Suryaa.co.in

Features

బ్యానర్ పై ఫోటో చూడగానే “పోయారా!” అన్న వింత భావన

బ్యానర్ పై ఫోటో చూడగానే “పోయారా!” అన్న వింత భావన నాకు కలుగుతుంది! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో, నేను ఏ.ఐ.టి.యు.సి. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు, 2008లో అనుకొంటాను, విజయవాడలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు ఉద్యోగుల మరియు కార్మికుల సంఘం, రాష్ట్ర మహాసభ జరిగింది. ఆ మహాసభకు నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. నిర్వాహకులు, మిత్రులు కర్రి దుర్గారావు గారు నా ఫోటో అడిగారు. ఎందుకని అడిగాను. ప్లెక్సీ బ్యానర్లపై ముద్రించడానికని చెప్పారు.

వెంటనే నేను మహాసభకు రావడంలేదని చెప్పాను. అందేంటని ఆశ్చర్యపోయారు. నేను బ్రతికే ఉన్నాను కదా! బ్యానరుపై నా ఫోటో ఎందుకు వేయాలనుకొన్నారని అడిగా. అందుకే రాకూడదని నిర్ణయించుకున్నానని చెప్పా. ఆయన కంగుతిన్నారు. ఫోటో వద్దులేండి, మహాసభకు రండని కోరారు.అప్పుడు నేనొక షరతు పెట్టా, బ్యానర్లపై ఎవరి ఫోటో కనిపించినా మహాసభలో పాల్గొనకుండా వెనుతిరిగి వెళ్ళిపోతానని చెప్పా. ఆ షరతుకు మహాసభ నిర్వాహకులు అంగీకరించారు. నేను మహాసభకు హాజరయ్యాను. అదొక వింత అనుభూతి.

ఈ మధ్య కాలంలో ప్లెక్సీ బ్యానర్ల సంస్కృతి విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా అవే. చూడగానే చాలా చిరాకు వేస్తుంది. ప్రభుత్వం, స్థానిక సంస్థలు, వ్యక్తులు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, వగైరా వగైరా అందరూ ఈ ప్రచార యావకు బానిసలై పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని, సొంత డబ్బు(అక్రమార్జన సొమ్ము)ను తగలేడుతున్నారే! అనే బాధ కలుగుతుంది.

ఒక ఘటన ఉదహరిస్తాను. ఒకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే 2013లో అనుకొంటాను ఒక రాష్ట్ర మహాసభకు కరీంనగర్ వెళ్ళాను. పట్టణంలో భారీ ప్లెక్సీ బ్యానర్ల కట్టారు. వాటిపై జాతీయ, రాష్ట్ర నాయకుల ఫోటోలను చిన్నవిగా ముద్రించి స్థానిక నాయకుల ఫోటోలను పెద్దవిగా ముద్రించారు. వాటిని చూసిన రాష్ట్ర నాయకుడొకరు అదేంటి మా ఫోటోలను చిన్నవిగా, మీ ఫోటోలను పెద్దవిగా ముద్రించారు. మేమా నాయకులం? మీరా? అని జిల్లా, పట్టణ నాయకులను అడిగారు. ఆ ప్లెక్సీ బ్యానర్లను చూసి, ఆ సంభాషణ విన్న నాకు సిగ్గేసింది.

– టి.లక్ష్మీనారాయణ

LEAVE A RESPONSE