Suryaa.co.in

Telangana

తెలంగాణ ప్రాజెక్టులపై ఈ వివక్షను చూపిస్తున్న కేంద్రాన్ని నిలదీయాలి

– పోలవరం బనకచర్ల ప్రాజెక్టు నిలిపివేయాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలి
– పోలవరం బనకచర్ల ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో పోరాటం చేయాలి
– రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర వాకౌట్

హైదరాబాద్‌: బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గోదావరి -బనకచర్ల అనుసంధాన ప్రాజెక్ట్ పై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు హాజరై బలమైన వాదన వినిపించారు. ఈ ప్రాజెక్ట్ చేపట్టడం అక్రమం, అన్యాయం అని, దీనిని తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని ఎంపీ రవిచంద్ర స్పష్టం చేశారు

ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ, దీనిని వెంటనే రద్దు పర్చాల్సిందిగా తెలంగాణ ప్రజల పక్షాన కేంద్రం ముందు రాష్ట్ర ప్రభుత్వం తన వాదనను గట్టిగా వినిపించాలని ఎంపీ వద్దిరాజు కోరారు. బీఆర్ఎస్ సలహాలు,సూచనలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా కేసీఆర్పై రేవంత్ రెడ్డి నిందారోపణలకు దిగడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎంపీ రవిచంద్ర సమావేశం నుంచి వాకౌట్ చేశారు.

సమావేశంలో తాను మాట్లాడిన సారాంశాన్ని ఎంపీ వద్దిరాజు సచివాలయం మీడియా పాయింట్ విలేకరులకు వివరించారు. ఆంధ్ర ప్ర దేశ్ విభజన చట్టం ప్రకారం ఏదైనా ఒక రాష్ట్రం కొత్త ప్రాజెక్టును చేపట్టితే అపెక్స్ కౌన్సిల్లో ప్రాజెక్టు వివరాలను పెట్టి చర్చించి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇదే కారణం చూపించి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాలేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, తుమ్మిళ్ల, భక్త రామదాస్, దిండి వంటి ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర జలశక్తి శాఖకు కృష్ణా గోదావరి బోర్డులకు ఫిర్యాదు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను.

ఇప్పుడు ఏపీ ప్రభుత్వం విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ అపెక్స్ కౌన్సిల్లో చర్చించకుండా పోలవరం బనకచర్ల ప్రాజెక్టు వంటి విషయాల్లో దూకుడుగా వ్యవహరిస్తోంది. కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖలు ToR జారీ చేయడానికి సన్నాహాలు చేస్తోందని తెలిసింది.

పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ EAC ఎజెండాలో చర్చించడం జరిగింది. కేంద్ర జలశక్తి శాఖ కూడా ప్రాజెక్ట్ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టును ఆమోదించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది.

నిజానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విభజన చట్టాన్ని ఉల్లంఘించి చేస్తున్న ఈ చర్యలను చర్చించడానికి కేంద్రం అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు
చేయకుండా, ప్రాజెక్ట్ అనుమతులు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టడం శోచనీయం. వాస్తవానికి, ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టును వెనక్కి పంపి, అపెక్స్
కౌన్సిల్ సమావేశంలో చర్చించాల్సి ఉండేది. కాబట్టి వెంటనే అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర జలశక్తి శాఖకు సీఎం లేఖ రాయాలని కోరుతున్నాం.

తెలంగాణ ప్రయోజనాలను దబ్బతీసే ఈ అంశాలపై త్వరలోనే అఖిలపక్ష ఢిల్లీకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి పోలవరం బనకచర్ల ప్రాజెక్టు నిలిపివేయాలని ఏకవాక్యత తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలి.

కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించమని అడిగినా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కోరగా కేంద్రం మాత్రం పట్టించుకోలేదు.

వరద జలాలపై ఆధారపడ్డ ఏపీ ప్రాజెక్ట్ కోసం అనుమతులతో పాటు నిధులను కూడా సమకూర్చుతోంది. బ్యాంకుల నుండి రుణాలు సేకరించడానికి FRBM పరిమితిని కూడా సడలించడానికి సిద్ధపడింది. తెలంగాణ ప్రాజెక్టులపై ఈ వివక్షను చూపిస్తున్న కేంద్రాన్ని నిలదీయాలని ఈ సమావేశం ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం.

పై అంశాల సహకారం కోసం రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు కృషి చేయాలని కోరుతున్నాం. అవసరమైతే తెలంగాణ ప్రభుత్వం పోలవరం బనకచర్ల ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో పోరాటం చేయాలి.

LEAVE A RESPONSE