– మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు
అసఫ్ జాహీల నిర్మాణశైలితో ఉన్న అసెంబ్లీ పాత భవనాన్ని.. అదే నిర్మాణ కౌశలంతో అద్భుతంగా పునరుద్ధరిస్తున్నమని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు.
అసెంబ్లీ ప్రాంగణంలోని హెరిటేజ్ భవనమైన పాత అసెంబ్లీ భవన పునర్నిర్మాణంపై స్పీకర్ ఛాంబర్ లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మరియు వైస్ ఛైర్మన్ బండా ప్రకాష్ తో కలిసి భవన నిర్మాణ పురోగతిపై సమీక్షించారు.
భవనాన్ని పునర్నిర్మిస్తున్న ఆగాఖాన్ ప్రతినిధులు, ఆర్ అండ్ బీ అధికారులు మరియు అసెంబ్లీ సెక్రెటరీ నర్సింహాచార్యులుతో సమావేశం నిర్వహించిన ఇరువురు మంత్రులు రాబోయే రెండు నుంచి మూడు నెలల్లో భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని.. ఎక్కడా చారిత్రక వైభవానికి ఇబ్బందులు లేకుండా భవనాన్ని సర్వాంగ సుందరంగా తిర్చిదిద్దాలని ఆగాఖాన్ ప్రతినిధులకు దిశానిర్ధేశం చేశారు.
భవనానికి కావల్సిన ఎలక్ట్రిఫికేషన్ వ్యవస్థ మరియు ప్లంబింగ్ పనులపై టెండర్లు పిలవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమావేశంలో పాల్గొన్న ఆర్ అండ్ బీ స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందనకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు, ఆగాఖాన్ ట్రస్ట్ కు సంబంధించిన పెండింగ్ లో ఉన్న రూ. 2 కోట్ల రూపాయల నిధులను సమావేశం నుంచే ఉపముఖ్యమంత్రితో మాట్లాడి.. అప్పటికప్పుడే విడుదల చేయించారు.
బిల్లుల కోసం ప్రజోపయోగమైన పనులు ఆపొద్దని అధికారులకు సూచించిన మంత్రి.. ఏదైనా బిల్లులు పెండింగ్ లో ఉంటే తనకు గానీ.. సహచర మంత్రి శ్రీధర్ బాబుకు చెప్పినా వెంటనే నిధులు విడుదల అయ్యేలా చూస్తామని చెప్పారు.
ఈ హెరిటేజ్ భవనం అందుబాటులోకి వస్తే.. కౌన్సిల్ హాల్ ను అసెంబ్లీ భవనంలోకి మార్చవచ్చని.. పార్లమెంట్ తరహాలో వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే ప్రజలకు అసెంబ్లీ మరింత చెరువ అవుతుందని ఆయన తెలిపారు. పార్కింగ్, సెక్యూరిటీ సిబ్బందికి ప్రత్యేక గదులను నిర్మించాల్సిన అవసరం ఉందని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
సమావేశంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు.. పనులు వేగంగా సాగేందుకు ప్రత్యేకంగా ఒక ఎస్.ఈ స్థాయి అధికారిని నియమించి పనులను పర్యవేక్షించాలని ఆర్ అండ్ బీ స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందనకు ఆదేశాలు జారీ చేశారు. పనుల్లో అలసత్వానికి తావులేకుండా పర్యవేక్షణ చేయాలని సూచించారు.
లోక్ సభ, రాజ్యసభ లో ఉన్నట్టుగానే అసెంబ్లీ భవన ప్రాంగణంలోనే సెంట్రల్ హాల్ ను కూడా అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన తెలిపారు. అంతేకాదు, తన ఐటీ శాఖ ద్వారా అసెంబ్లీకీ అవసరమైన నెట్ వర్కింగ్ సేవలను అందించేందుకు కావాల్సిన ప్రతిపాదనలు పంపిస్తే వెంటనే ఆమోదం తెలుపుతానని ఆయన తెలిపారు.