Suryaa.co.in

Telangana

తెలంగాణ అస్థిత్వతం పెట్టుకుంటే రాజకీయ సమాధే

– తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించటంపై కేటీఆర్ ఆగ్రహం
– కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలకు నిరసనగా తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలభిషేకాలకు పిలుపు
– బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సకల మర్యాదలతో రాజీవ్ గాంధీ విగ్రహం గాంధీ భవన్ కు తరలిస్తాం
– ఢిల్లీ పెద్దల మెప్పుకోసమే రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి ఆత్మను తాకట్టు పెట్టాడు

హైదరాబాద్: రాష్ట్ర సచివాలయం, తెలంగాణ అమర జ్యోతి మధ్యలో ఉండాల్సిన తెలంగాణ తల్లి విగ్రహాం స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టటంపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ అస్తిత్వాన్ని తాకట్టు పెట్టే సిగ్గుమాలిన చర్య అంటూ మండిపడ్డారు.

కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి చర్యకు నిరసనగా మంగళవారం రోజున రాష్ట్రంలోని అన్ని తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలభిషేకాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ తల్లిని అవమానించేలా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చర్యను ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులతో సహా తెలంగాణ వాదులంతా వ్యతిరేకిస్తూ నిరసన తెలపాలని కోరారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టుకోవాలనుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని…కానీ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయటాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. తెలంగాణ సచివాలయం, అమర జ్యోతి మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని కేసీఆర్ 2023 జులైలోనే ఈ స్థలాన్ని ఎంపిక చేశారని కేటీఆర్ గుర్తు చేశారు.

కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కుసంస్కారంతో తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి విగ్రహాన్ని ఆ స్థలంలో ఏర్పాటు చేసిందన్నారు. కాంగ్రెస్ చర్య ప్రతి తెలంగాణ వ్యక్తి మనసును గాయపర్చేలా ఉందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ తల్లి విగ్రహం కోసం కేటాయించిన ఆ స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. సకల మర్యాదలతో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీ భవన్ కు తరలిస్తామని తేల్చి చెప్పారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఢిల్లీకి బానిసత్వం చేస్తారని తాము ముందునుంచే చెప్పామని కేటీఆర్ గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి సరిగ్గా ఇప్పుడు అదే పనిచేస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. తెలంగాణ అస్తితత్వంతో పెట్టుకున్న వాళ్లెవరు రాజకీయంగా బతికి బట్టకట్టలేదని ఈ సందర్భంగా కేటీఆర్ హెచ్చరించారు. ప్రాంతం వాడే మన అస్తిత్వతాన్ని దెబ్బ తీస్తుంటే కచ్చితంగా తెలంగాణ ప్రజలు వారికి రాజకీయంగా సమాధి తవ్వటం ఖాయమని చెప్పారు.

LEAVE A RESPONSE