నెల్లూరు పౌర సరఫరాల సంస్థలో జరిగిన భారీ కుంభకోణంలో జిల్లా మంత్రి హస్తం

మంత్రులకు వాటా లేకుండా ఇంత పెద్ద కుంభకోణం జరిగే ప్రసక్తే లేదు
రెండున్నరేళ్లలో ఆ శాఖను పర్యవేక్షించే నలుగురు జేసీలను మార్చేయడం కూడా కుంభకోణంలో భాగమే
జిల్లా మంత్రి ఆశీస్సులతోనే కృష్ణపట్నం ఓడరేవు మీదుగా రేషన్ బియ్యం ఎగుమతులు
ఆస్ట్రేలియా నుంచి వచ్చే ప్రతినిధులకు ఆర్బీకేల కేంద్రంగా జరుగుతున్న అవినీతిని, రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని చూపిస్తారా?
రైతుల కోసమే బతుకుతున్నాం…ప్రతి గింజా కొంటామని జగన్మోహన్ రెడ్డి ఉత్తుత్తి సమీక్షలు పెట్టడం కాదు..ఈ కుంభకోణాల గురించి తేల్చండి
నెల్లూరులో తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డితో కలిసి మీడియాతో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

కుంభకోణాలకు కేంద్రంగా నెల్లూరు జిల్లా మారిపోయింది.క్రైమ్ కమ్ కరెప్షన్ కేపిటల్ గా నెల్లూరును నాలుగో రాజధానిగా ప్రకటిస్తారేమో?నెల్లూరు సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ లో రెండున్నరేళ్లలో రూ. 29.78 కోట్లు కుంభకోణం జరిగిందని ఉన్నతాధికారులే తేల్చారు.ఇప్పటికి బయటపడింది ఈ రూ.29.78 కోట్లే..లోతుగా విచారిస్తే ఇంకా ఎన్ని కోట్లు వెలుగులోకి వస్తాయో.

ప్రతి నెలా కోట్లకు కోట్లు దోపిడీ చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది…మంత్రులకు వాటా లేకుండా ఇంత పెద్ద కుంభకోణం జరగదు.ఇంత భారీ కుంభకోణం జరుగుతున్నా జిల్లా మంత్రి కానీ, ఇన్ చార్జీ మంత్రి కానీ, పౌరసరఫరాల శాఖ మంత్రి కానీ నోరుతెరవకపోవడమే అందుకు నిదర్శనం.చిన్న చిన్నోళ్ళు 11 మందిని సస్పెండ్ చేసి, కేసులు పెట్టి చేతులు దులుపుకుంటున్నారు..కానీ ఈ రూ.29.78 కోట్లలో మెజార్టీ వాటా జిల్లాకు చెందిన ఓ పెద్దమనిషికి చేరిందని తెలుస్తోంది.

జిల్లా మంత్రికి మేజర్ వాటా ఉందని తెలియడంతో ఇన్ చార్జి మంత్రి, పౌరసరఫరాల శాఖ మంత్రి నోరు మెదపడం లేదు.రెండున్నరేళ్లుగా మిల్లింగ్ చార్జీలు రూ.240 కోట్లు, ఈ క్రాఫ్ బుకింగ్ లో ఫ్రాడ్ జరిగిందని రైతులకు రూ.100 కోట్లు చెల్లించకుండా ఆపేశారు.పొదుపు సంఘాలకు ఇవ్వాల్సిన కమిషన్ రూ.5 కోట్లు, హమాలీలకు రూ.10 కోట్లు చెల్లించలేదు..అసలు ఇది ప్రభుత్వమేనా?

ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతులకు ఆర్నెళ్ల ఆలస్యంగా డబ్బులు ఇవ్వడానికి మీకు మనస్సెలా వస్తోంది.ధాన్యం కొనుగోలు చేసిన రోజే రవాణా చార్జీలు చెల్లించివుంటే ఈ రోజు రూ.30 కోట్ల కుంభకోణానికి ఆస్కారం ఉండేదే కాదు.రేషన్ బియ్యం విషయంలోనూ భారీ కుంభకోణం జరుగుతోంది..లబ్ధిదారుల వద్ద కిలో రూ.10కి బియ్యం కొనుగోలు చేసి కృష్ణపట్నం పోర్టు ద్వారా విదేశాలకు తరలించి వందల కోట్లు సంపాదిస్తున్నారు.

కృష్ణపట్నం పోర్టులోనూ జిల్లాలోని పెద్దమనిషి దందా సాగుతోంది. ముత్తుకూరు, వెంకటాచలం, కృష్ణపట్నం పోలీసులు చేతులు తడిపి ఆ పెద్దమనిషి ఆశీర్వాదం తీసుకుని బియ్యాన్ని ఓడల్లోకి ఎక్కిస్తున్నారు. నెల్లూరులో వందల కోట్ల కుంభకోణాలు, అక్రమాలు జరుగుతుంటే తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు.

లేదంటే హోల్ సేల్ గా రాష్ట్రాన్ని నేను దోచుకుంటున్నాను.. జిల్లాలను మీరు దోచుకోండని మంత్రులు, ఎమ్మెల్యేలకు పంచిపెట్టేశారా…జగన్మోహన్ రెడ్డీ?విదేశాలకు రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న కుంభకోణంపైనా విచారణ జరపాలి. పౌరసరఫరాల సంస్థలో జరిగిన రూ.30 కోట్ల కుంభకోణంలో జిల్లాలోని పెద్దల పాత్రను తేల్చి బొక్కలో వేయాలి.

మంత్రి హస్తం లేకుండా ఇంత పెద్ద కుంభకోణం జరిగే ప్రసక్తే లేదు.ఈ కుంభకోణం ఒక్క నెల్లూరు జిల్లాకే పరిమితమైందా..లేదా రాష్ట్రమంతా విస్తరించిందా…అనే అంశంపైనా విచారణ చేయాలి.రైతు భరోసా కేంద్రాలను రైతు భక్షక కేంద్రాలను మార్చి అన్నదాతలను నిలువు దోపిడీ చేస్తున్నారు.ఆస్ట్రేలియా వాళ్లు ఆర్బీకేలను చూడటానికి వస్తున్నారంట..వాళ్లొచ్చి ఈ మోసాలను, దందాలను చూడాలా..రైతుల్ని ఎలా దోచుకుంటున్నారో వారికి చూపిస్తారా? కనీస మద్దతు ధర విషయంలో ఏపీ రైతులే దేశంలో ఎక్కువగా నష్టపోతున్నారని సీఏసీపీ మీ ముఖాన ఊస్తే ఒక్క మంత్రి స్పందించలేదు.

Leave a Reply