నదుల అనుసంధానంపై జరుగుతున్న కసరత్తులో అంతర్భాగంగా తెరపైకి వచ్చిన బొల్లాపల్లి రిజర్వాయరు ప్రతిపాదిత ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సేవా సమితి, అధ్యక్షులు శ్రీ అక్కినేని భవానీప్రసాద్, నేను, శ్రీ శ్రీనివాస్ మరియు శ్రీ నరేంద్ర నిన్న (అక్టోబరు 6) పరిశీలించి వచ్చాము.
175 నుండి 200 టియంసిల నిల్వ సామర్థ్యంతో బొల్లాపల్లి రిజర్వాయరు నిర్మించి, గోదావరి వరద నీటిని అందులోకి తరలించి, వినియోగించుకోవాలన్న ప్రభుత్వ ఆలోచన సముచితమైనది. బొల్లాపల్లి కొండల ప్రాంతంలో బ్యాలెన్సింగ్ రిజర్వాయరు నిర్మిస్తే, బొల్లాపల్లి మండలంలోని మేళ్ళవాగు, గరికపాడు, గుమ్మనంపాడు, రేమిడిచర్ల మరియు అయ్యన్నపాలెం గ్రామాల పరిధిలో పదమూడు చిన్న, పెద్ద గ్రామాలు ముంపుకు గురౌతాయని ప్రభుత్వం వెల్లడించింది.
ఆ కొండ ప్రాంతాలను, ప్రధానమైన గ్రామాలను, పంట పొలాలను, ఒక పెద్ద చెరువు మరియు ఒక నాగులేరు వాగును పరిశీలించాము. ఆ ప్రాంతంలో ఒక ప్రయివేటు సిమెంట్ పరిశ్రమ కూడా ఉన్నది. వరుస కొండలు మరియు కొండల మధ్య కిలోమీటర్ల పొడవున వ్యాలీ ప్రాంతంతో పెద్ద రిజర్వాయరు నిర్మాణానికి అత్యంత అనుకూలమైన ప్రాంతంగా బృందంలోని సభ్యులందరం భావించాం.
అభివృద్ధి చెందిన సారవంతమైన పంట పొలాలున్నాయి. నివాస భవనాలు మరియు పక్కా గృహాలు, రహదారులతో గ్రామాలు కాస్త అభివృద్ధి చెందినవిగా ఉన్నాయి. రిజర్వాయరు నిర్మిస్తే నిర్వాశితులయ్యే ప్రజలకు భూ సేకరణ చట్టం -2013 ప్రకారం మెరుగైన ఆర్ & ఆర్ పథకాన్ని అమలు చేయాల్సి ఉంటుంది.
మార్గమధ్యంలో, నాగార్జునసాగర్ కుడి కాలువపై నిర్మించిన బొగ్గువాగు రిజర్వాయరును సందర్శించాం. ప్రస్తుతం దాని నిల్వ సామర్థ్యం 3.50 టియంసిలని అక్కడ అందుబాటులో ఉన్న కాలువ నిర్వహణ ఉద్యోగి తెలియజేశారు. కాలువ తవ్వకం నాడు సేకరించిన భూమిని పూర్తిగా నీటి నిల్వకు వినియోగించుకోవడం లేదు.
పూడికతో నిల్వ సామర్థ్యం కూడా తగ్గింది. ఆ రిజర్వాయరు నాగార్జునసాగర్ డ్యాంకు ఇరవై కి.మీ. దూరంలోనే ఉన్నది. రిజర్వాయరు నీటి నిల్వ సామర్థ్యాన్ని రెట్టింపు చేసే అవకాశం ఉన్నదనిపించింది. నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం కూడా ఆలోచన చేసిందన్న సమాచారం. నాగార్జునసాగర్ డ్యాంకు అతిసమీపంలో ఉన్న ఈ రిజర్వాయరు నీటి నిల్వ సామర్థాన్ని పెంచుకుంటే సముద్రం పాలౌతున్న కృష్ణా నదీ జలాలను ఆ మేరకు మాచర్ల మరియు గురజాల నియోజకవర్గాలలో సద్వినియోగం చేసుకోవచ్చు.
సేకరించిన భూమి ప్రభుత్వం ఆధీనంలోనే ఉన్నది. పూడిక తీయడానికి మరియు ఇతర ఖర్చులకు మాత్రమే ప్రభుత్వం వ్యయం చేయాల్సి ఉంటుంది. పెద్ద మొత్తంలో వ్యయం చేయాల్సిన అవసరం కూడా ఉండదన్న అభిప్రాయం కలిగింది. కూటమి ప్రభుత్వం ఆలోచించాలని విజ్ఞప్తి.
మా పర్యటనలో మాతోపాటు ఉండలేక పోయిన ఆ ప్రాంత వాసి, 1970 దశకంలో ఏఐఎస్ఏఫ్ ఉద్యమంలో సహచరుడు, నా మిత్రుడు వరదయ్య ఫోన్ ద్వారా మమ్మిల్ని గైడ్ చేశారు. తిరుగు ప్రయాణంలో వరదయ్యను నర్సరావుపేటలోని వారి ఇంటికి వెళ్ళి, అల్పాహారం స్వీకరించి, ప్రతిపాదిత బొల్లాపల్లి రిజర్వాయరుకు సంబంధించి ఆయనకున్న అవగాహనను మరియు సమాచారాన్ని మాతో పంచుకున్నారు. మా మిత్రుడికి ధన్యవాదాలు.
– టి. లక్ష్మీనారాయణ