ప్రజలందరూ ఈ సినిమా చూడాలి: చంద్రబాబు నాయుడు
టీడీపీ అధినేత నాయుడు చంద్రబాబు ‘రాజధాని ఫైల్స్’ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూడాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఒక ప్రాంతంపై కక్ష కట్టి, అది కూడా రాష్ట్ర రాజధానిపై పగబట్టి సర్వనాశనం చేసిన ప్రాంతం అమరావతి అని వెల్లడించారు.
ఇది ఒక చారిత్రాత్మక విషాదం…. దీని కోసం కులాల కుంపట్లు రాజేశాడని, విష ప్రచారాలు చేయించాడని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అధికార బలం మొత్తం ఉపయోగించి ఉద్యమకారులను చిత్ర హింసలకు గురిచేశాడని తెలిపారు. ఈ కుట్రలకు, దారుణాలకు అద్దం పట్టిన చిత్రం ‘రాజధాని ఫైల్స్’ అని వివరించారు.
జగన్ క్రూరత్వానికి, వైసీపీ విధ్వంసానికి నాశనమైన ఒక రాజధాని… దాని కోసం ఎన్నో త్యాగాలు చేసిన ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను ఈ చిత్రం కళ్లకు కట్టిందని చంద్రబాబు వివరించారు. అందుకే ఈ చిత్రం విడుదల కాకుండా ఆపాలని జగన్ శతవిధాలా ప్రయత్నించాడని, కానీ కోర్టు అతడి ఆటలను సాగనివ్వలేదని తెలిపారు.
‘రాజధాని ఫైల్స్’ సినిమా ప్రదర్శనకు కోర్టు అనుమతి ఇచ్చిందని, తెలుగు ప్రజలందరూ థియేటర్లకు వెళ్లి సినిమాను చూసి వాస్తవాలు తెలుసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. జగన్ రెడ్డీ… నీ సినిమా అయిపోయింది… అసలు సినిమా ఇప్పుడు మొదలవుతోంది… కాస్కో అంటూ సవాల్ విసిరారు.