– 42 శాతం రిజర్వేషన్లకు ఎన్నికల్లో ,విద్యా ,ఉపాధి అవకాశాల్లో చట్టబద్దత కల్పిస్తాం
– కులాల వారిగా ఎక్కడ లెక్కలు బయటకి ఇవ్వలేదు
– బయట వస్తున్న కులాల వారి లెక్కలు పూర్తిగా తప్పు
– బీసీ సంఘాల నేతల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కుల సర్వేలో పాల్గొనని వారికి మరో అవకాశం ఇస్తూ ఈనెల 16 నుండి 28 వరకు అవకాశం ఇవ్వడం పట్ల బీసీ సంఘాల నేతలు ,మేధావులు ఫ్రొఫెసర్లు హర్షం వ్యక్తం చేశారు. సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో బీసీ సంఘాల నేతలు సమావేశమయ్యారు. సమావేశంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ , బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు.
ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయడంలో భాగంగా బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో ,విద్యా ఉపాధి అవకాశాల్లో చట్టబద్దత కల్పిస్తామని నిర్ణయం తీసుకోవడం పట్ల బీసీ సంఘాల నేతలు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లకు ధన్యవాదాలు తెలిపారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, సమగ్ర ఇంటింటి కుల సర్వే లో పాల్గొనని వారికి మరో అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అంతే కాకుండా తమ నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం 42 శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికలు,విద్యా ఉపాధి అవకాశాల్లో చట్ట బద్దత చేస్తామని మార్చ్ మొదటి వారంలో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి తరువాత వెంటనే శాసన సభ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్దత బిల్లు పెడతామని తెలిపారు.
అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కేబినెట్ మంత్రుల బృందం ఢిల్లీ వెళ్లి అన్ని పార్టీలను కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి దీనికి మద్దతు ఇవ్వాలని కోరుతామని పేర్కొన్నారు. బీసీ సంఘాల నేతలు , ఫ్రొఫెసర్లు , మేధావులు జిల్లాల పర్యటన చేసి కుల సర్వేలో పాల్గొనని వారు పాల్గొనేలా కృషి చేయాలని సూచించారు.
ప్రస్తుతం కులాల వారిగా బయటకు వస్తున్న లెక్కలు పూర్తిగా తప్పు అని దీనిని కావాలని ప్రతిపక్షాలు తప్పుడు లెక్కలు ప్రచారం చేస్తున్నాయని బీసీ సంఘాల నేతలతో మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కుల సర్వే లో పాల్గొనని వారి కోసం ఈనెల 16 లోపు ఒక టోల్ ఫ్రీ నెంబర్ వస్తుందని దానికి సమాచారం ఇస్తే ఎన్యూమరేటర్ సమాచారాన్ని సేకరిస్తారని తెలిపారు. దాంతో పాటు ఎంపీడీఓ కార్యాలయాల్లో కుల సర్వే సమాచార సేకరణకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడంతో పాటు ఆన్లైన్ లో కూడా సమాచారాన్ని సేకరించేలా చూస్తున్నారన్నారు.
పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందనీ తెలిపారు. బీసీ కుల గణన కోసం అన్ని పార్టీలు కలిసి రావాలని బీసీ కులగణన పై అసెంబ్లీ లో బిల్లుపెట్టడం తో పాటు చట్ట బద్దత కోసం కేంద్రం పెద్దలను కలిసి చర్చిస్తామన్నారు.తెలంగాణ అభివృద్ధి , సంక్షేమం కోసం తమినాడు తరహాలో తెలంగాణలోనూ రాజకీయ పార్టీలు ఏకం కావాలన్నారు.బిఆర్ఎస్ పార్టీకి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని విమర్శించారు. రాహుల్ గాంధీ గారు తీసుకున్న బృహత్తర కార్యక్రమం బీసీ కులగణన అని రాహుల్ గాంధీ కోరిక మేరకు కులగణన సర్వేను చేపట్టి పూర్తి చేశా మన్నారు.
సమావేశంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, బీసీ సంఘాల నేతలు ఆర్ కృష్ణయ్య , జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మి, మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణ మోహన్, జాజుల శ్రీనివాస్ గౌడ్ , కార్పొరేషన్ చైర్మన్లు నూతి శ్రీకాంత్ గౌడ్, ఈరవత్రి అనిల్ , మాజీ ఐఏఎస్ చిరంజీవులు, వినయ్ కుమార్ ,తాడురి శ్రీనివాస్ ,దాసు సురేష్ , కుమార స్వామి , ఫ్రొఫెసర్లు మురళి మనోహర్, విశ్వేశ్వర్ , ఫ్రో,, తిరుమల్ తదితర బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు.