Suryaa.co.in

Editorial

అనుకున్నట్లే జరుగుతోందా?

(మార్తి సుబ్రహ్మణ్యం)

టీడీపీ-జనసేన-బీజేపీ కలసి కూటమిగా కుదిరి జగన్‌పై చేసిన రాజకీయ సమరం ఫలించి ఏడాదయింది. అందరి కలలు ఫలించి చంద్రబాబునాయుడు సీఎం, పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. లోకేష్ సర్వాధికారి అయ్యారు. సంతోషం. అంతా కోరుకున్నదీ అదే.

మరి అలాగే.. అంతకు ఐదేళ్ల ముందు జగన్ సర్కారుపై వివిధ రూపాల్లో పోరాడిన టీడీపీ నాయకులు.. తెరవెనక మేధస్సును ఉపయోగించి, జగన్ సర్కారుపై వ్యతిరేకతను పోగుచేసిన వివిధ వర్గాలకు చెందిన యోధులు.. యుద్ధక్రేతంలో వైసీపీతో కలబడి నిలబడి కర్రపట్టిన పసుపు సైనికులు.. పోస్టులు పెడితే కేసులు పెట్టి జైలుపాలు చేసిన నాటి కఠిన కాలానికి ఎదురొడ్డి నిలిచి, అక్షర సమరం చేసిన సోషల్‌మీడియా సైనికులు, జర్నలిస్టులు అనుకున్నట్లే.. ఈ ఏడాది కూటమి పాలన సాగుతోందా? వారి ఆకాంక్షలు నెరవేరుతున్నాయా? అంతా అనుకున్నట్లే జరుగుతోందా?

అసలు ఈ శ్రమదాన సైనికుల సేవలను గద్దెనెక్కిన నాయకత్వం గుర్తిస్తోందా? లేదా? వారికి అపాయింటుమెంట్లు ఇస్తుందా? లేక ఫొటో సెషన్‌తో సరిపెట్టి పండగ చేసుకోమని చెబుతోందా? వీటికిమించి.. యుద్ధక్షేత్రంలో వైసీపేయులతో సై అంటే సై అని చావు కొనితెచ్చుకుని, అవయవాలలతో పాటు ఆస్తులు కోల్పోయిన పసుపు దళాలకు.. ఇప్పుడు అదే క్షేత్రస్థాయిలో కనీస గౌరవం దక్కుతోందా? ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికిస్తున్న విలువలో, పదో వంతయినా ‘ఒరిజినల్ సొంత పార్టీ’ కార్యకర్తలకు దక్కుతోందా? అన్నదే ప్రశ్న. అంటే.. అనుకున్నట్లే జరుగుతోందా అని అర్ధం!

ఏ రాజకీయ పార్టీకయినా అధికారం వస్తుంటుంది. పోతుంటుంది. కానీ కష్టాల్లో కూడా పార్టీనే అంటిపెట్టుకున్న క్యాడర్, లీడర్లకు.. అధికారం వచ్చిన తర్వాత ఎంత గౌరవం, పదవులతో కూడిన గుర్తింపు దక్కుతుందన్నదే ముఖ్యం. ఏ పార్టీ కార్యకర్తలయినా తమ అధినేతలు, తమను ఎంత బాగా గౌరవించి గుర్తించారన్నదే చూస్తారు. ప్రధానంగా ఈ విషయంలో అధికారంలో ఉన్న మరోపార్టీ అధినేత, తమ కార్యకర్తలు-నాయకులకు ఇచ్చే ప్రాధాన్యాన్ని.. ఇతర పార్టీలో ఉన్న కార్యకర్త, తమ పార్టీ అధినేతతో పోల్చుకుంటారు. ప్రధానంగా తమ పార్టీలో-అధినేతలో ఆత్మీయ వాతావరణం-విశాల హృదయం ఉందా? లేదా? అని గమనిస్తారు. ఇది ఎక్కడయినా జరిగేదే.

అంటే.. ‘‘ఫలానా పార్టీ అధినేత తమ కార్యకర్తల కోసం ఏదైనా చేస్తారు. ఎవరినీ లెక్కచేయకుండా నిర్ణయాలు తీసుకుంటారు. అధికారం వచ్చిన నెలరోజుల్లోనే అన్ని పదవులూ ఇచ్చేస్తారు. కానీ మా పార్టీ అధినేతకు అలాంటి అలవాటు లేద’’న్న పెదవి విరుపుతో కూడిన నిరాశ దర్శనమిస్తుంది. ఇది రాజకీయ పార్టీల్లో కనిపించకూడని ప్రమాదకర అంశం. ఎందుకంటే రాజకీయాల్లో అసంతృప్తికి అదే తొలి అడుగు.

ఎందుకంటే.. క్షేత్రస్థాయిలో తన రాజకీయ ప్రత్యర్ధికి, ఆయన పనిచేసే పార్టీ అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే పదవి వచ్చి.. తన పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదయినా పదవి రాకపోగా, పనులుకాని అవమానాన్ని అధికారంలో ఉన్న ఏ పార్టీ కార్యకర్త సహించలేడు. ఐదేళ్లూ ప్రత్యర్ధి పార్టీని దింపేందుకు అనవసంగా డబ్బు, సమయం వృధా చేసుకున్నానన్న మానసిక భావనకు త్వరగా వచ్చేస్తాడు.

ఈ మానసిక భావన అసంతృప్తిగా మారి.. అది పెరిగి పెద్దదయి, ఎన్నికల సమయంలో ‘పక్క చూపుల’కు కారణమవుతుంటుంది. ఇది చరిత్ర చెప్పిన సత్యం. దానిని అధికారంలో ఉన్న పార్టీలు మొగ్గలోనే తుంచేయకపోతే తర్వాత వాటికే నష్టం. ఇప్పుడు అలాంటి మానసిక భావన టీడీపీ కార్యకర్తల్లో ఉందా? లేదా?.. ఒకవేళ ఉంటే దానికి కారణమేమిటని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత టీడీపీ నాయకత్వానిదే.

ఐదేళ్లపాటు కార్యకర్తలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి, వేలమంది నాయకులకు రెండు చేతులా సంపాదించుకునే అవకాశం ఇచ్చిన జగన్ లాంటి నాయకుడే.. ‘‘కరోనా వల్ల కార్యకర్తలకు కొంత న్యాయం చేయలేకపోయా. ఈసారి జగన్ 2.0లో కార్యకర్తలకే తొలి ప్రాధాన్యం ఇస్తా’’ అని అన్నారంటే.. మరి ఐదేళ్లు అదే జగన్ సర్కారుపై అవిశ్రాంతంగా పోరాడిన టీడీపీ కార్యకర్తలు, తమ పార్టీ నాయకత్వం నుంచి ఇంకెంత ఆశించాలి? వారి సేవలు పొందిన టీడీపీ నాయకత్వం, వారికి మరెంత న్యాయం చేయాలన్న వాదనను కొట్టివేయలేం.

ఆ మాటకొస్తే టీడీపీ అధినేతగా చంద్రబాబునాయుడు కూడా ప్రతిపక్షంలో ఉన్న ప్రతిసారీ, అదే చెప్పే విషయాన్ని నేతలు గుర్తుచేస్తుంటారు. ‘‘గతంలో అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి కోణంలో అధికారులకు ఎక్కువ విలువ-సమయం ఇచ్చి పొరపాటు చేశాం. ఇకపై అలా ఉండదు. అన్నీ రాసి పెట్టుకున్నా. ఎవరేం చేశారో నా దగ్గర చిట్టా ఉంది. ఈసారి అధికారంలోకి వస్తే తొలి ప్రాధాన్యం నా ప్రాణ సమానమైన కుటుంబసభ్యులైన మీకే ఉంటుంది తమ్ముళ్లూ. అధికారంలోకి వచ్చిన వెంటనే మీ శ్రమకు తగిన గుర్తింపు-గౌరవం ఉంటుంది’’ అని చె ప్పే విషయాన్ని సీనియర్లు గుర్తు చేస్తుంటారు.

అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత, బాబు మళ్లీ పాతరోజుల్లోకి వెళ్లిపోయే అలవాటుకు ఇప్పటికీ తెరపడకపోవడం ప్రస్తావనార్హం. అసలు టీడీపీ పగ్గాలు బాబు చేతికి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకూ, ఏనాడూ అధికారంలోకి వచ్చిన రెండోరోజు నుంచి నెలరోజుల్లో అన్ని పదవులూ భర్తీ చేసిన దాఖలాలు లేవు. చివరకు జిల్లాల్లో ఆయా ఎమ్మెల్యేలు నిర్ణయించే, జిల్లా స్థాయి పదవులు కూడా భర్తీ కాని పరిస్థితి. అయినా కార్యకర్తలనే ఆశాజీవులు, పార్టీకి పనిచేస్తూనే ఉన్నారు. ఉంటారు. ఇవన్నీ పార్టీ బలం- కార్యకర్తల బలహీనతలకు సంబంధించిన అంశాలు.

అదే కాంగ్రెస్, వైసీపీ పార్టీలు అధికారంలోకి వచ్చిన రెండోరోజు నుంచి, నెల-రెండునెలల్లోనే అన్ని పదవులూ భర్తీ చేస్తుంటాయి. ఆ రకంగా చాలామంది నాయకులకు రెండు,మూడు టర్ములు పూర్తి చేసే అవకాశం లభిస్తుంది. ఆ ప్రకారంగా వేలాదిమందికి రాజకీయ ఉపాథి కల్పిస్తుంది. జగన్ ఇంకా సీఎంగా ప్రమాణం చేయకముందే ధనుంజయరెడ్డిని తన కార్యదర్శిగా నియమించుకుని, పదిరోజుల్లోపే సీఎంఓను భర్తీ చేసుకున్నారు. వైఎస్ జమానాలో అయితే, ఉదయం నిర్ణయం తీసుకుంటే రాత్రికి జీఓలు వచ్చేవి. ఇదంతా ఆయా పార్టీల అధినేతల చురుకుదనం-చిత్తశుద్ధిపై ఆధారపడి తీసుకునే నిర్ణయాలు.

కానీ కూటమి అధికారంలోకి వ చ్చి ఏడాదయినా చిన్న చిన్న ఆలయ కమిటీలు, మార్కెట్ కమిటీలు, జిల్లా స్థాయి పదవులు కూడా భర్తీ చేయలేని పరిస్థితి. వేసిన కార్పొరేషన్లకు ఇప్పటిదాకా డైరక్టర్లు వేయని వైచిత్రి. నిజానికి ఇవన్నీ స్థానిక ఎమ్మెల్యేల అభీష్టం ప్రకారం తీసుకునే నిర్ణయాలు. కానీ వాటిని కూడా తమ చేతిలో పెట్టుకుని, పని భారం పెంచుకునే ‘కోరి తెచ్చుకుంటున్న సమస్య’. రాజకీయాల్లో వికేంద్రీకరణతో చాలా సమస్యలు తగ్గుతాయన్న వాస్తవం, సుదీర్ఘ రాజకీయానుభవం ఉన్న వారికి తెలియకపోవడమే ఆశ్చర్యం. చివరకు అసెంబ్లీ కమిటీలు కూడా 9 నెలల తర్వాత.. అది కూడా పత్రికల్లో కథనాల అనంతరం తీసుకున్న నిర్ణయం కావడం మరో వైచిత్రి.

ఇక కూటమి ఏడాది పాలనలోకి వెళితే.. ఏపీ ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛావాయువు ‘ఎవరి అనుమతి లేకుండానే’ నిర్భయంగా పీల్చగలుగుతున్నారు. గ్రామాల్లో రచ్చబండల దగ్గర ధైర్యంగా, తమ అభిప్రాయాలు వెలిబుచ్చగలిగే స్వేచ్ఛ అనుభవిస్తున్నారు. గతంలో ఏం మాట్లాడితే ఏం కేసులు పెడతారోనన్న భయంతో బతికిన దుస్థితి. జగన్ హయాంలో ఒక పోస్టు ఫార్వార్డ్ చేసినందుకే 75 ఏళ్ల సీనియర్ జర్నలిస్టు కొల్లు అంకబాబును చెరపట్టిన నియంతృత్వం. మరో వృద్ధ మహిళపైనా కేసులు పెట్టిన దుర్మార్గపు కాలం.

ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఠంచనుగా జీతాలు-పించన్లు ఇస్తున్నారు. ఏడాది క్రితం ఎప్పుడు జీతాలు-పించన్లు వస్తాయో తెలియని ఆందోళన పరిస్థితి. కాకపోతే ఉద్యోగులకు రావలసిన పెండింగ్ బకాయిలు, దీర్ఘకాలిక సమస్యలు అలాగే ఉన్నాయి. ఇప్పటి ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా అవి వెంటనే నెరవేరడం కష్టమే. క్రమం తప్పకుండా జీతాలు ఇవ్వడమే ఎక్కువగా భావించాల్సిన పరిస్థితి. ‘గట్టిగా మాట్లాడితే జగన్ జమానాలో మీకు ఇవి కూడా లేవు కదా? అప్పుడెందుకు నిలదీయలేదు’అని ప్రశ్నించే పరిస్థితి. ఇదీ ఉద్యోగుల పరిస్థితి.

ఇక మందుబాబులు కావలసిన బ్రాండ్ మందు తాగుతున్నారు. గతంలో పిచ్చి బ్రాండ్లు తాగిన వారికి ఇది ఊరట. ఫలితంగా లక్షలాదిమంది ప్రాణాలు నిక్షేపంగా నిలబడుతున్నాయి. కూలినాలి చేసుకునేవారితోపాటు, మధ్య తరగతి ప్రజలు చాలాచోట్ల 5 రూపాయలకే అన్న క్యాంటిన్‌లో భోజనం చేసి, కడుపునింపుకునే సంతృప్తికర వాతావరణం. ఫలితంగా బోలెడు డబ్బు ఆదా అయి, అవి కుటుంబజీవనానికి అక్కరకొస్తున్న పరిస్థితి. జగన్ నిష్క్రమణ తర్వాత భవన నిర్మాణాలు ఊపందుకోవడంతో కార్మికులు, వ్యాపారులు బిజీగా కనిపిస్తున్నారు. కాకపోతే తొలి ఆరునెలలు ఇసుక ధర ఇబ్బందిపెట్టినా, ఇప్పుడు అందుబాటులోనే ఉన్న పరిస్థితి.

జగన్ జమానాలో శిధిలావస్థకు చేరిన రోడ్లకు మంచి రోజులొచ్చాయి. తాజాగా ఇంట్లో ఎంతమంది పిల్లలు స్కూలుకు వెళితే, అంతమందికీ ‘తల్లికివందనం’ కింద డబ్బులు ఇస్తున్న వైనం, ఇంటిల్లిపాదినీ సంతోషపెట్టేదే. దీనివల్ల ఇంట్లో విద్యాదీపం వెలుగుతోంది. నిజానికి ఈ పథకం కూటమి సర్కారు అమలుచేయలేదన్నది జగన్ ప్రగాఢ విశ్వాసం. దానికి కారణం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి. కానీ దానిని విజయవంతంగా అమలుచేసి, జగన్ అంచనాలను దారుణంగా విఫలం చేసింది.

నిజానికి కూటమి సర్కారు, తొలి ఏడాది సాధించిన అతి పెద్ద భారీ విజయం ఇదే. అంటే గంపగుత్తగా పిల్లలు-తల్లుల అభిమానం సంపాదించుకుందన్నమాట. ఈ స్థాయిలో వచ్చిన ఆదరణ మరే ఇతర పథకాలకూ రాకపోవడం ప్రస్తావనార్హం. అయితే ఆ డబ్బును స్కూలు ఫీజులకు కాకుండా, మహిళలు సొంత అవసరాలకు వాడుకుంటేనే సమస్య. ఇవన్నీ నాణేనికి ఒకవైపు కనిపించే పూర్తి సానుకూల అంశాలు.

(సశేషం)

LEAVE A RESPONSE