– పోరాటాలు పక్కన పెట్టి పొత్తులకు ఆరాటపడుతున్న కమ్యూనిస్టులు
దేశంలో కమ్యూనిస్టులు, బహుజన పార్టీల పరిస్థితి దారుణంగా తయారైంది. పైకి లౌకికవాదం, బహుజన వాదం భుజానకెత్తుకున్నాం అని నీతులు చెబుతున్న చేసేది అవకాశవాద స్వార్థ రాజకీయాలు అనే అపవాదును మూటగట్టుకున్నారు. గతంలో ఆంధ్రాలో జనసేన, తెలుగుదేశంతో అంటకాగి తిరిగారు, తెలంగాణ లో మూఢ నమ్మకాలు మూర్తీభవించిన కేసీఆర్ తో కలసి నడవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
మరోవైపు బహుజన లిబరేషన్ ఫ్రంట్ పేరుతో దళిత లౌకికవాద ప్రజాతంత్ర వాదుల ఓట్లు చీలిక తెస్తున్నారు. గతంలో ప్రజావ్యతిరేక విధానాలు చట్టాలను ఎండగట్టి పేదల పక్షాన పోరాడి ఉద్యమాలను కింది స్థాయి తీసుకెళ్లడంలో కృతకృత్యులయ్యారు. ఇటీవల కాలంలో పోరాటాలు పక్కన పెట్టి తమ ఉనికి కోసం స్వలాభం కోసం ఆరాటపడుతున్నారు. బిఆర్ఎస్ తో పొత్తు కేసీఆర్ కోర్టులో ఉందని రాష్ట్ర నాయకులు తెలుపుతున్నారు.
అలాగే మోడీ అభివృద్ధి మాడల్ నాకు నచ్చిందని చంద్రబాబు వ్యాఖ్యానించినా నోరుమెదపకున్నారు. గతంలో కమ్యూనిస్టు పార్టీలను అవమానకరంగా దూషించిన కేసీఆర్ పంచన చేరి ఆయన వేసిన ఒకటో రెండో అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసి ఎంఎల్ఏ అవుదామని రాష్ట్ర నాయకులు భావిస్తున్నారు. తెలంగాణలో తమ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య టిఆర్ఎస్ లో కలిపేసుకుని తమను నిర్వీర్యం చేసిన విషయాన్ని మరచిపోయారు.
దీనిని బట్టి అర్ధమయ్యే విషయం వీరంతా తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఎప్పుడైనా ఎవరితోనైనా కలిసిపోతారు. వామపక్ష నాయకులు రెండో శ్రేణి నాయకులను కార్యకర్తలను ప్రోది చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. కొంతమంది మేధావులు కేవలం టీవీ లకు సామాజిక మాధ్యమాలకు పరిమితమైనారు. టీవీలకు పరిమితమైన మేధావులు కేవలం సెటైర్లు వేయడం తప్ప సామాజిక మాధ్యమాల్లో కనపడుతున్నారు కానీ ఏ రోజు ప్రజా ఉద్యమాలలో లేరు.
గత దశాబ్ద కాలంలో వామపక్ష పార్టీలలో చేరికలు లేవు అనుబంధ సంఘాలలో సభ్యత్వం మరచిపోయారు, క్యాడర్ లేక కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నారు. తమ పార్టీ బలోపేతానికి కృషి చేయకుండా కొత్త తరం నాయకులను పెంపొందించకుండా విద్యార్థులకు యువతకు మార్గదర్శకం కాకుండా వ్యవహరిస్తున్న తీరు ప్రమాదకరంగా మారింది. భారతదేశ వాస్తవికతలో కుల వ్యవస్థ ప్రధానమైనది.
దీనిని అర్థం చేసుకోవడంలో కమ్యూనిస్టులు విఫలమయ్యారు. పైగా దశలవారీ సిద్ధాంతంతో మిళితం చేసి కుల వ్యవస్థను అర్థం చేసుకోవడానికి విపరీత ప్రయత్నం చేసినట్టు కనబడుతుంది. అంతర్జాతీయ పరిస్థితులలో, కులవ్యవస్థ పాతుకుపోయిన భారతదేశం వాస్తవికతను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అనే ప్రశ్న వారికి తట్టలేదు.
భారత వాస్తవికతను అర్థం చేసుకోలేకపోయిన కమ్యూనిస్టులు వేసిన ప్రతి అడుగూ లోపభూయిష్టమే. అది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కావచ్చు, లేదా వేతనాల పెంపు కోసం జరిపే ఉద్యమమైనా కావచ్చు, అన్నింటిది ఒకటే తీరు. చైతన్యయుతమైన అవగాహనను ఈ పార్టీలు దూరం పెట్టాయి. అధ్యయనాన్ని యాంత్రిక స్థాయికి దిగజార్చాయి.
పారిశ్రామికీకరణతో ఉత్పత్తి సామాజికీకరణ జరుగుతుంది. శ్రమ విభజన, సహకారం దీనికి ప్రధానమైన అంశాలు. పెట్టుబడిదారీ విధానం ఈ పరిస్థితిని అభివృద్ధి చేస్తుంది. ప్రపంచంలోని మూల మూలల మార్కెట్లను అధీనంలోకి తెచ్చుకొని ఉత్పత్తులు కొనసాగిస్తుంది. ఈ ప్రక్రియ విశ్వవ్యాప్తమైనది. తరువాత ఏర్పడే సామాజిక దశ అంటే సమసమాజం కూడా విశ్వవ్యాప్తమైన ప్రక్రియ. సోషలైజేషన్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రాసెస్ లీడ్స్ టు సోషలిజం. వెనుకబడిన దేశాలలో, వ్యవసాయ దేశాల్లో ఉత్పత్తి సామాజికరణ సాధ్యం కాదు.
అందువల్ల ఆయా దేశాల్లో విప్లవాలు విజయవంతమైన ఇప్పటికీ వాటిని సోషలిస్టు దేశాలు అని పిలవడం అసంబద్ధం. ఈ పరిస్థితుల్లో అస్తిత్వంలో ఉన్న కమ్యూనిజం లేదా కమ్యూనిస్టు పార్టీలు కుక్కమూతి పిందెలు మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా ఈ కుక్కమూతి పిందెలు కుళ్లిపోయాయి. కొన్నిచోట్ల అస్తిత్వ రాజకీయాలకు పాల్పడుతున్నాయి.
వాటి ప్రభావం ఇంకా ఉందనుకోవడం భ్రమ. మేధో రంగంలో వారి ప్రభావం ఎంత ఉన్నప్పటికీ దానివల్ల ప్రయోజనం శూన్యం. వారు సిద్ధాంతాలను పక్కదోవ పట్టించటంలో కృతకృత్యులయ్యారు. మార్క్స్ ప్రతిపాదించిన ప్రతి అంశాన్ని పక్కదోవ పట్టించారు. సమాజంలో సెక్యులరిజాన్ని కాపాడడంలో వివిధ రంగాల్లో ఆధిపత్య శక్తులను కాపాడడంలో ప్రజల చైతన్యాన్ని పెంచడంలో కమ్యూనిస్టుల పాత్ర గణనీయంగా ఉందని భావిస్తున్నారు తప్ప ఆచరణలో ఏమాత్రం శ్రద్ద చూపడం లేదు.
రైతు కూలీలు, కార్మికుల హక్కుల పరిరక్షణలో వారి పాత్ర గణనీయమని మరికొందరు ఇండిపెండెంట్ పరిశోధకులు, అనేక ప్రోగ్రెసివ్ చట్టాలు సమాజంలో ముందుకు రావడానికి కమ్యూనిస్టు పార్టీ, నక్సలైట్ పార్టీ ఒత్తిడి పరీక్ష ఒత్తిడి ఉన్నదని ఆ రకంగా అవి ప్రెఫర్ గ్రూప్ గా పనిచేశాయని అనుకుంటున్నారు.
దుర్భర దారిద్ర్యం, విపరీతమైన అసమానతలు , వివక్ష ఉన్న చోట వారికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచటంలో కొంతమేరకైనా హక్కులు సాధించడంలో వారి పాత్ర ఉంది కానీ అది సరిపోదు. వందేళ్ల చరిత్రలో అవి సాధించిన అంశాలపై చాలానే విశ్లేషణలున్నాయి. ఏమైనా భారత కమ్యూనిస్టు పార్టీలు ఇవాళ చారిత్రక చౌరస్తాలో నిలబడి ఉన్నాయనేది వాస్తవం.