– కొత్త రూపంలో జాతీయ జెండా రంగులతో గుంటూరు జిన్నా టవర్
– 3 న జిన్నా టవర్ వద్ద జాతీయ జెండా ఎగుర వేయాలని నిర్ణయం
దశాబ్దాల చరిత్రగల గుంటూరు జిన్నా టవర్‌కు రంగులు మారాయి. జాతీయ జెండా రంగులతో కొత్త రూపంలో కనిపించడం ప్రజలను ఆకర్షిస్తోంది. బిజెపి, హిందూ సంఘాలు జిన్నా టవర్ పేరు మార్చాలని ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం జిన్నా టవర్ రక్షణకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టింది.
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ రక్షణ కవచాన్ని కూడా ఏర్పాటు చేశారు. రిపబ్లిక్ డే రోజు జిన్నా టవర్ పై జాతీయ జెండా ఎగురవేసేందుకు హిందూ వాహిని సంఘం కార్యకర్తలు దూసుకు రావడం పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ముందస్తుగా బిజెపి జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణను అరెస్టు కూడా చేశారు.
ఇలా జాతీయ స్థాయిలో జిన్నా టవర్ అంశం పెద్ద చర్చగా మారింది. జిన్నా పేరు మార్చి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరు పెట్టాలని డిమాండ్లు వచ్చాయి. శ్రీనగర్ లాహోర్ పై జాతీయ జెండా ఎగుర వేస్తే గుంటూరు జిన్నా టవర్ పై ఎందుకు ఎగరనీయ తీయలేదని బిజెపి అగ్రనేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ, ముస్లిం మతం రంగు పులుముకుని ఉందని భావించిన ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేసింది.
ఈ వివాదం సద్దుమణిగెందుకు గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాల గిరి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి లు చొరవ తీసుకొని జిన్నా టవర్ కు దగ్గరుండి జాతీయ జెండా రంగులు వేయించారు. ఇది బీజేపీ తమ విజయంగా ప్రకటించుకుంది.
ప్రభుత్వ పెద్దలు, అధికార ప్రజాప్రతినిధులు మంగళవారం మేయర్ కావటి మనోహర్ నాయుడు అధ్యక్షతన ముస్లిం మత పెద్దలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి మువ్వెన్నల రంగులను మార్చిన ప్రాధాన్యతను వారికి వివరించారు.
ఈ నెల 3 వ తేదిన జిన్నా టవర్ వద్ద జాతీయ జెండా ను ఎగుర వేయనున్నట్లు నగర మేయర్ కావటి మనోహర్ ప్రకటించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో జిన్నా టవర్ వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది.