– కడుపులోనే పిండవుతున్న పిండాలు
– మహిళలను గొడ్రాలిగా మారుస్తున్న హెటిరో విష వ్యర్థాలు
– ఉప్పుటేరులో కలిపేస్తున్న హెటిరో రసాయన వ్యర్ధాలు
-ఇప్పటికే రాంకీ ఫార్మా దారుణాలతో జనం అతలాకుతలం
– విష వ్యర్ధాలతో లక్షల సంఖ్యలో చనిపోతున్న చేపలు
– జీవనోపాథి కోల్పోయి రోడ్డెక్కుతున్న మత్య్సకారులు
– ఆవుల మరణాలకు లెక్కేలేదు
– ఉన్న చావులు సరిపోక కొత్తగా బల్క్ డ్రగ్ పార్కు
– భూములిచ్చేందుకు రైతుల ప్రతిఘటన
– మత్య్స సంపద మృత్యు ఘోష
– అనకాపల్లిలో సర్కారీ ‘రెడ్డి’కార్పెట్
-మత్స్యకారుల పల్లెల్లో మరణ మృదంగం
(మార్తి సుబ్రహ్మణ్యం)
చేప చేపా ఎందుకు చచ్చిపోతున్నావ్?
– ఏమో మమ్మల్ని చంపేస్తున్న హెటిరో డ్రగ్స్ వాళ్లను అడగండి
చేప చేపా ఎందుకు చచ్చిపోతున్నావ్?
– ఏమో.. ఎలాంటి చర్యలూ తీసుకోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డును అడగండి
చేప చేపా ఎందుకు చస్తున్నావ్?
– ఏమో.. మమ్మల్ని పట్టించుకోకుండా పడుకున్న పాలకులను అడగండి
– ఇదీ అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో హెటిరో డ్రగ్స్ కంపెనీ విడుదల చేస్తున్న విష వ్యర్థాల పుణ్యాన కళ్లుతేలేస్తున్న ‘మీన’ రాశి మృత్యు ఘోష.
* * *
మీన రాశి వారికి ఫలానా వారంలో బాగా కలసివస్తుంది. ఆ వారంలో వారు పట్టుకున్నదంతా బంగారమే అవుతుంది. శుభవార్తలు వింటారు. అనుకోని అదృష్టం కలసి వస్తుంది. ఫలానా పూజ చేస్తే ఇంకా ప్రయోజనం.
– ఇవి సహజంగా పంచాంగంలో కనిపించే జోస్యాలు. అంటే మీన రాశి అంత బలమైనదన్నమాట. మీనం అంటే చేప. మరి మనుషులకు ఇన్నేసి లాభాలు ఉన్నాయని చెప్పే పంచాంగం.. పాపం అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో, లక్షల సంఖ్యలో మృత్యువాత పడి ఒడ్డుకు చేరుతున్న తనను బతికించుకునే ఉపాయం కూడా చెబితే బాగుండేది. అంటే మీన రాశి తన భవితవ్యం ఆలోచించకుండా, ప్రజల బాగోగులు చెప్పే త్యాగరాజు/రాణి అయిందన్నమాట!
* * *
అనకాపల్లి జిల్లాలో అటు రాంకీ ఫార్మా, ఇటు హెటిరో డ్రగ్స్ కంపెనీలు జన-జంతు,జలచరాలను జమిలిగా నాశనం చేస్తున్నాయన్న ఆరోపణలు, ఆధారాలతో సహా లభించినా అధికారుల్లో చలనం శూన్యం. పోనీ వాటికి ‘ఎక్సపయిరీ డేటు’ ముగిసి, ఆయువు తీరి కళ్లుతేలేస్తున్నాయా అంటే అదీ కాదు. ఆ రెండు కంపెనీలే వాటి ఆయువు తీస్తున్నాయి. ఇప్పటికే రాంకీ ఫార్మాకి సంబంధించిన ఉల్లంఘనలకు లెక్కలేనన్ని ఆధారాలు లభించినా, పొల్యూషన్ కంట్రోల్బోర్డులో కదలిక లేదు. నోటీసులు-రాయబేరాలతో సరి.
అది వైసీపీకి చెందిన ఒక ఎంపీదని తెలిసినా.. సదరు రెడ్డిగారి కంపెనీకి ఇంకా ‘రెడ్డి’కార్పెట్ వేస్తున్నారే తప్ప, చర్యల కొరడా ఝళిపిస్తున్న పాపాన పోలేదు. మరి అందుకు ఏ బంధం అడ్డువస్తుందో పైవారికి ఎరుక?! లేక ఇవన్నీ ‘మామూలే’నని సర్దుకుపోతుందా అన్నదీ తెలియదు.
* * *
తాజాగా మరో రెడ్డిగారికి చెందిన హెటిరో డ్రగ్స్ కంపెనీ కాటేస్తున్న మత్స్య సంపద గురించి… పౌర సమాజం-పత్రికలు ఘోష పెడుతున్నా, అది కూడా పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు చెవికెక్కడం లేదు. బల్క్‌డ్రగ్ పార్కు మాకొద్దంటూ రోడ్డెక్కిన మత్స్యకారులు.. హెటిరో డ్రగ్స్ విష వ్యర్థాలతో చేపలు చస్తున్నాయని మొత్తుకుంటున్నా పీసీబీకి పట్టకపోవడం దారుణం. మొత్తంగా అనకాపల్లి జన-జంతు,జలచరాలను జమిలిగా నాశనం చేస్తున్న రెడ్డిగార్ల కంపెనీకి ‘రెడ్డి’కార్పెట్టుగా మారిందే తప్ప.. ఆ రెండు కంపెనీలకు ముకుతాడు వేసే మొనగాడే కరవయ్యారు.
ఉప్పుటేరులో కలుస్తున్న ఆర్తనాదాలు
రాజయ్యపేట ఉప్పుటేరులో తరచూ చేపలు మృత్యువాత పడటం సాధారణంగా మారింది. పోనీ అవేమైనా వాటి ఆయువు తీరి చచ్చిపోతున్నాయా అంటే అదీ కాదు. వర్షం కురిసినప్పుడల్లా హెటిరో డ్రగ్స్ కంపెనీ తన విష వ్యర్థాలను ఉప్పుటేరులో వదలడంతో, చేపలు లక్షల్లో చచ్చిపోతున్నాయన్న మత్స్యకారుల వేదన ఇప్పటికీ అరణ్యరోదనగానే మారింది.
రాజకీయ నాయకులు-మీడియా సంస్థలకు సొంత అజెండాలుంటాయి కాబట్టి, అబద్ధాలు చెబుతారనుకోవచ్చు. కానీ చేపల వృత్తిపై ఆధారపడే మత్స్యకారులే.. చేపలు ఎందుకు చనిపోతున్నాయన్న వీడియోను స్వయంగా కలెక్టరమ్మకు చూపినా, చర్యలు శూన్యం. ఇటీవల ఆ గ్రామానికి వచ్చిన కలెక్టరమ్మకు మత్స్యకారులు తమ విషాదగాథ వినిపించారు.
నిజానికి ఉప్పుటేరులో హెటిరో అఘాయిత్యాల గురించి మత్స్యకారులు పీసీబీ అధికారులు ఇప్పటికి లెక్కలేనన్నిసార్లు ఫిర్యాదు చేశారు. సహజంగా తుపాన్ల సమయంలో వేటకు వెళ్లే అవకాశం లేని మత్స్యకారులు, ఉప్పుటేరులో చేపల వేటకు వెళ్లే సంప్రదాయం కొన్ని దశాబ్దాల నుంచి ఉంది. అయితే హెటిరో డ్రగ్స్ వర్షం వచ్చిన ప్రతిసారీ తన విష వ్యర్ధాలను ఉప్పుటేరులో కలపడంతో.. దానిలో ఉండే చేపలు మృత్యువాత పడి, నీటిపైకి తేలియాడుతుండటం మామూలుగా మారిందని మత్స్యకారులు మీడియాకు చెప్పినా ఇప్పటిదాకా చర్యలు తీసుకునే దిక్కులేని నిర్లక్ష్యం. దీనితో మత్య్సకారుల జీవనోపాథి ప్రశ్నార్ధకంగా మారి, ప్రభుత్వాన్ని ప్రతిఘటిస్తూ రోడ్డెక్కాల్సిన అనివార్య పరిస్థితి.
ఉప్పుటేరులో హెటిరో డ్రగ్స్ ఉల్లంఘనలకు ఒక్క చేపలే కాదు. పశు సంపద కూడా కనుమరుగవుతున్న విషాదం. ఆ నీళ్లు తాగుతున్న వందలాది ఆవులు మృత్యువాత పడుతున్న దృశ్యాలు తరచూ మీడియాలో వస్తున్నా, పీసీబీది ఇంకా మొద్దు నిద్రనే. ప్రధానంగా ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజలు, క్యాన్సర్ బారిన పడుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. ‘పై నుంచి’ వచ్చే ఆదేశాలు-ఒత్తిళ్ల కౌగిలిలో పీసీబీ సుఖంగా జీవిస్తున్న పరిస్థితి.
మా ప్రశ్నలకు బదులేదీ?
బల్క్ డ్రగ్‌ను ఏర్పాటుచేసేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వ ప్రయత్నాలను.. మత్స్యసంపదపై ఆధారపడి జీవించే దాదాపు 16 గ్రామాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ, 43 రోజుల నుంచి ధర్నాలు-ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తమకు నచ్చచెప్పేందుకు వచ్చిన అధికారుల వద్ద.. మత్స్యకారులు సంధిస్తున్న ప్రశ్నలకు జవాబు ఉండటం లేదు. ఇప్పటికే హెటిరో డ్రగ్స్ వల్ల జీవనోపాథి కోల్పోయిన తమ నెత్తిన, కొత్తగా బల్క్ డ్రగ్‌ను రుద్దవద్దంటూ మత్స్యకారులు కుటుంబాలతో సహా రోడ్డెక్కి నినదిస్తున్న పరిస్థితి.
ప్రజల ప్రాణాలకు హానిగా మారిన హెటిరో
తమ విష వ్యర్ధాలను ఉప్పుటేరులో కలిపేస్తున్న హెటిరో ఉల్లంఘనతో.. కేవలం చేపలు, ఆవులే కాదు. మనుషులకూ ప్రాణహాని తప్పడం లేదు. ప్రధానంగా క్యాన్సర్ ఆ పేదలను పట్టి పీడిస్తోంది. మహిళలకు గర్భసంచి వ్యాధులు ప్రబలి బిడ్డలకు జన్మనివ్వని విషాదాలు ఆ పేదలకు అలవాటుగా మారింది. హెటిరో వదిలేస్తున్న విష వ్యర్ధాలతో.. పిండం కడుపులో ఉన్నప్పుడు స్కానింగ్ చేయిస్తే, అంగవైకల్యం బయటపడుతున్న దారుణ విషాదం. ‘‘ మరి కడుపులోని పిండాన్ని చంపుకోవాలా? ఉంచుకోవాలా? మా పిండాలను చిదిమేస్తున్న హెటిరోపై ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోవు? వాళ్లతో ప్రభుత్వాలకు ఉన్న లాలూచీ ఏమిటి’ అంటూ శరపరంపరగా ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్న ఆ మత్స్యకార మహిళలకు, జవాబు ఇచ్చే ధైర్యం ఎవరికీ లేదు.
పోనీ ఇవన్నీ పీసీబీ అధికారులకు తెలియవా?.. లక్షణంగా తెలుసు. ఫిర్యాదులు రాలేదా అంటే.. గుట్టల గుట్టల ఫిర్యాదులొస్తూనే ఉన్నాయి. అయినా పీసీబీ పెద్దలు స్పందించరు. కారణం.. ‘మామూలే’! అందరూ మహానటులే. కానీ మృత్యువాత పడుతున్నది మాత్రం మత్స్యకారులే.
భూములిచ్చేది లేదు
మత్స్యకారుల నుంచి ఇంత తీవ్ర ప్రతిఘటన వ్యక్తమవుతున్నా.. బల్క్ డ్రగ్ ఏర్పాటుకు భూసేకరణ ప్రయత్నాలు మాత్రం ఆగకపోవడం, మత్స్యకారుల ఆగ్రహానికి కారణమవుతోంది. ఇప్పటికే హెటిరో దారుణాలతో కుంటుపడిన తమ జీవన పరిస్థితి, మరిన్ని పరిశ్రమలొస్తే ఏమవుతుందోనంటూ రైతులు తమ భూమిని, బల్క్ డ్రగ్ ఏర్పాటుకు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ భూములిచ్చేది లేదని, ప్రాణాలు పోయినా బల్క్ డ్రగ్‌కు భూములిచ్చే సమస్య లేదని అధికారులకు ఖరాఖండిగా తెగేసి చెబుతున్నారు.
అసలు గ్రామ సభలు పెట్టకుండా, పంచాయతీ తీర్మానం చేయకుండా, కేంద్ర అటవీ-పర్యావరణ అనుమతులు లేకుండా అధికారులే చట్టాన్ని ఉల్లంఘించి, మొండిగా ముందుకు వెళుతున్నారంటూ రైతులు విరుచుకుపడుతున్నారు. ఇంత ఆందోళన జరుగుతున్నా లెక్కచేయకుండా, మెరైన్ అవుట్ పాల్ టెండర్లు వేయడం వారిని మరింత రెచ్చగొట్టినట్టయింది.
ప్రజాప్రతినిధులకు పట్టని ప్రజల ప్రతిఘటన
తీరప్రాంత పరిసర గ్రామాల్లో ఎక్కువగా నివసించేది బీసీలే. అందులో మత్య్సకారుల జనాభానే ఎక్కువ. ఇక మిగిలిన ప్రాంతాల్లో కూడా బీసీల జనాభానే అధికం. అనకాపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో గవర, కొప్పుల వెలమ, కాపు, యాదవుల సంఖ్య కూడా ఎక్కువ. అక్కడక్కడా కళింగ, రెడ్డిక కులాలూ లేకపోలేదు. ఇక్కడ అగ్రకులాలు అత్యల్పం. అంతేనా? ఇప్పటి అనకాపల్లి జిల్లా.. ఒకప్పటి విశాఖ ఉమ్మడి జిల్లాలో కూడా బీసీల జనాభానే ఎక్కువ.
జనాభా ఒక్కటే కాదు. 90 శాతం ప్రజాప్రతినిధులంతా బీసీ వర్గాలకు చెందిన వారే. వారంతా కూటమికి చెందిన వారే కావడం మరో విశేషం. కానీ బల్క్ డ్రగ్ ఏర్పాటుతోపాటు.. హెటిరో ఉల్లంఘనలకు వ్యతిరేకంగా అక్కడి బీసీలు, 43 రోజుల పాటు నిర్నిరోధంగా ధర్నాలు చేస్తుంటే, ఒక్క బీసీ ప్రజాప్రతినిధి వచ్చి వారికి బాసటగా నిలిచిన దాఖలా లేకపోవడమే ఆశ్చర్యం. తమ రాజకీయ ఉన్నతికి తరచూ బీసీ కార్డులు వాడే ప్రజాప్రతినిధులు.. తమ బీసీల బతుకులు ప్రమాదంలో పడి రోడ్డెక్కినా, వారికి మద్దతుగా గళం విప్పకపోవడమే బీసీల మనసు గాయపరుస్తోంది.