– దావోస్ లో రికార్డు స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించాం
– కొత్త క్లీన్ అండ్ గ్రీన్ పవర్, MSME పాలసీలకు అద్భుతమైన స్పందన
– యూరోపియన్ యూనియన్ దేశాలు భారత్ రాష్ట్రాలతో నేరుగా పనిచేయవచ్చు
– తెలంగాణలో వ్యాపార అనుకూల విధానాలు
– యూరోపియన్ యూనియన్ అధ్యక్షుడు ఉర్సుల ఓన్ డెర్ లీఎన్ బృందానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు విజ్ఞప్తి
పెట్టుబడులకు యువ రాష్ట్రమైన తెలంగాణ స్వర్గధామం లాంటిదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.యూరోపియన్ యూనియన్ అధ్యక్షుడు ఉర్సుల ఓన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో కాన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విందు సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రతినిధిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హాజరై భారతదేశ వాణిజ్య అభివృద్ధిలో తెలంగాణ పాత్రను, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను అతిథులకు వివరించారు. సమావేశములో యూరోపియన్ యూనియన్ కమిషన్ సభ్యులు, యూరప్ దేశాల రాయబారులు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో వ్యాపార అనుకూల విధానాలు రూపొందించడం, క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో విశేష ప్రతిభ కనబరుస్తూ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందంజలో ఉందని విందు సమావేశానికి హాజరైన యూరోపియన్ యూనియన్ ప్రతినిధి బృందానికి వివరించారు.
పాలకులు మారడం సాధారణం, కానీ కొన్నిసార్లు కేవలం మార్పు కోసమే పాత విధానాలు రద్దు చేస్తారు. అయితే తెలంగాణలో పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉందని తెలిపారు. గత రెండు, మూడు దశాబ్దాలుగా ఒక ప్రభుత్వం తర్వాత మరో ప్రభుత్వం వచ్చినప్పటికీ,రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే విధానాలు కొనసాగించబడుతున్నాయి అన్నారు.
గత సంవత్సరం క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ గత సర్కారు అమలు చేసిన మంచి విధానాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా కొన్ని కీలకమైన పాలసీల్లో లోటును గుర్తించి అభివృద్ధికి అనుకూలమైన కొత్త విధానాలను అమలు చేస్తున్నాం అన్నారు.
ఇందుకు ఉదాహరణగా చూస్తే.. గ్రీన్ ఎనర్జీ పై ఒక క్లీన్ అండ్ గ్రీన్ పాలసీని ప్రారంభించాము. గత ప్రభుత్వం ఇలాంటి విధానాన్ని రూపొందించలేదు, అయితే ప్రపంచం మొత్తం గ్రీన్ పవర్ వైపు అడుగులు వేస్తూ ఉండడంతో మేము సమగ్ర గ్రీన్ ఎనర్జీ పాలసీని రూపొందించాం. ఈ విధానానికి పరిశ్రమలు, డేటా సెంటర్లు, వినియోగదారుల నుంచి విశేష ప్రశంసలు అందాయి అని వివరించారు.
మరో ప్రధాన అంశం MSME (సూక్ష్మ, చిన్న, మధ్యతరః) పై కొత్త పాలసీని రూపొందించాము. గత ప్రభుత్వంలో ఒక సాధారణ పారిశ్రామిక విధానం ఉండేది, అది పెద్ద కంపెనీలకు మేలు చేసే విధంగా ఉండేది. కానీ MSME లు పరిశ్రమల అభివృద్ధికి, పెద్ద సంఖ్యలో ఉపాధికి వెన్నుముక వంటివి అని మేము భావించాం. అందుకే అనేక రకాల ప్రోత్సాహాలతో కూడిన కొత్త MSME పాలసీని తీసుకొచ్చినట్టు తెలిపారు.
తెలంగాణలో “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. పరిశ్రమలకు అవసరమైన నీరు, విద్యుత్తు, పారిశుద్ధ్య వ్యవస్థ, రవాణా వంటి నాణ్యమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం రూపొందిస్తున్న పాలసీలకు పెట్టుబడిదారుల నుంచి విశేష మద్దతు, విశ్వాసానికి దావత్ లో కుదిరిన వ్యాపార ఒప్పందాలు నిదర్శనం అన్నారు.
భారత దేశంలోనే మొదటిసారి యువతకు ప్రత్యేకంగా నైపుణ్య శిక్షణ అందించేందుకు “యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ”ని స్థాపించాం అన్నారు. యూనివర్సిటీలో ప్రతి కోర్సును పరిశ్రమల భాగస్వామ్యంతో రూపొందించాం, వాళ్లే పాఠాలు బోధిస్తారు, ఇది మా స్కిల్ యూనివర్సిటీ ప్రత్యేకత అని తెలిపారు.
భారత్ ఒక విభిన్న దేశం, ఈ దేశంలోని ప్రతి రాష్ట్రం ప్రత్యేకమైన పాలసీలు, పాలన, ప్రాధాన్యతలు ఉంటాయని దేశ సమాఖ్య నిర్మాణం ఇందుకు అనుకూలంగా ఉందని తెలిపారు. యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు మీ వ్యాపార, వాణిజ్య ప్రయోజనాలను అభివృద్ధి చేసుకునేందుకు భారతదేశంలోని రాష్ట్రాలతో నేరుగా పని చేసుకునే సౌలభ్యం ఉందని వివరించారు.
తెలంగాణ రాష్ట్రాన్ని సందర్శించాల్సిందిగా యూరోపియన్ యూనియన్ అధ్యక్షుడు ఉర్సుల ను కోరుతున్నాను. యూరోపియన్ యూనియన్ దేశాలకు చెందిన పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వర్గాలకు తెలంగాణను పరిచయం చేయడానికి యూరోపియన్ యూనియన్ అధ్యక్షుని సహకారం ఎంతైనా అవసరం ఉందని తెలిపారు. సమావేశంలో CII ప్రెసిడెంట్ సంజీవ్ పురి, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.