Home » మతం పిలిచింది

మతం పిలిచింది

– ఏపీ తెలంగాణలో ‘మైనారిటీ సందేశం’
– జగన్‌ను ఓడించాలని ఏపీలో చర్చిలో పిలుపు
– వైసీపీ-కూటమిని ఓడించాలని ఆదేశం
– కాంగ్రెస్‌ను గెలిపించాలని ఆదేశం
– వైసీపీ క్రైస్తవ ఓట్లకు గండి
– ఏపీలో చర్చిలో పిలుపునివ్వడం ఇదే తొలిసారి
– ఫాదర్లు, పాస్టర్లకు స్పష్టమైన ఆదేశాలు
– కీలకపాత్ర పోషించిన బ్రదర్ అనిల్?
– టీడీపీకి ఓటేయమని పిలుపునిచ్చిన ముస్లిం సంఘాలు
– బాబును కలిసిన జాతీయ ముస్లిం సంఘ నేతలు
– తెలంగాణలోనూ కాంగ్రెస్‌కు ఓటేయాలన్న చర్చిలు
– మసీదుల్లోనూ కాంగ్రెస్‌కు ఓటేయాలని ఆదేశం
– బీజేపీని ఓడించాలంటూ ముస్లిం సంఘాల పిలుపు
– ఏపీ-తెలంగాణలో చీలిన మైనారిటీ ఓట్లు
– తాజా ఆదేశాలతో నష్టపోయిన బీఆర్‌ఎస్

( మార్తి సుబ్రహ్మణ్యం)

తెలుగు రాష్ట్రాల ఓటర్లను మతం పిలిచింది. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటువేయాలని, ముస్లిం-క్రైస్తవ సంఘాలు రంగంలోకి దిగాయి. ఆర్‌ఎస్‌ఎస్, విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్ వంటి హిందూ సంస్థలు, ఎన్డీయే కూటమి కోసం ప్రచారం నిర్వహించగా.. ముస్లిం-క్రైస్తవ సంఘాలు బీజేపీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ కోసం పనిచేశాయి. ఫలితంగా తెలంగాణలో బీఆర్‌ఎస్-ఆంధ్రాలో వైసీపీ మైనారిటీ ఓటు బ్యాంకు భారీ గండి పడింది.

ఎన్నికల్లో మత సంఘాలు కీలకపాత్ర పోషించాయి. ఏపీలో తొలిసారి క్రైస్తవ సంఘాలు రంగంలోకి దిగడం ఆసక్తికరంగా మారింది. బీజేపీని సమర్ధిస్తున్న వైసీపీ-టీడీపీని ఓడించాలంటూ, జాతీయ స్థాయి క్రైస్తవ సంఘాలు ఏపీలో చర్చిలు వేదికగా ప్రచారం నిర్వహించాయి. అంతర్జాతీయ క్రైస్తవమత ప్రచార ప్రముఖుడు, ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి భర్త బ్రదర్ అనిల్ ఇందులో కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఆయనే కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది.

ఆ ప్రకారంగా దేశంలో మళ్లీ మోదీ అధికారంలోకి వస్తే క్రైస్తవులకు రక్షణ ఉండదంటూ పలువురు క్రైస్తవ ప్రముఖులు, ఆదివారం చర్చిలలో క్రైస్తవులకు పిలుపునిచ్చినట్లు సమాచారం. నిజానికి ఎన్నికలు సంబంధించి, ఎవరికి ఓటు వేయాలన్న ఆదేశం చర్చిలకు ఎప్పుడూ రాదు. ముస్లింలకు మాత్రమే ఇప్పటిదాకా వస్తోంది. అలాంటిది ఏపీలూ తొలిసారి చర్చిల్లో కూడా, కాంగ్రెస్‌కు ఓటు వేయాలన్న ఆదేశాలు రావడం విశేషం.

ఆ మేరకు వారు రాష్ట్రవ్యాప్తంగా పాస్టర్లు-ఫాదర్లకు బహుమతులు కూడా పంపినట్లు చెబుతున్నారు. కడప లోక్‌సభ పరిథిలోని ప్రతి చర్చిలోనూ, ఈ తరహా పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. ఏపీలో మతం మారిన దళిత క్రైస్తవుల సంఖ్య ఎక్కువ. వీరంతా గత ఎన్నికల్లో బ్రదర్ అనిల్ ఆదేశాల మేరకు.. జగన్ కోసం తీవ్రంగా కృషి చేసి, ఆయనను అధికారంలోకి తెచ్చిన విషయం బహిరంగమే. అయితే ఈసారి జగన్ బీజేపీకి మద్దతునిస్తున్న కారణంగా, వారంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపేందుకు క్రైస్తవ సంఘాల పిలుపు కారణమయింది. ఫలితంగా వైసీపీ క్రైస్తవ ఓటు బ్యాంకుకు, భారీ స్థాయిలో చిల్లుపడినట్లయింది.

విచిత్రంగా అదే సమయంలో ముస్లిం సంఘాలు మాత్రం, టీడీపీకి మద్దతు ప్రకటించడం చ ర్చనీయాంశమయింది. గత ఎన్నికల్లో వైసీపీకి దన్నుగా నిలిచిన ముస్లిం వర్గం ఈసారి, టీడీపీకి ఓటు వేయాలని నిర్ణయించుకోవడానికి ముస్లిం సంఘాల ఆదేశాలు కారణమయింది. శుక్రవారం నాటి ప్రార్ధనల్లో ముస్లిం మత పెద్దలు, ఆమేరకు టీడీపీకి ఓటు వేయాలని ఆదేశించినట్లు చెబుతున్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉండి, బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ.. ముస్లిం సంక్షేమం కొనసాగిన వైనాన్ని ముస్లిం మత పెద్దలు గుర్తు చేశారు. విజయవాడ వెస్ట్ వంటి నియోజకవర్గాల్లో సైతం ముస్లింలు బీజేపీకి పనిచేయడం ఈసారి కనిపించిన భిన్నమైన దృశ్యం.

కాగా పోలింగుకు కొద్దిరోజులు ముందే ఢిల్లీ నుంచి వచ్చిన ముస్లిం జాతీయ సంస్ధల ప్రతినిధులు.. టీడీపీ అధినేత చంద్రబాబును కలసి, తమ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనితో ైవె సీపీ ముస్లిం ఓటు బ్యాంకు గండిపడినట్లయిందని, రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఇక తెలంగాణలో కూడా ముస్లిం మత పెద్దలు.. శుక్రవారం నాటి ప్రార్ధనల సమయంలో, బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌కు ఓటు వేయాలని పిలుపునివ్వడం గమనార్హం. మోదీ మళ్లీ ప్రధాని అయితే ముస్లిం హక్కులకు రక్షణ ఉండని మత పెద్దలు స్పష్టం చేశారు. అదేవిధంగా చర్చిలలో సైతం, క్రైస్తవ మత పెద్దలు కాంగ్రెస్‌కు ఓటు వేయమని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా క్రైస్తవులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో, దానిని అరికట్టాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాల్సిన అవసరం ఉందని బలంగా నొక్కి చెప్పడం విశేషం. అటు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సైతం.. ఈసారి ముస్లింలు కాంగ్రెస్‌కు ఓటు వేయాలని, బహిరంగంగానే చెప్పడం ప్రస్తావనార్హం. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు మద్దతుగా పనిచేసిన మజ్లిస్.. ఈసారి కాంగ్రెస్‌కు పనిచేయడం విశేషం.

ఎంపిపెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లు.. ఈ పరిణామాలతో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ మైనారిటీ ఓటు బ్యాంకు, భారీ స్థాయిలో గండిపడింది. గత ఎన్నికల వరకూ తెలంగాణలో పాతబస్తీ మినహా, అన్ని నియోజకవర్గాల్లోనూ ముస్లిం-క్రైస్తవులు బీఆర్‌ఎస్‌కే ఓటు వేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిథిలోని ముస్లిం-క్రైస్తవులు గంపగుత్తగా బీఆర్‌ఎస్‌కు ఓటు వేసిన ఫలితంగా, ఆ పార్టీ గ్రేటర్‌లో అత్యధిక స్థానాలు సాధించింది.

ఇప్పుడు ఒక్క సికింద్రాబాద్ పార్లమెంటు పరిథిలోనే ముస్లిం-క్రైస్తవుల ఓట్లు నాలుగులక్షల వరకూ ఉన్న నేపథ్యంలో, వారంతా కాంగ్రెస్‌కే జైకొట్టారు. దీన్నిబట్టి మైనారిటీ ఓటు బ్యాంకు, ఫలితాల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని స్పష్టమవుతోంది. ఏదేమైనా మత సంస్థల పిలుపు పుణ్యాన.. అటు ఏపీలో వైసీపీ, ఇటు తెలంగాణలో బీఆర్‌ఎస్ మైనారిటీ ఓటు బ్యాంకుకు భారీగా చిల్లుపడినట్లు కనిపిస్తోంది.

 

Leave a Reply