Suryaa.co.in

Telangana

వడ్లు కొనుగోలులో మంత్రి గంగుల తీరు దొంగే దొంగ అన్నట్లుగా ఉంది.

– నేనే బాధ్యత వహించి ప్రతి గింజ కొంటా అన్నోడు ధర్నాలు చేయడం ఎందుకో..?
– ఓట్లు కొనే గంగులకు రైతుల వడ్లు కొనే సత్తా లేకపోవడం సిగ్గుచేటు.
-వడ్ల కొనుగోలు తీర్మానాల పేరుతో డ్రామాలు ఆడుతున్న తెరాస సర్కార్.
– మిల్లుల్లో పేరుకుపోయిన రెండు సీజన్ల ధాన్యం పై నోరు విప్పని గంగుల.
– తీరు మార్చుకో లేకపోతే రైతుల ఆగ్రహానికి గురవుతారు.
– మంత్రి గంగులకు బీజేపీ రాష్ట్ర నాయకులు బేతి మహేందర్ రెడ్డి తీవ్ర హెచ్చరిక.

యాసంగి పంట వడ్ల కొనుగోలు విషయంలో రైతులను తప్పుదారి పట్టించడానికి పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ రోజుకో దొంగ డ్రామా ఆడుతూ దొంగే దొంగ అన్నట్లుగా వ్యవహారిస్తున్నారని బీజేపీ రాష్ట్ర నాయకులు బేతి మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తీవ్రంగా విమర్శించారు.

కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యాసంగిలో 7.52 లక్షల ఎకరాల్లో వరి పంట రైతులు పండించారని, ఈ పంట ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 18 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉండగా, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తీరు వరి పండించిన రైతులను నోట్లో మట్టి కొట్టేటట్టు వ్యవహరిస్తూ ఒకరోజు ధాన్యాన్ని తూర్పార పడుతూ, తన ఇంటి పై నల్ల జెండా ఎగురవేస్తూ, మరో రోజు జెడ్పి సర్వసభ్య సమావేశంలో తీర్మానాన్ని ప్రవేశపెడుతూ, జాతీయ రహదారుల పై టెంట్లు వేసి రాస్తారోకోలు చేసి రోడ్లు దిగ్బంధం చేయడం, చివరికి ఢిల్లీలో ధర్నాలు చేయడం లాంటి రోజుకో డ్రామా ఆడుతూ రైతులను అయోమయానికి గురిచేస్తున్నాడని బేతి మహేందర్ రెడ్డి తీవ్రంగా దుయ్యబట్టారు.
యాసంగి పంట కోతకు సిద్ధంగా ఉన్న నేటివరకు ఐకెపి సెంటర్లు తెరువకపోవడం, పిఏసీఎస్, డీసీఎంఎస్ ల ద్వారా ఎక్కడెక్కడ ఏ కేంద్రాలు ఏర్పాటు చేయాలనేది మీద స్పష్టత లేకపోవడం, అలాగే గన్నీ సంచులు, ప్యాడీ క్లినర్లు, తూకం యంత్రాలు, అలాగే కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు లాంటి చర్యలు చేపట్టకపోవడం మంత్రి గంగుల చేతగానితనానికి నిదర్శనమని బేతి మహేందర్ రెడ్డి ఘాటుగా ఆరోపించారు. అలాగే 35 వేల ఇళ్ల పై నల్ల జెండాలు, ప్రతి రైతు ఇంటి పై నల్ల జెండాలు ఎగురవేస్తామని ప్రగల్భాలు పలికిన మంత్రి గంగుల తన ఇంటి పై తప్ప ఎక్కడ కూడా నల్ల జెండాలు రైతులు కానీ, మీ తెరాస కార్యకర్తలు కానీ ఎగురవేయలేదని మహేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు.

అలాగే భాజపా కార్యకర్తలు, మండల స్థాయి నాయకులు కేంద్రానికి వ్యతిరేకంగా నల్ల జెండాలు ఎగురవేసారని నీచపు, అబద్ధపు మాటలు మాట్లాడడం గంగుల కమలాకర్ గారికే చెల్లిందని మహేందర్ రెడ్డి విమర్శించారు. మంత్రి గంగుల హయాంలో దళారులు మాయతో రైతులను నష్టానికి గురిచేస్తు ఆర్థికంగా దెబ్బతిస్తున్నారని, అందుకే ఆర్థిక ఇబ్బందులతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అలాగే తెరాస ప్రభుత్వ సూచనతో వరికి బదులు యసంగిలో ఇతర పంటలు వేసిన రైతులను కూడా మోసగిస్తున్నదని, అలాగే మిల్లుల్లో పేరుకుపోయిన రెండు సీజన్ల ధాన్యం పై నేటివరకు పౌరసరఫరాల శాఖ మంత్రి నోరు విప్పలేదని, మీడియా ముందు మాత్రం ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ప్రతి ధాన్యం గింజ కొంటామని, దానికి పూర్తి బాధ్యత నేనే వహిస్తానని విలేకరుల ముందు ప్రగల్భాలు చెప్పడం మంత్రి గంగులకే సాధ్యమని మహేందర్ రెడ్డి ఆరోపించారు.

మంత్రి గంగులకు ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు ఉన్న శ్రద్ధ రైతుల వడ్లు కొనే సత్తా లేకపోవడం సిగ్గుమాలిన చర్యగా భావిస్తూ, ఇప్పటికైనా మంత్రి గంగుల కమలాకర్ తీరు మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో రైతుల అగ్రహానికి గురికాక తప్పదని, అలాగే యాసంగి వడ్ల కొనుగోలు విషయంలో నిర్లక్ష్యం వహిస్తే తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల ఇండ్లు ముట్టడిస్తామని బీజేపీ రాష్ట్ర నాయకులు బేతి మహేందర్ రెడ్డి హెచ్చరించారు.

LEAVE A RESPONSE