మరోమారు బాధితురాలితో మాట్లాడిన మహిళా కమిషన్ చైర్ పర్సన్

-మైనర్ బాలిక అత్యాచార ఘటన కేసులో మరోమారు బాధితురాలితో మాట్లాడిన మహిళా కమిషన్ చైర్ పర్సన్
– తాజా ఆరోపణల నేపథ్యంలో సమగ్ర విచారణకు పోలీసులకు ఆదేశాలు
– బాలిక సంరక్షణ బాధ్యతను నిరంతరం మహిళా కమిషన్ పర్యవేక్షిస్తుందని హామి

అమరావతి: గుంటూరు జిల్లా మైనర్ బాలిక అత్యాచారం కేసులో తాజా ఆరోపణల నేపథ్యంలో ‘మహిళా కమిషన్’ మరోమారు సీరియస్ గా దృష్టి సారించింది. ఘటన వెలుగుచూసిన వెంటనే మహిళా కమిషన్ స్పందనతో కేసులో ఇప్పటికే 64 మందిని పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక సంరక్షణ కేంద్రంలో ఉన్న బాధితురాలిని కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కలిసి మాట్లాడారు.

దర్యాప్తులో ఏమైనా లోపాలున్నాయనే విషయాన్ని ఆమెను అడిగి తెలుసుకున్నారు. ఈ కేసుపై గుంటూరు అర్బన్ ఎస్పీతో కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడారు. బాధితురాలి కేసును విభిన్న కోణాల్లో మరింత సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు.

ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ బాధితురాలికి జరిగిన అన్యాయం పరమ దుర్మార్గమన్నారు. పుండు మీద కారంలా ఈ ఘటనను కొందరు స్వార్ధ ప్రయోజనాలకు వాడుకుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. మహిళా కమిషన్ కార్యాలయానికి బాధితురాలి తండ్రిని పిలిపించి మాట్లాడారు. బాధితురాలిని దత్తత ఎప్పుడు తీసుకున్నారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటన వెనుక ఎవరు ఉన్నప్పటికీ వదిలే ప్రసక్తే లేదని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు.