– నిత్యావసర సరుకుల ధరల తగ్గింపు కోసం రేపు టీడీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలు
– ప్రభుత్వ వైఫల్యాలకు సమాధానం చెప్పలేక డిఫెన్స్ లో వైసీపీ
– పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబునాయుడు
రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడం ప్రజలకు తీవ్ర భారంగా పరిణమించిందని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అన్నారు. అదే విధంగా మైనింగ్ దోపిడీపై పూర్తి స్థాయి పోరాటానికి సిద్ధమవ్వాలని, మంత్రి పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే రాష్ట్రంలో మైనింగ్ దోపీడీ జరుగుతోందని, తక్షణమే పెద్దిరెడ్డి భర్తరఫ్ చేయాలన్నారు. మైనింగ్, మద్యం, శాండ్, ల్యాండ్, డ్రగ్స్ మాఫియా ద్వారా ఇప్పటికే వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారని ధ్వజమెత్తారు.
పీఆర్సీని పునసమీక్షించాలని.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. రాజధానిలో 29 గ్రామాలు లేకుండా కార్పోరేషన్ ఏర్పాటుచేయడాన్ని తప్పుబట్టారు. వినుకొండలో మద్దతు ధర అడిగిన రైతుపై అక్రమ కేసు పెట్టి రైతుల పండుగ సంక్రాంతి సమయంలోనే జైలుకు పంపడం రైతు వర్గానికే అవమానమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు డిఫెన్స్ లో పడిపోయారని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలకు సమాధానం చెప్పలేక గ్రామస్థాయిలో కేడర్, రాష్ట్రస్థాయిలో లీడర్ ఇబ్బంది పడుతున్నారని నేతలు వివరించారు.
స్ట్రాటజీ మీటింగ్ లో చర్చకు వచ్చిన అంశాలు- నిర్ణయాలు
ఇప్పటికే కరెంట్ బిల్లులు, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరల పెంపుతో సామాన్యుపై పెనుభారం పడింది. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పేద ప్రజలు సంక్రాంతి పండుగను జరుపుకోలేని పరిస్థితి. ధరల నియంత్రణలో జగన్ రెడ్డి దారుణంగా విఫలమయ్యారు. చంద్రబాబుపాలనలో ఇచ్చిన సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుకలను రద్దు చేశారు. తక్షణమే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గేలా చర్యలు తీసుకోవాలి. నిత్యావసర ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఈ నెల 11వ తేదీన నియోజవర్గ కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సమావేశంలో నేతలు నిర్ణయించారు.
జగన్ రెడ్డి అండతో రాష్ట్రంలో ల్యాండ్, సాండ్, వైన్, మైనింగ్, డ్రగ్ మాఫియా రెచ్చిపోతోంది. అక్రమ మైనింగ్ తో ప్రకృతి సంపదనను కొల్లగొడుతూ వేలకోట్లు లూటీ చేస్తున్నారు. కుప్పంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇతర వైసీపీ నేతల అక్రమ మైనింగ్ ఇందుకు నిదర్శనం. ఈ గ్రానైట్ అక్రమ డబ్బులతోనే స్థానిక ఎన్నికల్లో విచ్చలవిడిగా ప్రవర్తించారు. మైనింగ్ మాఫియా డాన్ గా పెద్దిరెడ్డి వ్యవహరిస్తున్నారు. ద్రావిడ వర్సిటీలో 150 ఎకరాల్లో అక్రమ మైనింగ్ జరుగుతోంటే అధికారులు ఏం చేస్తున్నారు? ఇసుక తరలింపు విషయంలో కూడా పెద్దఎత్తున లూటీ జరుగుతోంది. భూకబ్జాలు పెరిగిపోయాయి.
సామాన్యుల ఆస్తులకు రక్షణ లేని పరిస్థితి. నాసిరకం మద్యంతో ఐదేళ్లలో జగన్ రెడ్డి రూ.25 వేల కోట్ల భారీ స్కాం కు పాల్పడుతున్నారు. ఉపాధి నిధులను దారిమళ్లిస్తున్నారు. ఇదో పెద్ద స్కామ్. గనుల దోపిడీ పై తగిన ఆధారాలతో జగన్ రెడ్డి మోసాన్ని ప్రజల్లో ఎండగట్టాలని సమావేశంలో నేతలు తీర్మానించారు. గనుల దోపిడీపై అఖిలపక్షం ఆధ్వర్యంలో కమిటీ వేసి, దోషులను శిక్షించాలి. తక్షణమే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని బర్తరఫ్ చేయాలని సమావేశం డిమాండ్ చేసింది.
గుంటూరు జిల్లా వినుకొండలో మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలని, బకాయిలు సకాలంలో చెల్లించాలని కోరిన రైతుపై వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చెప్పుతో దాడికి యత్నించడం రైతులందరికీ జరిగిన అవమానం. ధాన్యం బకాయిలు అడిగితే చెప్పుతో కొడతారా? ప్రశ్నించిన రైతుపై అక్రమ కేసు నమోదు చేసి జైలుకు పంపడం దుర్మార్గం. చిత్తూరు జిల్లాలోనూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ అరాచకాన్ని ప్రశ్నించిన వైసీపీ జడ్పీటీసీ భర్త మద్దిరెడ్డి కొండ్రెడ్డిపైనా అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. నంద్యాలలో మైనారిటీ విద్యాసంస్థను సీజ్ చేశారు. జగన్ రెడ్డి విధ్వంస, కక్షసాధింపు ధోరణిని ప్రతి ఒక్కరు నిరసించాలి.
పంచాయతీలలో జగన్ రెడ్డి విపరీతమైన పన్నుల భారాన్ని మోపారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సమావేశంలో నేతలు డిమాండ్ చేశారు.ప్రజా రాజధాని అమరావతిని విడదీసేందుకు జగన్ రెడ్డి కుట్రపన్నారు. సీఆర్డీయే చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో 19 గ్రామాలను కార్పోరేషన్ గా మార్చాలన్న ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి. 29 గ్రామాలను కలిపి ఉంచాలి.
ప్రత్యేక హోదా, ఇతర విభజన హామీల సాధనలో జగన్ రెడ్డి విఫలమయ్యారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని ప్రగల్బాలు పలికారు. కేసుల మాఫీ కోసం విభజన చట్టం హక్కుల్ని, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారు. కేంద్రం మెడలు వంచుతామని చెప్పి.. మెడ దించారు. హోదా కోసం టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలని ప్రతిపక్షంలో ఉండగా డిమాండ్ చేసిన జగన్ రెడ్డి.. నేడు ఎందుకు వైసీపీ ఎంపీలతో రాజీనామా చేయించడం లేదు? హోదా, విభజన హామీల అమలు కోసం వైకాపా ఎంపీలు రాజీనామా చేస్తే.. టీడీపీ కూడా కలిసి వస్తుందని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు.
ఉద్యోగులను జగన్ రెడ్డి నమ్మించి మోసం చేశారు. పీఆర్సీ 23శాతానికే పరిమితం చేయడం దుర్మార్గం. చంద్రబాబు పాలనలో రూ.22,700 కోట్లు రెవెన్యూలోటు ఉన్నా ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్ ఇవ్వడం జరిగింది. పీఆర్సీని జగన్ రెడ్డి పునసమీక్ష చేయాలి.గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రోబేషన్ డిక్లేర్ చేయాలి. ప్రొబేషనరీ డిక్లరేషన్ 8 నెలలు పొడిగించడం వల్ల ఉద్యోగులకు అన్యాయ జరుగుతుంది. రెండేళ్ల శిక్షణా కార్యక్రమం పూర్తైనందు వల్ల వారిని క్రమబద్ధీకరించాలి.
ఏటా జనవరి 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కేలండర్ విడుదల చేస్తామనే జగన్ రెడ్డి హామీని నెరవేర్చాలి. తక్షణమే జాబ్ కేలండర్ విడుదల చేయాలి. ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి.రాష్ట్రంలో సమగ్ర తాగునీటి పథకాల నిర్వహణకు బకాయిలను తక్షణమే విడుదల చేయాలి. నిధుల విడుదలలో జాప్యం కారణంగా కార్మికులకు జీతాలు అందని పరిస్థితి. దీంతో గ్రామీణ ప్రాంతాలకు నీటి సరఫరాపై ప్రభావం పడుతోంది. తాగునీటి బకాయిలతో పాటు రైతులకు ధాన్యం బకాయిలు కూడా విడుదల చేయాలి.వాగులు, వంకల్లో ఇసుక నిల్వలు ఉంటే తవ్వుకునేందుకు అనుమతి ఇచ్చేలా వాల్టా చట్టం సవరించడం దోపిడీ కోసమే. ఇప్పటికే ఇసుక అక్రమ తవ్వకాలతో పెద్దఎత్తున లూటీ జరుగోంది. ఇప్పుడు వాల్టా చట్టాన్ని సవరించి సరికొత్త దోపిడీకి తెరతీశారు.
కర్నూలు జిల్లా నంద్యాలలో టీడీపీ నేత మౌలానా ముస్తాక్ అహ్మద్ నిర్వహణలో ఉన్న మదర్సాను జగన్ రెడ్డి సీజ్ చేయడాన్ని సమావేశంలో నేతలు తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా మదర్శాను సీజ్ చేయడం తగదని అన్నారు. టీడీపీ నేతలే లక్ష్యంగా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ విద్యార్థుల భవిష్యత్ తో చెలగాటం ఆడుతున్నారని సమావేశంలో నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేష్, కె.అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నిమ్మకాయల చినరాజప్ప, కాలవ శ్రీనివాసులు, దేవినేని ఉమామహేశ్వరరావు, కేఎస్ జవహర్, నిమ్మల రామానాయుడు, బండారు సత్యనారాయణ మూర్తి, బీద రవిచంద్ర యాదవ్, ధూళిపాళ్ల నరేంద్ర, ఆలపాటి రాజేంద్రప్రసాద్, టీడీ జనార్థన్, బీసీ జనార్థన్ రెడ్డి, గురజాల మాల్యాద్రి, పి.అశోక్ బాబు, కొమ్మారెడ్డి పట్టాభిరాం, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మద్దిపాటి వెంకటరాజు, చింతకాయల విజయ్ పాత్రుడు, జి.వి. రెడ్డి తదితరులు పాల్గొన్నారు.