(వీణ చిట్టిబాబు జయంతి)
ఆ వేలికొసలు సరిగమపదనిసలు..
అవి వీణపై నర్తిస్తే
స్వరరాగగంగా ప్రవాహమే..
వాగ్దేవి ఆవాహమే!
చల్లపల్లి హనుమాన్ పంతులు
ఈ పేరు చెబితే ఎవరంటూ క్వశ్చన్ మార్కు మోము..
చిట్టిబాబు..ఇలా అంటే
కొంత పరిచయం..
వీణ చిట్టిబాబు..
ఈ నామధేయం జగద్విదితం..
సప్తస్వరాల సమ్మిళితం!
పాశ్చాత్య సంగీత పెనుతుఫాను తాకిడికి
అల్లాడుతున్న సత్సంప్రదాయ
సంగీతానికి చిట్టిబాబు
ఓ మేలుకొలుపు..
ఆయన వీణ
ఒక గొప్ప పారంపర్యానికి మెరుపు..!
చదువులమ్మ
మాణిక్యవీణాం
ముపలాలయంతి..
చిట్టిబాబు
హస్తాలంకృత వీణ
మూడు లోకాలను ఓలలాడించిన
నారదుని మహతి..
శుక్లాంబరధరం అంటూ కచేరికి శ్రీకారం చుడితే రాగాల వర్షమే..
శ్రోతల నిర్విరామ హర్షమే..!
ఓ కలైమామణి..
నీ గురువు ఈమని..
ఏనాడో మెచ్చింది
నిను అవని..
ఇప్పుడీ తటి
నిను పొగడుదు ఏమని..
వీణపై నీ రాగాల సురాగాలకు
పరవశించి మండుటెండలో
సైతం పులకించి
విరియదా ఆమని..!
అందమైన రూపు
వెండితెరవైపూ ఓ చూపు..
మనసే అందాల బృందావనం
వేణుమాధవుని పేరే మధురామృతం..
మంచికుటుంబం
సినిమాలో అలరించే పాట..
ఓలలాడించే చిట్టిబాబు
వీణ సయ్యాట!
మహదేవుడి సంపూర్ణరామాయణం
టైటిల్స్ లోనూ
శ్రావ్యంగా వినిపించిన
రఘువంశ సుధాంబు
అదరగొట్టిన చిట్టిబాబు!
ఆ ప్రావీణ్యాన్ని మెచ్చి
వరించి అరుదైన బిరుదులు
ఆయన ఆస్థానమే
తమ స్వస్థానమై…!
తిరుమల ఆస్థానమూ
కంచి పీఠమూ..
మైసూరు సంస్థానమూ..
తమిళనాడు ప్రభుత్వమూ..
సత్కరించి తాము సంతసిల్లె..
ఆ వైణిక విద్వన్మణి ప్రతిభకు
మురిసి రాగాలే ప్రణమిల్లె!
– ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286
7995666286