– సమస్యలపై సమాధానం చెప్పలేకనే తెరపైకి కొత్త అంశాలు
– రాత్రికి రాత్రి కొత్త జిల్లాల ఏర్పాటుపై నోటిఫికేషన్లు ఎందుకు ఇచ్చారు?
– రాజకీయం కోసం కాదు….ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు ఉండాలి
-టిడిపి స్ట్రాటజీ కమిటీ సమావేశంలో చర్చ
అమరావతి: రాష్ట్రంలో అనేక ప్రజా సమస్యలతో పాటు ఉద్యోగుల ఆందోళన, పీఆర్సీ అంశాలను పక్కదారి పట్టించేందుకే జగన్ రెడ్డి జిల్లాల విభజనను తెరపైకి తీసుకువచ్చారని చంద్రబాబు అధ్యక్షతన జరిగిన వ్యూహ కమిటీ సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు.
జనగణన పూర్తయ్యే వరకు జిల్లాల విభజన చేపట్టకూడదని కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అయినప్పటికీ జగన్ రెడ్డి ఏకపక్షంగా జిల్లాల విభజన చేపట్టారు. సమస్యలను పక్కదారి పట్టించడానికి ఈ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. పాలనా సౌలభ్యం, ప్రజా ఆకాంక్షల మేరకు జిల్లాల విభజన ప్రక్రియ ఉండాలి కానీ…ఇలా సమస్యలు తలెత్తేలా నిర్ణయాలు ఉండకూడదని అన్నారు.
స్ట్రాటజీ మీటింగ్ లో చర్చకు వచ్చిన అంశాలు:
కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే తామెందుకు వ్యతిరేకిస్తామని టిడిపి నేతలు అన్నారు. ఎన్టీఆర్ను ఎవరు గౌరవించినా తాము స్వాగతిస్తాం అన్నారు. అయితే ఎన్టీఆర్ కేవలం ఒక ప్రాంతానికి చెందిన నేత కాదని….ఆయనకు భారత రత్న ఇవ్వాలని తాము డిమాండ్ చేస్తున్నామని గుర్తు చేశారు. హైదరాబాద్ లో ఎయిర్ పోర్ట్ కు నాడు ఎన్టీఆర్ పేరును వైఎస్ఆర్ తొలగించినా కూడా, తాము వైఎస్ పేరు కడప జిల్లాకు పెట్టినప్పుడు వ్యతిరేకించలేదని చెప్పారు.
టిడిపికి ద్వంద విధానాలు ఉండవని అన్నారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ విగ్రహాలు ధ్వంసం చేస్తూ, అమరావతిలో ఎన్టీఆర్ స్మృతి వనం ప్రాజెక్టును నిలిపివేసిన జగన్ ప్రభుత్వం….ఎన్టీఆర్ పై తమకు ప్రేమ ఉందని చెప్పే ప్రయత్నాన్ని ప్రజలు నమ్మరని అన్నారు. చివరికి ఎన్టీఆర్ పేరున ఉన్న అన్నా క్యాంటీలను కూడా జగన్ నిలిపి వెయ్యడం నిజం కాదా అని అన్నారు.
జిల్లాల విభజనను అస్తవ్యస్తంగా చేశారు. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా నిర్ణయాలు జరిగిన కారణంగానే…..చాలా చోట్ల నిరసనలు మొదలయ్యాయి. వైసిపి లోనే కొత్త జిల్లాల నిర్ణయంపై వ్యతిరేకత వస్తుందని టిడిపి నేతలు అన్నారు. జనగణన పూర్తయ్యే వరకు జిల్లాల విభజన చేపట్టవద్దని కేంద్రం స్పష్టం చేసినా…… ప్రజలను తప్పుదారి పట్టించేందుకు జిల్లాల విభజనను తెరపైకి తీసుకువచ్చారు.తొందరపాటు నిర్ణయాలతో ఇప్పటికే రాష్ట్రానికి తీవ్ర నష్టం చేసిన సిఎం జగన్… ఇప్పుడు అశాస్త్రీయంగా చేసిన కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రాంతాల మధ్య విభేదాలు తలెత్తే పరిస్థితి తెచ్చారు. కనీసం కేబినెట్ లో కూడా సమగ్రంగా చర్చించకుండా….రాత్రికి రాత్రి నోటిఫికేషన్ విడుదల చెయ్యాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
21వ తేదీ జరిగిన కేబినెట్ లో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఎటువంటి చర్చ జరగలేదు. అయితే 25వ తేదీ రాత్రికి రాత్రి మంత్రులకు నోట్ పంపి ఆమోదం పొందాల్సినంత అత్యవసర పరిస్థితి ఏమి వచ్చింది? రాజధానుల తరలింపు, జిల్లాల ఏర్పాటు వంటి కీలక అంశాలపైనా రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారు.
గుడివాడలో క్యాసినో వ్యవహారంపై టిడిపి చేసిన ఫిర్యాదుపై గవర్నర్ స్పందిచాల్సి ఉందని సమావేశంలో నేతలు అన్నారు. ఏకంగా కేబినెట్ లోని మంత్రి క్యాసినో ఆడించిన ఘటనపై తక్షణ చర్యలు ఉండాలని అన్నారు. ఈ విషయాన్ని వదిలేది లేదని…..పోరాటం కొనసాగిస్తామని చెప్పారు.
ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేష్, కె.అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నిమ్మకాయల చినరాజప్ప, పయ్యావుల కేశవ్, దేవినేని ఉమామహేశ్వరరావు, కేఎస్ జవహర్, నిమ్మల రామానాయుడు, బండారు సత్యనారాయణ మూర్తి, జ్యోతుల నెహ్రూ, ఆలపాటి రాజేంద్రప్రసాద్, టీడీ జనార్థన్, బీసీ జనార్థన్ రెడ్డి, పి.అశోక్ బాబు, కొమ్మారెడ్డి పట్టాభిరాం, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మద్దిపాటి వెంకటరాజు, చింతకాయల విజయ్ పాత్రుడు, జి.వి. రెడ్డి తదితరులు పాల్గొన్నారు.