కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికై కేంద్రం చేసిన ప్రత్యేక కేటాయింపులపై బిజెపి సీనియర్ లీడర్ జీవీఎల్ నరసింహారావు స్పందించారు.
ఈసారి కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక కేటాయింపులు చేసినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి బిజెపి సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ బడ్జెట్‌లో అమరావతికి కేంద్ర ప్రభుత్వం రూ.15,000 కోట్ల బహుపాక్షిక ఏజెన్సీల ద్వారా ఆర్థిక సహాయం, మరియు భవిష్యత్తులో మరిన్ని నిధుల కేటాయింపు హామీ వల్ల ఆంధ్రప్రదేశ్ ఆధునిక రాజధాని నగర కల సాకారం కానుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా జీవీఎల్ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు, మరియు రాష్ట్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
అమరావతి రాజధాని నిర్మాణానికి భారీ ఆర్థిక సాయంతో పాటు పోలవరం పూర్తిచేయడానికి, ఇంకా రెండు పారిశ్రామిక పట్టణాల మౌలిక సదుపాయాల అభివృద్ధికై నిధులు, ఆర్థికాభివృద్ధికి మూలధన వ్యయం అందజేత, రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు చెందిన వెనుకబడిన జిల్లాలకు అభివృద్ధి గ్రాంట్లు వంటి అనేకరకాల సహాయాన్ని ఈ బడ్జెట్‌లో ఇచ్చినందుకు ప్రధాని మోడీకి జీవీఎల్ కృతజ్ఞతలు తెలియజేశారు.
విభజనలో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం గత 10 సంవత్సరాల్లో అన్ని రకాలా సాయం అందించిందని, కానీ ఈ బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ పట్ల ప్రత్యేక దృష్టికి ఎన్నికల్లో ఎన్డీఏకు అనుకూల ప్రజల తీర్పు కారణమైనది అనీ ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుకున్న బలానికి ఇది మరో ఋజువనీ జీవీఎల్ వ్యాఖ్యానించారు.