, ప్రతికూలవాస్తవంలో  ఫలితాలకు కారణమవుతోంది.

ప్రెస్‌మీట్లపై ఆధారపడకుండా, జనంలోకి వెళ్లే వారిని గుర్తించే ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. సత్తెనపల్లి వంటి కొన్ని నియోజకవర్గాలకు బాబు మొహమాటం వల్ల ఇన్చార్జిలను  నియమించని వైఫల్యాలు అధిగమించాల్సి ఉంది. పార్టీపై ఉన్న కమ్మ ముద్రను తొలగించి దాని స్థానంలో పూర్వ బీసీముద్రను ప్రతిష్ఠించాల్సిన అవసరం ఉంది. ఇక రెడ్లలో సర్కారుపై వ్యతిరేకత పెరుగుతున్న నేపధ్యంలో, పార్టీలో రెడ్లకూ ప్రాధాన్యం ఇవ్వడం మరో అవసరం. ఈ రెండింటినీ అమలుచేసి చూపడంపైనే పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుదన్నది సీనియర్ల ఉవాచ. వెంటనే నిర్ణయాలు తీసుకోకుండా, ఇంకా నాన్చుడు నిర్ణయాల వల్లే పార్టీ పురోగమించడం లేదన్న విమర్ళను చంద్రబాబు ఇప్పటికీ తెరదించకపోవడమే ఆశ్చర్యం.

LEAVE A RESPONSE