(మార్తి సుబ్రహ్మణ్యం)
కూటమి ఏడాది పాలన నాణేనికి మరోవైపు చూస్తే.. కూటమి ప్రతిష్ఠకు కుట్లు పడే శరాఘాతాలు బోలెడు. టీడీపీ స్థాపించిన తర్వాత ఎన్నోసార్లు అధికారంలోకి వచ్చినప్పటికీ, ఎమ్మెల్యేలలో ఇప్పటి మాదిరి విచ్చలవిడితనం, ధిక్కారపర్వం, బేఖాతరిజం, నాయకత్వమంటే లెక్కలేనితనం మున్నెన్నడూ చూసింది లేదు. సినిమాల్లో రౌడీలు మామూళ్లు వసూలు చేసినట్లు చూస్తుంటాం.
ఇప్పుడు నియోజకవర్గాల్లో చాలామంది ఎమ్మెల్యేల బరితెగింపు చూసి, బహుశా ఆ రౌడీలు కూడా సిగ్గుపడినా ఆశ్చర్యం లేదు. ఇసుక, మట్టి, మైనింగ్, రేషన్‌బియ్యం నుంచి ప్రైవేటు పంచాయతీల వరకూ వేటినీ వదలని పరిస్థితి క్షేత్రస్థాయిలో దర్శనిమిస్తోంది. గత సర్కారులో వైసీపీ ఎమ్మెల్యేలను ఆదర్శంగా తీసుకుంటున్న చాలామంది టీడీపీ- జనసేన ఎమ్మెల్యేల దుందుడుకు చర్యలు భవిష్యత్తులో ప్రమాదఘంటికలకు సంకేతమే.
కడప జిల్లాలో బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే-ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యే-వీరి మధ్యలో ఓ బీజేపీ ఎంపీ మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్నయుద్ధం, లారీలను ఆపేవరకూ వెళ్లింది. ఇవన్నీ టీడీపీని సమర్ధించే మీడియాలోనే పతాక శీర్షికల్లో వచ్చిందంటే.. ప్రజాప్రతినిధుల బరితెగింపు-విచ్చలవిడితనం ఏ స్థాయికి వెళ్లిందో అర్ధమవుతోంది. మరి వీటి ని ప్రజలు ఆమోదిస్తారా?
నిజానికి ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేల చక్కదనం చూసి ప్రజలు వారిని ఎన్నుకోలేదు. అందులో సీనియర్ల గెలుపు వారి రెక్కల కష్టం కావచ్చు. కానీ మిగిలిన వారి గెలుపు అందుకు భిన్నం. జగన్ నియంత పాలన భరించలేకనే కూటమిని గెలిపించారన్నది మనం మనుషులం అన్నంత నిజం.
అందుకు తొలుత రఘురామకృష్ణంరాజు తిరుగుబాటు , ఆ తర్వాత చంద్రబాబు అరెస్టు, ఆయనకు సంఘీభావంగా ప్రపంచంలోని తెలుగువారు నిర్వహించిన ఆందోళన, బీజేపీతో పొత్తు ఉన్నా టీడీపీకి జై కొట్టిన ముస్లిం వర్గం, ఎన్నికలు ముందు జగన్ సర్కారు తీసుకువచ్చిన ల్యాండ్ టైటిల్యాక్ట్.. లోకేష్ పాదయాత్ర, భువనేశ్వరి పర్యటనలు, ఎన్‌ఆర్‌ఐల ఆర్ధికసాయం, టీడీపీ జోనల్ ఇన్చార్జుల సమన్వయం, వైసీపీ ఎమ్మెల్యేల విచ్చలవిడి దోపిడీవిధానాలు, వైసీపీపై రెడ్డి రాజ్యమనే ముద్ర, జె బ్రాండు మందు, వాలంటీర్ల పెత్తనం, బీజేపీతో పొత్తు వల్ల బ్రాహ్మణ-వైశ్య కులాలతోపాటు విద్యావంతుల సానుకూలత, జనసేనతో జతకట్టడంతో వచ్చిన కాపు సామాజిక వర్గం, కమ్మవర్గంలో ఏకీకరణ, జగన్‌పై ఉద్యోగుల వ్యతిరేకత.. ఇలా అన్నీ కలగలసి, జగన్ పార్టీని 11కే పరిమితం చేసి చావుదెబ్బతీసేందుకు కారణమయ్యారన్నది నిష్ఠుర నిజం.
క్షేత్రస్ధాయిలో వైసీపీతో యుద్ధం చేసిన కార్యకర్తలు, సోషల్‌మీడియా ద్వారా భూకంపం పుట్టించిన పసుపు సైనికులు, చానెళ్లలో కొందరు ఎనలిస్టుల ప్రభావం కూడా కూటమి అధికారంలోకి వచ్చేందుకు దోహదపడింది. అంతే తప్ప, ఫలానా వారి వల్ల మాత్రమే కూటమి అధికారంలోకి వచ్చిందనో.. లేదా తమను చూసి మాత్రమే జనం గెలిపించారనుకుంటే అని నిస్సందేహంగా భ్ర మన్నర భ్రమ!
సుత్తి లేకుండా సూటిగా, నిర్మొహమాటంగా చెప్పాలంటే.. కేవలం జగన్‌పై పీకల్లోతు ఉన్న వ్యతిరేకతే కూటమిని గెలిపించింది.
లేకపోతే అంతకుముందు రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయిన పవన్.. పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలిచేవారు కాదు. మంగళగరిలో తక్కువ మెజారిటీతో ఓడిన లోకేష్‌కు, భారీ మెజారిటీ సాధ్యమయ్యేది కాదు. అసలు బీజేపీ ఉనికి- కమ్మ ఓటర్ల సంఖ్య నామమాత్రంగా కూడా లేని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల లాంటి నియోజకవర్గంలో, బీజేపీకి భారీ మెజారిటీ దక్కేది కాదు.
ముస్లింల సంఖ్య ఎక్కువగా ఉన్న విజయవాడలో, బీజేపీ భారీ మెజారిటీతో గెలిచేది కాదు. ఫ్యాక్షన్ రాజకీయాలకు పుట్టినిల్లయిన ధర్మవరంలో బీజేపీ నెగ్గేది కాదు. వైఎస్ కుటుంబానికి తిరుగులేని రక్షణ కవచమయిన కడప జిల్లాలో టీడీపీ, బీజేపీ మీసం మెలేసేదే కాదు. గత ఎన్నికల్లో కూటమి అభ్యర్ధులంతా భారీ మెజారిటీతో గెలిచేందుకు కారణం.. జగన్‌పై జనం వ్యతిరేకత తప్ప, అభ్యర్ధుల గొప్పతనం కాదన్నది నిష్ఠుర నిజం. అయితే ఇందులో కొందరికి మినహాయింపు ఉండవచ్చేమో గానీ, అధిక శాతమయితే కేవలం జగన్‌పై వ్యతిరేకతతోనే అసెంబ్లీలో కాలుపెట్టారన్నది నిజం. ఈ నిజాన్ని అర్ధం చేసుకుని ఒళ్లు దగ్గరపెట్టుకుని పనిచేసిన వారే, మళ్లీ అసెంబ్లీలో కాలుపెట్టగలరు.
ఈ వాస్తవాలు విస్మరించి, తమ వల్లే పార్టీ గెలించిందన్న భ్రమల్లో చాలామంది ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాలను, ప్రజలు స్వాగతిస్తారనుకుంటే అది కూడా భ్రమే అవుతుంది. కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ జమానా నాటి ఎమ్మెల్యేల కంటే దారుణంగా వ్యవహరిస్తున్న తీరు, కచ్చితంగా కూటమి వ్యతిరేక ఖాతాలోకే వెళుతుంది. చాలామంది ఎమ్మెల్యేలు పాపం.. పోలింగ్ ముగిసి, ఎమ్మెల్యే తీసుకునేముందు వరకు మాత్రమే విశ్రాంతి తీసుకున్నారట. ఇత తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకూ అవిశ్రాంతంగా ‘నిద్రలేని రాత్రులు’ గుడుపుతూ, ‘అదేపనిలో’ ఉన్నారన్న వ్యంగ్యాస్త్రాలు పార్టీ కార్యకర్తల నుంచే వినిపిస్తుండటం విశేషం.
నెల్లూరు జిల్లాలో ఒక టీడీపీ ఎమ్మెల్యే.. ఏలూరు నుంచి వచ్చిన ఓ రైతు కొన్న 90 ఎకరాలను, తమకు కారుచౌకగా అమ్మేసి వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేశారట. ఇదే నెల్లూరు జిల్లాలో సిలికా ఇతర రాష్ట్రానికి ‘గంగా’ ప్రవాహంలా.. మైకా అపు‘రూప’ంలా ‘నెల్లూరు పెద్దారెడ్డి’ ఏలుబడిలో మూడు పువ్వులు ఆరు కాయలుగా రవాణా అవుతోందన్నది నెల్లూరు తమ్ముళ్ల ఉవాచ. సిలికా వ్యాపారానికి రోజూ కోటి చొప్పున ‘ప్రసాదం’ పెడుతున్నది నెల్లూరు బహిరంగ రహస్యమేనట. సిలికాకు రోజుకు కోటి, మైకాకు రోజుకు రెండు కోట్ల రూపాయల చొప్పున సంపాదిస్తున్నారని నెల్లూరులో వినిపిస్తున్న టాక్. మరి ఈ ముడుపుల ముచ్చట.. వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న అమరావతి వరకూ వినిపించకపోవడమే వింత. అన్నట్లు ఈ అక్రమ రవాణాను అడ్డుకున్న ఓ కమ్మ సీఐని, ఆ మధ్య ‘నెల్లూరు పెద్దారెడ్డి ఫ్యామిలీ’ సెకన్లలోనే శంకరగిరి మాన్యాలు పట్టిస్తే, ఆయనకు ఇప్పటిదాకా పోస్టింగే లేదట. అంటే డబ్బు ప్రభావం ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది. డబ్బు ముందు కులం కూడా దిగదుడేపనన్నమాట.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బాబుకు మిత్రుడైన ఓ దివంగత మాజీ మంత్రి తనయుడి వికృత చేష్టలు చూసి, అప్పటి ‘టెన్ పర్సెంట్ వైసీపీ ఎమ్మెల్యే’ చాలా బెటరనుకుంటున్న పరిస్థితి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒక మహిళా ఎమ్మెల్యే చికెన్ షాపుల నుంచి, కేజీకి ఇంత వాటా ఇస్తేనే వ్యాపారం చేసుకోవాలని హుకుం జారీ చేశారట. ఆమె అసలు ఎవరినీ ఖాతరు చేసే పరిస్థితి లేదట. ఆమె చర్యలపై ఆగ్రహించిన సీఎం.. ఆమెకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఇద్దరు, ప్రతిదానికీ ఒక రేటు కట్టారట. ఇందులో ఒక ఎమ్మెల్యే భర్తగారే అన్నీ చక్కదిద్దుతున్నారట.
విజయవాడ సిటీకి చెందిన ఓ ఎమ్మెల్యే.. తన నియోజకవర్గ పరిథిలో ఎవరు అపార్టుమెంటు వేసినా, వెంచరు వేసినా మామూళ్లు సమర్పించుకోవాలట. విజయవాడకు చెందిన ఓ ‘జాతీయ ప్రముఖుడు’.. జిల్లాలోని ఇసుక, క్వారీ వ్యాపారాల్లో తలదూరుస్తున్నారట. యువనేత పేరు బాగా వాడుతున్నారన్నది ఒక ఆరోపణ. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ నుంచి టీడీపీలో చేరి, ఎమ్మెల్యే అయిన మరో ప్రముఖుడు యాష్ వ్యాపారంతోపాటు, ఇసుకను హైదరాబాద్ పంపించే పనిలో బిజీగా ఉన్నారట. ఉమ్మడి విశాఖకు చెందిన ఇద్దరు జనసేన ఎమ్మెల్యేలు, సెజ్ నుంచి బయటకు వచ్చే ప్రతి లారీకి ఇంత అని ఖరీదు కట్టారట. పవన్ హెచ్చరించినా ఆయన మాట కూడా ఖాతరు చేసే పరిస్థితి లేదన్నది జనసేనలో జరుగుతున్న ప్రచారం.
ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఓ ‘రాష్ట్ర స్ధాయి’ ప్రముఖుడు, తన పాత నియోజకవర్గానికి చెందిన పాత అనుచరులకే అన్ని కాంట్రాక్టులూ కట్టబెడుతున్న వైనం, తొలి నుంచీ టీడీపీలో కొనసాగుతున్న నేతలకు అసంతృప్తిగా మారింది. జిల్లాలో ఇసుక, క్వారీ లారీలను విడిచిపెట్టాలని పోలీసులకు హుకుం జారీ చేస్తున్నారట. ఈయన ప్రవేశం తర్వాత, ఆ నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలంతా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నట్లు చెబుతున్నారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన ఒక ‘రాష్ట్ర స్థాయి ప్రముఖుడు’ తన నియోజకవర్గంతోపాటు, కడప జిల్లాలోని మరో నియోజకవర్గాన్ని కూడా తన అల్లుడుగారికి రాసిచ్చేశారట. ఇసుక పాలసీ రాకముందు యార్డుల్లో ఉన్న లక్షల టన్నుల ఇసుకను అల్లుడు గారు సర్దేశారన్న ఆరోపణలు తెలిసినవే. విజయవాడలోని ఒక ప్రైవేట్ హోటల్‌లోనే ఆ ప్రముఖుడి ఆయన డీల్స్ అన్నీ సాగుతున్నాయన్న ప్రచారం బహిరంగమే. నిజానికి గత ఎన్నికల ముందు వరకూ నిజాయితీపరుడిగానే పేరున్న ఆ ప్రముఖుడు, ఫ్యామిలీస్ట్రోక్‌తో అలా తయారన్నది నెల్లూరు తమ్ముళ్లు చెప్పే మాట.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎన్టీఆర్ కుటుంబ కంచుకోట నుంచి వరసగా గెలుస్తున్న మరో ఎమ్మెల్యే.. క్వారీ, మట్టి, ఇసుక లారీలకు ఇంత అని వసూలు చేస్తున్నారట. ఇవన్నీ తెలంగాణ, చెన్నైకి తరలిస్తారట.
బాపట్ల జిల్లాలో బీచ్ ఉన్న ఓ నియోజకవర్గ ఎమ్మెల్యే, వచ్చే ఎన్నికల్లో తాను ఎలాగూ పోటీ చేయడం లేదు కాబట్టి, కాంగ్రెస్‌కు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేతో కలసి దందాలు చే స్తున్నారట. రేషన్ బ్రోకర్ నుంచి రెండు నెలల అడ్వాన్సు కూడా తీసుకున్నారన్నది, పార్టీలో జరుగుతున్న ఓ ప్రచారం. ఎక్కువగా హైదరాబాద్‌లో వ్యాపారాలు చేసుకునే ఈయన, నియోజకవర్గంలో ఉండే సమయం తక్కువేనట.
నెల్లూరులో వైసీపీ నుంచి చేరిన ఓ ప్రజాప్రతినిధి మైకా గనులన్నీ గంపగుత్తగా స్వాధీనం చేసుకుని, ఆయన చెప్పిన రేటుకే అమ్మాలని రూలింగ్ ఇచ్చిన వైనం బహిరంగమే. ఆయనపై ఇప్పటికి మీడియాలో, లెక్కలేనన్ని కథనాలు వచ్చినా చర్యలు శూన్యం. అంటే అలాంటి బడా బాబులకు ఏ స్థాయి మద్దతు ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఉమ్మడి గుంటూరు జల్లాలోని ఒక రాష్ట్ర స్థాయి ప్రముఖుడి నియోజకవర్గంలో, అన్నీ ఆయన సోదరుడే చూసుకుంటారట. అక్కడ ఆయనకు తెలియకుండా చీమ కూడా దూరదన్న ప్రచారం లేకపోలేదు. అక్కడ ఆ రాష్ట్ర స్థాయి ప్రముఖుడు నిమిత్తమాత్రుడేనట.
ఇక చాలామంది ఎమ్మెల్యేలకు రేషన్ బియ్యం మాఫియా నుంచి, ప్రతి నెల 25 లక్షలు ఠంచనుగా ముడుపులు అందుతున్న వైనంతోపాటు.. ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో క్వారీ, ఇసుక, మట్టి లారీలకు ఇంత అని ముక్కుపిండి వసూలు చేస్తున్న వైనం దాచినా దాగనిది. హైదరాబాద్‌కు వెళ్లే లారీలు ఏ నియోజకవర్గాల గుండా వెళితే, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలకు నెలకు 25 లక్షల రూపాయలు సమర్పించుకోవలసిందేనట.
విశాఖ, ఉమ్మడి గోదావరి జిల్లాలకు చెందిన జనసేన కొందరు జనసేన ఎమ్మెల్యేలు కూడా ఎవరినీ ఖాతరు చేయకుండా, ‘సింగిల్ పాయింట్ అజెండా’తో దూసుకుపోతున్నారట. ఉమ్మడి విశాఖ జిల్లాలో ‘బాగా మాట్లాడే’ ఓ ‘రాష్ట్ర స్థాయి’ మహిళా నేత.. చాలా తెలివిగా వసూళ్ల పర్వానికి తెరలేపారట. తనకున్న అధికారంతో పశువులను తరలించే వాహనాలను ఆపి, వారి నుంచి మామూళ్లు చేయిస్తున్నారట. ఎవరైనా ఒక ప్రాజెక్టు మంజూరు పనికోసం వస్తే, ఎంత ఇస్తారని అడగటమే కాకుండా.. వారి పోటీ కంపెనీ ప్రతినిధిని పిలిపించి, మీ కథేమిటని లౌక్యంగా అడుగుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. మొన్నటి వరకూ ఆమె తరఫున ఇలాంటి పనుల కోసం శ్రమదానం చేసిన పీఏను తొలగించారు కూడా.
శ్రీకాకుళం జిల్లాలో నోరున్న ఓ రాష్ట్ర స్థాయి ప్రముఖుడు, ఎవరినీ లెక్కచేయకుండా నాలుగుచేతులా సంపాదిస్తున్నారట. అన్నమయ్య జిల్లాకు చెందిన మరో రాష్ట్ర స్థాయి ప్రముఖుడు మైనింగ్, క్వారీ, ఇసుకలో నాలుగుచేతులా సంపాదిస్తున్నారట. అంతేకాకుండా పశువుల రవాణాకు సంబంధించిన వ్యవహారంలో, తన అధికారం అడ్డుపెట్టుకుని రెండుచేతులా సంపాదిస్తున్నారన్న ఆరోపణ కూడా లేకపోలేదు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మరో రాష్ట్ర స్థాయి ప్రముఖుడు.. తన బావ, తండ్రి ద్వారా ఆ శాఖను దున్నేస్తున్నారన్న ప్రచారం బహిరంగమే.
ఇక వైసీపీ కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేయడమే కాకుండా, ఆ పార్టీలోని వారితో తెరచాటు దోస్తానా చేస్తున్న ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన మరో ప్రముఖుని గాధ, చాలాసార్లు మీడియాకెక్కిన విషయం తెలిసిందే. పులివెందులలో వైసీపీ కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులను, పువ్వుల్లో పెట్టి అప్పగించిన వైనంపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఆ శాఖలో జరుగుతున్న కమిషన్ల రాజ్యంపై, టీడీపీకి మద్దతునిచ్చే మీడియాలోనే లెక్కలేనన్ని కథనాలు రావడం ప్రస్తావనార్హం.
క్యాబినెట్‌లోని చాలామంది మంత్రులు తమ నియోజకవర్గాలను తండ్రులు, భార్యలు, బావలకు అప్పగించారన్నది పార్టీ వర్గాల్లో వినిపించే ఒక విమర్శ. ఉమ్మడి గోదావరి, ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రుల తండ్రులు.. ఎలాంటి ప్రభుత్వ హోదా లేకపోయినా, నేరుగా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా, సమీక్షలు కూడా నిర్వహిస్తున్న వైనం విమర్శలపాలవుతోంది.
ప్రధానంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో బొత్స మేనల్లుడు, చిన్న శ్రీనుతో టీడీపీ ప్రముఖులు అంటకాగుతున్నారని, లాండ్ కన్వెర్షన్ వ్యవహారంలో ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన ఇద్దరు ప్రముఖులు, అక్కడి కలెక్టర్‌తో ఘర్షణ పడుతున్నారన్న ప్రచారం, పార్టీ వర్గాల్లో చాలాకాలం నుంచి వినిపిస్తున్నదే. వైసీపీ జమానాలో చక్రం తిప్పిన చిన్న శ్రీనుపై అనేక ఆరోపణలున్నా.. ఇప్పటివరకూ ఆయన జోలికి వెళ్లకపోవడం బట్టి, విజయనగరం జిల్లాలో ‘కులబంధం’ ఏ స్థాయిలో వర్ధిల్లుతుందో సుస్పష్టం.
నిజానికివి ప్రజలకు సంబంధం లేకపోయినా, వారు అన్నీ గమనిస్తుంటారన్నది తెలుసుకోకపోవడమే అవివేకం. ఇక మళ్లీ గెలవమేమోనన్న ఆదుర్దాతో నియోజకవర్గాలను దున్నేస్తున్న ఎమ్మెల్యేలలో, ఓ 75 మంది మళ్లీ అసెంబ్లీ ముఖం చూసే అవకాశం లేదన్నది పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. నాలుగేళ్లు గడిస్తే ఈ సంఖ్య పెరిగినా ఆశ్చర్యం లేదన్నది విజ్ఞుల ఉవాచ.
ఇక తాజాగా అవినీతికి సంబంధించి శాఖల వారీగా చంద్రబాబునాయుడు విడుదల చేసిన వివరాలు పరిశీలిస్తే.. బాబు ఇంకా అధికారులను నమ్ముతున్నారన్న విషయం అర్ధమవుతోందన్నది సీనియర్ల వ్యాఖ్య. గతంలో కూడా ప్రజల సంతృప్త స్థాయిపై అధికారులిచ్చిన వివరాలను నమ్మి మోసపోయి, మళ్లీ ఇప్పుడు కూడా వారి మాటలే నమ్మటం ఆశ్చర్యంగా ఉందంటున్నారు. బయట జరుగుతున్న వాస్తవాలను తెలుసుకుని, వాటిని నిర్భయంగా అంగీకరించి, దిద్దుబాటు చర్యలు తీసుకోకుండా.. పొగడ్తలు, భుజకీర్తులకు పడిపోతే నష్టపోయేది పాలకులే.
అవినీతికి మారుపేరైన వైద్య, మున్సిపల్, రిజిస్ట్రేషన్, రెవిన్యూ శాఖల్లో పెద్దగా అవినీతి లేదని సీఎంతో చెప్పించడం చూస్తే.. ఎన్నికల ముందు బాబు చెప్పినట్లు కార్యకర్తల రాజ్యం కాకుండా, మళ్లీ అధికారుల రాజ్యమే నడుస్తోందని, మెడపై తల ఉన్న ఎవరికైనా అర్ధమవుతుంది. మొత్తంగా ఏడాది కూటమి పాలన పరిశీలిస్తే.. ఎమ్మెల్యేలపై ఎవరికీ అదుపు లేదన్నది సుస్పష్టం. ‘‘ఎవరి స్థాయిలో వారు సంపాదించుకున్నప్పుడు మేము సంపాదించుకుంటే తప్పేమిటి? వాళ్లు భారీగా సంపాదించుకుంటుంటే మేం మా స్థాయిలో సంపాదించుంటున్నాం’’ అని వారు చెబుతున్న లాజిక్.
ఇక కూటమి అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలాన్ని కార్యకర్తలు పండగగా భావిస్తున్నారా? లేదా అన్నదే నాయకత్వం పరిగణనలోకి తీసుకోవ లసిన కీలక అంశం. టీడీపీ స్థాపించిన తర్వాత నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర పదవులన్నీ ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, జిల్లా కమిటీలు కూర్చుని సిఫార్సు చేసే సంస్కృతి ఉండేది. ఇప్పుడు అందుకు భిన్నంగా ఎంత లావు నాయకుడయినా, ఎన్నేళ్ల వృద్ధుడయినా పార్టీ ఆఫీసులో క్యూలో నిలబడి, అర్జీ ఇచ్చుకునే వైచిత్రి, కేంద్రీకృత వ్యవస్థని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.
విపక్షంలో ఉన్న టీడీపీ కార్యాలయానికి, అధికారంలోకి వచ్చిన ఆఫీసు వాతావరణానికి వ్యత్యాసం, అక్కడి వ్యవహారశైలి కార్యకర్తలను ఏమాత్రం మెప్పించలేకపోతోంది. జనసేన ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో అయితే టీడీపీ క్యాడర్ పరిస్థితి దారుణం. తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయం.
అసలు ఐవిఆర్‌ఎస్ సేవలను కార్యకర్తల మనోగతం తెలుసుకునేందుకు వినియోగించుకుంటే, ఏ సర్వే సంస్థలు కూడా అవసరం ఉండదు. అంటే.. ఈ ఏడాది పాలనలో మీరు సంతృప్తిగా ఉన్నారా? అధికారం వచ్చినందుకు గర్వపడుతున్నారా? మీకు స్థానికంగా తగిన గౌరవం దక్కుతోందా? మీ ఎమ్మెల్యేలు మిమ్మల్ని గౌరవిస్తున్నారా? మీరు సిఫార్సు చేస్తున్న పనులు అవుతున్నాయా? వంటి ప్రశ్నలతో కార్యకర్తల మనోభావాలు తెలుసుకుంటే, అది నాయకత్వం తీసుకున్న భవిష్యత్తు నిర్ణయాలకు అక్కరొస్తుంది.
ఇప్పటిదాకా స్థానికంగా ఉన్న చిన్నపాటి ప్రభుత్వ నామినేటెడ్ పదవులు కూడా భర్తీ చేయకపోగా, స్థానికంగా చిన్న పనులు కూడా కాని పరిస్థితి. ఇప్పటిదాకా వేసిన కార్పొరేషన్లకు డైరక్టర్లనూ నియమించుకోలేని నిర్లిప్తత. తమ ప్రత్యర్ధి వైసీపీ నాయకులకు, తమ కళ్లెదుటే ఎమ్మెల్యేలు పనిచేసి పెడుతున్న వైనం. ఇక వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అయితే, తాము ద్వితీయ శ్రేణి పౌరులమేనన్నది వారి వాదన, వేదన. టిటిడి సిఫార్సు లేఖలకూ దిక్కులేని పరిస్థితి. వైసీపీ నుంచి వచ్చి ఎమ్మెల్యే, మంత్రులయిన వారి నియోజకవర్గాల్లో ‘ఒరిజినల్ టీడీపీ’ శ్రేణుల మనోభావాలను పట్టించుకునే దిక్కులేని పరిస్థితి.
పార్టీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు ఇటీవల పార్టీలో కోవర్టులున్నారంటూ చేసిన వ్యాఖ్య ఆందోళనకరమే కాదు. ఆశ్చర్యం కూడా! వైసీపీ నుంచి తామరతంపరగా చేర్చుకుంటున్న వివిధ స్థాయి నాయకులు, కోవర్టులుగా మారడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. రాయలసీమ, పల్నాడు జిల్లా వంటి ఫ్యాక్షన్ ప్రాంతాల్లోనే ఈ తరహా కోవర్టులు ఎక్కువగా ఉంటారు. గోదావరి, కృష్ణా, విశాఖ వంటి జిల్లాల్లో అయితే అచ్చం వ్యాపార ప్రయోజనాల కోసమే పార్టీలు మారుతుంటారు.
నిజానికి టీడీపీపై ప్రేమతో వారంతా ఆ పార్టీలో చేరరు. స్థానికంగా ఉన్న కేసుల నుంచి తప్పించుకునేందుకో, లేదా రాజకీయ-వ్యాపార ప్రయోజనాల కోసమో అధికార పార్టీల్లో చేరతారు తప్ప, ఆ పార్టీపై ఉన్న ప్రేమ ఉండి కాదన్నది మనం మనుషులం అన్నంత నిజం. మరి వారి నుంచి పార్టీకి విశ్వాసం-విధేయత ఆశించడమే అత్యాశ. అసలు తిరుగులేని భారీ మెజారిటీతో గద్దెనెక్కిన తర్వాత కూడా ఇంకా వైసీపీ నుంచి చేరికలు అవసరమా? కూటమి ఉన్న నేపథ్యంలో.. ఉన్న వారికే న్యాయం చేయలేక సతమతమవుతున్న సమయంలో, బయట నుంచి వలసలను ప్రోత్సహించడం వల్ల ఏం సాధిస్తారు?
మున్సిపల్ మేయర్లు, కార్పొరేటర్లు, చైర్మన్లు, కౌన్సిలర్లు భారీ స్థాయిలో టీడీపీకి వరస కడుతున్నారు. దానితో సహజంగా అవన్నీ టీడీపీ ఖాతాలో జమవుతున్నాయి. మంచిదే. కానీ వారంతా రేపు ఎన్నికల వరకూ ఇదే పార్టీలో కొనసాగుతారన్న గార్యంటీ ఉందా? అసలు ఎమ్మెల్యేలు, ఎంపిలు పార్టీ మారాలంటే రాజీనామా చేసి రావాలన్న నిబంధ ననను, కార్పొరేటర్లు-కౌన్సిలర్లకూ ఎందుకు వర్తింప చేయరు? అలా అమలుచేస్తేనే కదా వారి చిత్తశుద్ధి బయటపడేది? ఒక బస్సులో సీట్ల పరిమితికి మించి లోపల- పైన జనంతో కుక్కితే ఏం జరుగుతుంది?
ముందుగానే చెప్పుకున్నట్లు.. వివిధ వర్గాలు, సంస్థలు, వ్యక్తుల శ్రమదానంతో గద్దెనెక్కిన కూటమి.. ఈ ఏడాదిలో వారిని కృతజ్ఞతాపూర్వకంగా పిలిచి భోజనం పెట్టకపోయినా, వారితో కలసి కప్పు కాఫీ తాగే మర్యాదపూర్వక ప్రక్రియ ఇంతవరకూ ప్రారంభం కాకపోవడమే విచారకరం.
విపక్షంలో ఉన్నప్పుడు షిర్డిసాయి ఎలక్ట్రికల్స్, మేఘా కంపెనీలపై విరుచుకుపడి, వాటిని జగన్ బినామీలుగా ఆరోపించిన పార్టీ నాయకత్వం.. గద్దెనెక్కిన తర్వాత మళ్లీ వాటికే పనులు, బిల్లులూ జమిలిగా ఇవ్వడాన్ని కార్యకర్తలు స్వాగతిస్తారనుకోవడం భ్రమ. ప్రధానంగా షిర్డిసాయి కంపెనీ జగన్ బినామీ అని, అందులో ఎంపి అవినాష్‌రెడ్డి వాటా ఉందని, ఆ కంపెనీ అవసరం లేకపోయినా వేల సంఖ్యలో ట్రాన్స్‌ఫార్మర్లు కొనుగోలు చేయడంవల్ల వందల కోట్ల ప్రజాధనం వృధా అయిందన్న టీడీపీ గళధారుల గత్తర గుర్తే. ఇక మేఘా కంపెనీకి అడ్డగోలు ఆర్డర్లు ఇస్తున్నారని, జగన్ ఆ కంపెనీ కోసం పోలవరం అప్పటి కాంట్రాక్టరును బెదిరించి, తప్పించారని ఇదే టీడీపీ గళధారులు.. భూమి ఆకాశాన్ని ఏకం చేస్తూ చేసిన యాగీ తెలిసిందే. మరి ఇప్పుడు వారిపై చర్యల కొరడా బదులు, వాటికే రెడ్‌కార్పెట్ వేయడాన్ని సగటు కార్యకర్త ఎలా అర్ధం చేసుకోవాలి అన్నదే ప్రశ్న.
పులివెందులలో వైసీపీ కాంట్రాక్టర్లకు అధికారం వచ్చిన తర్వాత ఆర్ధికశాఖ పెద్దలు వంద కోట్ల బిల్లులను పువ్వుల్లో పెట్టి అప్పగించడాన్ని కార్యకర్తలు కన్నెర్ర చేయకుండా, ‘మంచి ప్రభుత్వం’ అని మెచ్చుకుంటారా? డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గుండెలపై కూర్చుని, ఆయనకు మరణమృదంగం వినిపించేందుకు కారణమైన ఐపిఎస్ సునీల్‌ను ఇప్పటిదాకా అరెస్టు చేయకపోవడం.. జగన్ జమానాలో ఆర్ధికశాఖ కార్యదర్శి సత్యనారాయణ అవకతవకలకు పాల్పడ్డారని విపక్షంలో ఉండి ఆరోపించిన త ర్వాతఎఅదే సత్యనారాయణను- లిక్కర్ కేసులో కీలక సూత్రాధారి అని విపక్షంలో ఆరోపించిన వాసుదేవరెడ్డిని, సాక్షికి వందలకోట్లు పంచిపెట్టిన సమాచారశాఖ కమినర్ విజయకుమార్‌రెడ్డిని క్షేమంగా వారి సొంత శాఖలకు చేర్చడాన్ని సగటు కార్యకర్త సంతోషిస్తాడా?
టిటిడి జేఈఓగా ఉన్న ధర్మారెడ్డి అధర్మారెడ్డిగా మారి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించి, ఆనక ఆయనను వదిలేయడాన్ని కార్యకర్తలు మెచ్చుకుంటారా? చంద్రబాబు ఇంట్లో పింక్ డైమండ్ ఉందన్న విజయసాయిరెడ్డి ఆరోపణలు తేల్చరా? అంతెందుకు.. ఎన్నికల ముందు జవహర్‌రెడ్డిని సీఎస్ గా తొలగించాలని, ఆయన కుటుంబం విశాఖలో భూములు దోచుకుందంటూ నానా గత్తర చేసి.. ఇప్పటివరకూ ఆయనపై కన్నెత్తి చూడటాన్ని కార్యకర్తలు వ్యతిరేకిస్తారా? లేక ‘మంచి ప్రభుత్వం’ అని భుజం తడతారా? అసలు ఇన్నెందుకు… కూటమిని గద్దెనెక్కించాలన్న ప్రతీకారేచ్ఛతో రగలి, జగన్ సర్కారుపై గజ్జెకట్టిన కమ్మ సామాజిక వర్గం, ఆ వర్గానికి చె ందిన అధికార, వ్యాపారగణం ఈ ఏడాదిలో సంతోషంగా ఉందా? లేదా? అన్నది ఐవిఆర్‌ఎస్ సర్వేలో అడిగితే సరి!
సీనియర్లను పక్కనపెట్టి కొత్తవారితో కొలువు తీరిన మంత్రివర్గం కార్యకర్తలు-పార్టీ-ప్రభుత్వాన్ని మెప్పిస్తుందా అన్నది మరో ప్రశ్న. నాయకత్వంలో మార్పులొచ్చినప్పుడు.. కొత్తనీరు వచ్చినప్పుడు పాత నీరు కొట్టుకుపోవడం సహజం. మరి ఆ కొత్త నీరు, కూటమి పరువు నిలబెడుతోందా? పరువుతీస్తోందా? అని కూడా బేరీజు వేసుకోవాలి కదా? ఏడాది పాలనలో శాఖాపరంగా జరిగిన అభివృద్ధిపై నివేదికలిచ్చి, వాటిని మీడియా ద్వారా ప్రజలకు చెప్పాలని చంద్రబాబు క్యాబినెట్‌లో చెప్పి నెలదాటింది. ఒక్క సత్యకుమార్ యాదవ్ మినహా, ఇప్పటిదాకా ఒక్క మంత్రి ప్రగతి నివేదికలిస్తే ఒట్టు. అంటే మంత్రులు ఎంత బాధ్యతతో పనిచేస్తున్నారో అర్ధమవుతూనే ఉంది. అన్ని పనులూ చంద్రబాబునాయుడు, లోకేషే చేయాలనుకుంటే.. చేస్తే.. ఇక మంత్రులు ఉన్నది ఎందుకన్నది సగటు కార్యకర్త ప్రశ్న.
మంత్రివర్గంలో ఫరూఖ్, ఆనం రామనారాయణరెడ్డి, అచ్చెన్నాయుడు, నారాయణ, పార్ధసారథి, పయ్యావుల కేశవ్, రవీంద్ర సీనియర్లు. వీరిలో కేశవ్ మంత్రి కావటం ఇదే తొలిసారైనా, ఆయన పాత సైనికుడే. మిగిలిన వారంతా కొత్తగా మంత్రులయిన వారే. వీరిలో జగన్ అండ్ కో గత ఏడాది నుంచి సంధిస్తున్న విమర్శనాస్త్రాలను తిప్పికొట్టడంతో, ప్రభుత్వ కార్యక్రమాలను ఎంతమంది ఏ మేరకు ప్రచారం చేస్తున్నారంటే వచ్చే సమాధానం శూన్యం. రవీంద్ర జిల్లా స్థాయిలో వైసీపీని సమర్ధవంతంగా ఎదుర్కొంటుంటే.. నారాయణ, ఫరూఖ్ నుంచి పలుకే బంగారమయిందంటున్నారు. పార్ధసారథి అప్పుడప్పుడు జగన్‌పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన తల్లికివందనంపై వస్తున్న ఆరోపణలను ఖండించాలని, పార్టీ ఆఫీసు నుంచి ఆదేశాలు వస్తే తప్ప.. చాలామంది మంత్రులు నోరువిప్పలేదంటే, క్యాబినెట్ ఎంత చురుకుగా పనిచేస్తుందో అర్ధమవుతుంది.
ఇటీవల జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించిన చర్చలో అమరావతి మహిళను అవమానించిన వైనంతోపాటు.. నిరసన తెలిపిన అమరావతి ప్రజలను సంకర జాతి అని విమర్శించిన సజ్జల రామకృష్ణారెడ్డిపై నోరెత్తకుండా, మంత్రులంతా మూడవ నెంబరేసుకుని ముడుచుకుని కూర్చున్న క్రమంలో, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వారిద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారంటే.. మంత్రుల సత్తా ఏమిటి? అలాంటి మౌనమునులకు పదవులిచ్చిన నాయకత్వ నిర్ణయం సరైనదేనా? అన్నది తమ్ముళ్లు సంధిస్తున్న ప్రశ్న.
క్యాబినెట్‌లో కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, కొత్తగా మంత్రి అయిన సవిత, అనిత మినహా మిగిలిన ఎవరూ నోరుమెదపడం లేదన్నది ఒక విమర్శ. రాజకీయంగా పాతవారికంటే కొత్తగా మంత్రులైన సత్యకుమార్ యాదవ్, అనగాని, సవిత, అనిత, దుర్గేష్ పనితీరే బాగుందన్నది కార్తకర్తల కితాబు. మంత్రి సవిత పనితీరు ముందు, చాలామంది సీనియర్లు తేలిపోతుండటం ఆశ్చర్యం. ఇక సహజంగా కొత్తగా మంత్రులయిన వారు తమ సత్తా చాటి, సీఎంలను మెప్పించే ప్రయత్నం చేస్తుంటారు. కానీ తాజా క్యాబినెట్‌లో కొత్తగా మంత్రులయిన చాలామంది, ‘అధికారంలో ఉన్నప్పుడే నాలుగురాళ్లు’ వెనకేసుకుందామన్న ఆత్రుతతో, సింగిల్‌పాయింట్ అజెండాతో పనిచేస్తున్నారన్నది మెజారిటీ కార్యకర్తల ఉవాచ.
నిజానికి వీరందరిలో సీనియర్ అయిన ఆన ం ఎందుకు మౌనంగా ఉంటున్నారన్నది ఆశ్చర్యం కలిగించే అంశం. ఇక ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో విషయ పరిజ్ఞానం, సమయస్ఫూర్తి, పదునైన ప్రసంగాలతో ప్రత్యర్ధులను నోరుమూయించగలిగే సత్తా ఉన్న.. పయ్యావుల కేశవ్ మౌనరాగమే కార్యకర్తలను ఆశ్చర్యం కలిగించే అంశం. వైఎస్ హయాంలో ఆయన ధాటి ఎలాంటిదో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన శాఖ నుంచి పులివెందుల కాంట్రాక్టర్లకు వంద కోట్ల నిధులు విడుదలయినప్పుడు, పెద్ద ఎత్తున చెలరేగిన విమర్శలకు ఆయన నుంచి సమాధానం కరవు.
ఒక సమయంలో ఆర్ధికశాఖ నుంచి వైసీపీ కాంట్రాక్టర్లకు, మేఘాకు పారించిన బిల్లుల వరదపై అస్మదీయ మీడియాలో సైతం విమర్శలు చెలరేగాయి. సొంత జిల్లాలో జగన్ పర్యటన-తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి విచ్చలవిడితనంపై జిల్లా మంత్రిగా స్పందించకపోవడమే ఆశ్చర్యం. అసలు ఏడాది నుంచి జగన్ అండ్ కో రాజకీయంగా రెచ్చిపోతున్న క్రమంలో, ప్రత్యర్ధులపై ఎదురుదాడిలో నిష్ణాతుడిగా పేరున్న కేశవ్.. వారిపై ఎందుకు విరుచుకుపడటం లేదన్నది కార్యకర్తలు, నేతలను విస్మయపరిచే అంశం.
(అయిపోయింది)