అమరావతి రైతుల మహా పాదయాత్రకు మద్దతుగా టీడీపీ ఆధ్వర్యంలో జోన్-2 జోన్-3 , జోన్-4, జోన్-5 లలో సంఘీభావ ర్యాలీలు నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వేలాదిగా ప్రజలు పాల్గొన్నారు. జై అమరావతి.. ఒకటే రాజధాని.. అమరావతే రాజధాని అంటూ టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. మరోవైపు కొన్ని నియోజకవర్గాలలో పోలీసులు ర్యాలీలను అడ్డుకుని టీడీపీ నాయకులను నిర్భంధించారు.
దీంతో టీడీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ర్యాలీలకు అనుమతి లేదంటు అడుగడుగునా పోలీసులు అడ్డంకులు సృష్టించారు. రాష్ట్రానికి అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలంటూ రైతులు చేపట్టిన న్యాయస్థానం-దేవస్థానం మహాపాదయాత్రకు అన్ని జిల్లాల నుంచి ప్రజా మద్దతు వెల్లువలా వచ్చింది.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం తాడితోట జంక్షన్ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో ప్రదర్శనా ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రానికి అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, కాంగ్రెస్, వామపక్ష నాయకులు పాల్గొన్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలో అమరావతి రైతులకు మద్దతుగా టీడీపీ చేపట్టిన సంఘీభావ ర్యాలీలకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల టీడీపీ నాయకులను నిర్బంధించారు. తెదేపా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ఆధ్వర్యంలో జరగాల్సిన బైక్ ర్యాలీనీ జరగకుండా అక్రమ అరెస్ట్ లు చేస్తూ అడుగడుగునా పోలీసులు అడ్డుకున్నారు. బైక్ ర్యాలీకి అనుమతి లేదంటూ జంగారెడ్డిగూడెంలో టీడీపీ నాయకులను అక్రమంగా నిర్బంధించారు. చింతలపూడిలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. పోలీసుల ఆటంకాల మధ్య మాజీ మంత్రి జవహర్, ఏలూరు పార్లమెంట్ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, చింతమనేని ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ, సంఘీభావ ర్యాలీలను నిర్వహించారు.
కృష్ణా జిల్లా విజయవాడలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహాన్ ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గ నుంచి సర్కిల్ 3 కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్దఎత్తున టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. గుడివాడలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. గన్నవరంలో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ ర్యాలీలో వామపక్ష పార్టీలు, రైతు సంఘాలు పాల్గొన్నాయి. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అమరావతి జేఏసీ తరఫున పాదయాత్రకు సంఘీభావంగా పెనమలూరు నియోజకవర్గం పోరంకిలో వామపక్ష పార్టీలు, అమరావతి జేఏసీ సభ్యులు తో కలిసి టీడీపీ సంఘీభావ పాదయాత్ర నిర్వహించడం జరిగింది.
అనంతపురంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలో 5 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ర్యాలీలో పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమరావతి రైతులు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని పేరిట చేస్తున్న మహా పాదయాత్రకు మద్దతుగా ధర్మవరం పట్టణంలోని తెదేపా నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పెద్దఎత్తున టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. శింగనమల మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎమ్మెస్ రాజు ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇంఛార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భవన్ నుంచి వందలాది మంది కార్యకర్తలతో అమరావతి రైతులకు మద్దతుగా ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు.
కడపలో అమరావతి రైతులకు మద్దతుగా నియోజకవర్గ ఇంచార్జి అమీర్ బాబు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు గోవర్ధన్ రెడ్డి, బాలిశెట్టి హరిప్రసాద్, రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, మాజీ జడ్పి వైస్ చైర్మన్ లక్ష్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బనగానపల్లె నియోజకవర్గంలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి పెట్రోల్ బంక్ కూడలి వరకు శ్రేణులు ర్యాలీ నిర్వహించారు.గుంటూరు జిల్లా వినుకొండలో అమరావతి రైతుల మహా పాదయాత్రకు టీడీపీ శ్రేణులు సంఘీభావం తెలిపారు.