* కావాలనే బీసీ మంత్రితో అనుచిత వ్యాఖ్యలు చేయించింది
* దళితులు రాజకీయంగా ఎదిగితే చూసి ఓర్వలేకపోతున్న కాంగ్రెస్ నాయకులు
* ఐక్యంగా ఉన్న బీసీ, ఎస్సీ, మైనార్టీలను విడదీసే కుట్రలు
* తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్
హైదరాబాద్: దళిత మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను కించపరిచేలా మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ తీవ్రంగా ఖండించారు. దళిత ప్రజా ప్రతినిధులను కించపరచడం కాంగ్రెస్ సర్కార్ కు పరిపాటిగా మారిందన్నారు.
ఎస్సీ సామాజిక వర్గానికి గౌరవంగా నిలిచిన ఒక రాష్ట్ర మంత్రి పై కావాలనే కాంగ్రెస్ పార్టీ మరో మంత్రి పొన్నం ప్రభాకర్ చేత అవమానకర వ్యాఖ్యలు చేయిస్తుందన్నారు. ఎన్నో ఏళ్లుగా తెలంగాణలో బీసీలు ఎస్సీలు మైనార్టీ ప్రజలు కలిసి ఉంటున్నారని అది చూడలేక బీసీలు, ఎస్సీలు దూరం కావాలని కాంగ్రెస్ పార్టీ ఇలా వ్యక్తిగత దూషణలు చేయిస్తుందన్నారు..
సహచర మంత్రిపై ఈ విధమైన అసభ్యకరమైన, వ్యక్తిగత దూషణ వ్యాఖ్యలు చేయడం రాజకీయ సంస్కృతికి విరుద్ధమన్నారు. వెంటనే పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
గతంలో సైతం దళిత ప్రజాప్రతినిధులను అవమానించే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందని తెలిపారు. యాదాద్రి ఆలయంలో దళిత ఉప ముఖ్యమంత్రి అయిన భట్టి విక్రమార్కను కింద కూర్చో పెట్టి అవమానించారని గుర్తు చేశారు. అలాగే బర్త్ డే వేడుకల్లో స్వయాన సీఎం రేవంత్ రెడ్డి కేక్ తిని ఎంగిలి చేతిని దళిత ఎమ్మెల్యే షర్ట్ కి తుడిచాడని తెలిపారు.
ఎస్సీలకు ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నెరవేర్చక పోగా ఇప్పుడు దళిత ప్రజాప్రతినిధులను అవమానిస్తున్నారని మండిపడ్డారు. దళితుల ప్రజా ప్రతినిధులతో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు ఎస్సీల పట్ల వారికి ఉన్న తీరు తెలియ జేస్తుందని వివరించారు. దళితుల పట్ల కాంగ్రెస్ పార్టీ ఇలాగే వ్యవహరిస్తే రానున్న రోజుల్లో దళితులం అందరం కలిసి కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు.